తెలంగాణ టీడీపీలో కుదుపు.. సీనియ‌ర్ నేత ఆ పార్టీలోకి జంప్‌!

తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ‌త‌గిలింది.  ఆ పార్టీ ఇప్ప‌టికే  కేడ‌ర్ లేక‌, సీనియ‌ర్లు జంప్ చేసి ఇలా అనేక ర‌కాల ఇబ్బందుల్లో ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డంపై ఇప్ప‌టికే అనేక ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అయితే, 2019 నాటికి కొంత స‌మ‌యం ఉండ‌డం ఆయా ప్లాన్‌ల‌ను అప్ప‌టిలోగా అమ‌లు చేయాల‌ని, ముఖ్యంగా కేడ‌ర్ జారిపోకుండా చూసుకోవాల‌ని ఆయ‌న స్థానిక త‌మ్ముళ్ల‌కు గ‌ట్టి ఆదేశాలిచ్చారు. అయితే, పార్టీ ఇప్ప‌ట్లో పుంజుకుంటుంద‌నే ధీమా క‌నిపించ‌క‌పోవ‌డంతో నేత‌లు జారు కుంటూనే ఉన్నారు. బాబు బై చెప్పి అధికార టీఆర్ ఎస్‌లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. అయితే, తాజాగా టీడీపీ నేత కాంగ్రెస్‌లోకి జంప్ చేశారు.

ఊహించ‌ని ఈ షాక్‌తో తెలంగాణ టీడీపీ బిత్త‌ర‌పోయింద‌ని స‌మాచారం. విష‌యంలోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా ..  మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, సీనియర్‌  నేత బోడ జనార్దన్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో టీడీపీ బలహీనంగా ఉండడం, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న బోడ జనార్దన్‌, తాజాగా రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లూ తన వెంట ఉన్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు, సన్నిహితులతో తాజాగా మంతనాలు సాగిస్తున్నారు. 

ఇక‌, తెలంగాణ ఇచ్చింది తామే అని చెప్పుకుంటున్నా అంత‌గా జ‌నాలు న‌మ్మ‌ని స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ నుంచి బోడ‌కు ప్ర‌త్యేక ఆహ్వానం అందింద‌ట‌. కాంగ్రెస్‌లో చేరితే చెన్నూర్‌ టికెట్‌ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించినట్లు తెలిసింది. బోడ‌ అనుచరులు కూడా దీనికి సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలోనే ఆయన హస్తం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. ఇప్పటికే జైపూర్‌, కోటపల్లి, వేమనపల్లి, మందమర్రి మండలాల నుంచి పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు బోడ జనార్దన్‌తో కలిసి కాంగ్రెస్‌లోకి వస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

జంపింగ్‌లు కొత్త‌కాదు!! 

బోడ జనార్దన్‌ గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండడం కాంగ్రెస్‌కు కలిసిరానుంది. బోడ జనార్దన్‌ గతంలోనూ కాంగ్రెస్‌ పార్టీలో చేరే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్‌లోకి కూడా వెళ్లినట్లే వెళ్లి తిరిగి వైసీపీలో చేరారు. ఆ పార్టీ మంచిర్యాల జిల్లా (తూర్పు) అధ్యక్షునిగా కూడా కొనసాగారు. అనంతరం రాజీనామా చేసి, తిరిగి టీడీపీలో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ ఇచ్చేది కాంగ్రెస్సేనని బోడ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆయ‌న ఉన్న ప‌ళంగా కాంగ్రెస్‌లోకి జంప్ చేసిన‌ట్టు చెబుతున్నారు. బోడ‌కు అవస‌రానికి అనుగుణంగా పార్టీ మార‌డం అల‌వాటేన‌ని.. ఇది పెద్ద విష‌యం కాద‌ని తెలుగు దేశం నేత‌లు లైట్‌గా తీసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.