టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు దక్కేది వీళ్ళకేనా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాస‌నమండ‌లికి వెళ్లే పెద్ద‌ల జాబితా సిద్ధ‌మైంది. తీవ్ర చ‌ర్చ‌లు, సామాజిక వ‌ర్గాల బేరీజు, ఆశావ‌హుల సీనియారిటీ వంటి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ఎట్ట‌కేల‌కు తుది లిస్ట్‌ను త‌యారుచేసిన‌ట్టు తెలుస్తోంది. కొత్త‌గా వ‌చ్చిన వారితో పాటు పార్టీలో ఎంతో కాలం నుంచి కొన‌సాగుతున్న సీనియ‌ర్ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్న విష‌యం తెలిసిందే! ఈ మేర‌కు అనేక త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల అనంత‌రం దీనిని రూపొందిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆరో అభ్య‌ర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం ప‌క్కా ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాను ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత సీఎం అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మొత్తం ఏడు సీట్లు ఖాళీ కానున్నాయి. వీటిలో ఐదు టీడీపీకి, ఒక‌టి ప్ర‌తిప‌క్ష వైసీపీకి దక్క‌నున్నాయి. అయితే ఏడో సీటు కోసం ఇప్పుడు పోటీ నెల‌కొంది. రెండో సీటుకు సరిపోయే శాసనసభ్యుల ఓట్లు లేనందున.. పోటీ జరిగితే రెండవ ప్రాధాన్యత ఓటుతో పాటు కొందరు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడితే గెల‌వ‌వ‌చ్చ‌ని వైసీపీ భావిస్తోంది. అయితే ఈ స్థానాన్ని ద‌క్కించుకోవాల‌ని టీడీపీ కూడా ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఇందులో కొత్త‌గా వ‌చ్చిన వారికి రెండు సీట్లు, సీనియ‌ర్ల‌కు నాలుగు సీట్లు కేటాయిస్తామ‌ని గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే!

ప్రస్తుతం టీడీపీ త‌ర‌ఫున క‌స‌ర‌త్తు పూర్త‌యింది. పార్టీ అభ్యర్థులను ప్రకటించటానికి చంద్ర‌బాబు జాబితా సిద్ధం చేశారు.

సామాజిక,ప్రాంతీయ సమీకరణలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. కమ్మ సామాజిక వర్గంలో రాయలసీమ నుంచి నారా లోకేష్‌కు చోటు ద‌క్కింది. కోస్తాలోని కృష్ణాజిల్లా నుంచి దేవినేని నెహ్రూకు ఎమ్మెల్సీ సీటు దాదాపు ఖాయమైనట్లు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావుకు, ఉత్తర కోస్తాలోని విజయనగరం జిల్లా నుంచి బీసీ మహిళ,రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతిలకు ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

మరొక సీటును ఎస్సీ మాల సామాజిక వర్గానికి కేటాయించినట్లు తెలిసింది. ఈసారి గుంటూరు జిల్లాకు ఆ వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఇక ఆరో అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇచ్చార‌ట‌. దీని వ‌ల్ల వైసీపీలోని కొంత‌మంది ఎమ్మెల్యేలు ఆయ‌న‌కు ఓటు వేసే అవ‌కాశ‌ముంద‌ని, దీంతో ఆరో సీటు కూడా త‌మ ఖాతాలో ప‌డుతుంద‌నేది చంద్ర‌బాబు వ్యూహ‌మ‌ట.