పార్టీలో మంట పెడుతోన్న టీడీపీ కొత్త టీం

టీడీపీ జిల్లా విభాగాలకు కొత్త అధ్యక్షులను ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం ప్రకటించారు. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న అలా వెలువ‌డిందో లేదో పార్టీలో ఒక్క‌సారిగా అసంతృప్తి సెగ‌లు – పొగ‌లు రేగాయి. చంద్ర‌బాబు జిల్లాల వారీగా ప్ర‌క‌టించిన జాబితాలో శ్రీకాకుళం-గౌతు శిరీష, విజయనగరం-చిన్నమనాయుడు, విశాఖ అర్బన్‌- వాసుపల్లి గణేష్‌, విశాఖ రూరల్‌- పంచకర్ల రమేశ్‌బాబు, తూర్పుగోదావరి-నామన రాంబాబు, పశ్చిమ గోదావరి-తోట సీతారామలక్ష్మి, కృష్ణా-బచ్చుల అర్జునుడు, గుంటూరు-జీవీఎస్‌ ఆంజనేయులు, ప్రకాశం-దామచర్ల జనార్దన్‌, నెల్లూరు-బీద రవిచంద్రయాదవ్‌, చిత్తూరు-వెంకటమణి ప్రసాద్‌, కడప-శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అనంతపురం-బీకే పార్థసారథి కొత్త అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే, విజయవాడ అర్బన్‌ టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులను భర్తీ చేయలేదు.

ఈ జాబితాలో చంద్ర‌బాబు ఎక్కువ మంది పాత‌వారినే కంటిన్యూ చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక క‌ర్నూలులో సోద‌రుడు పార్టీ మారినా పార్టీనే న‌మ్ముకుని ఉన్న శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డినికి హ్యాండ్ ఇచ్చిన బాబు అక్క‌డ సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లుకు ప‌గ్గాలు అప్ప‌గించారు. దీంతో చ‌క్ర‌పాణిరెడ్డి తీవ్ర ఆవేద‌న‌తో ఉన్నారు. విశాఖ రూరల్‌ అధ్యక్షుడిగా య‌ల‌మంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పేరు ప్రకటించడంతో అక్క‌డ నానా ర‌చ్చ జ‌రుగుతోంది. స్థానికేత‌రుడికి జిల్లా పార్టీ ప‌గ్గాలు ఎలా అప్ప‌గిస్తారంటూ వారు మండిప‌డుతున్నారు.

విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా పూస‌పాటిరేగ ఎంపీపీ మ‌హంతి చిన్న‌మ‌నాయుడును ఎంపిక చేయ‌డంతో అక్క‌డ ఆగ్ర‌హ‌జ్వాల‌లు మిన్నంటుతున్నాయి. ఇక్క‌డ కేంద్ర మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు మాట చెల్లుబాటుకాక‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ మండ‌ల స్థాయి నేత‌కు జిల్లా ప‌గ్గాలు ఎలా అప్ప‌గిస్తార‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఇక తూర్పుగోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడిగా జ‌డ్పీ చైర్మ‌న్ నామ‌న రాంబాబును నియ‌మించారు. అయితే ఆయ‌న జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసి ఆ ప‌ద‌విని జ్యోతుల నెహ్రూ త‌న‌యుడు న‌వీన్‌కు ఇవ్వాల‌ని కండీష‌న్ పెట్టారు. దీంతో నామ‌న త‌నను జ‌డ్పీ చైర్మ‌న్‌గా కూడా కంటిన్యూ చేయాల‌ని కోర‌తున్నారు. ఇక చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో వెంక‌ట‌మ‌ణి ప్ర‌సాద్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక్క‌డ ప‌ద‌వులు అన్ని ఒకేసామాజిక‌వ‌ర్గానికి అప్ప‌గించ‌డంతో మిగిలిన సామాజిక వ‌ర్గాల్లో అస‌మ్మ‌తి జ్వాల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి.

ఏదేమైనా చంద్ర‌బాబు ఇదే టీంతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని చూస్తుంటే ఈ కొత్త టీంపై అప్పుడే చాలా జిల్లాల్లో అస‌మ్మ‌తి ఓ రేంజ్‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనిని చంద్ర‌బాబు ఎలా చ‌ల్లారుస్తారో చూడాలి.