కాకినాడ‌లో టీడీపీ దెబ్బ‌తో బీజేపీకి దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న‌ప‌డుతోందా..

చంద్ర‌బాబు పార్టీ టీడీపీ.. తాజాగా త‌న మిత్ర‌ప‌క్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన బీజేపీకి ఝ‌ల‌క్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో తమ‌కు పెద్ద పీట వేస్తుంద‌ని, మిత్రం ప‌క్షం కాబ‌ట్టి టీడీపీ త‌మ‌ను నెత్తిన పెట్టుకుంటుంద‌ని భావించిన బీజేపీకి ఒక్క‌సారిగా షాక్ త‌గిలింది. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో దాదాపు ఏడేళ్ల త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది.

ఇక్క‌డి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాల‌కు ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ, టీడీపీలు రెండూ మ‌రోసారి కూడా క‌లిసే పోటీ చేయాల‌ని భావించాయి. దీంతో మొత్తం 48 వార్డుల్లో ఎవ‌రెవ‌రు ఎన్ని సీట్లు పంచుకోవాల‌నే విష‌యంపై చ‌ర్చించుకుని నిర్ణ‌యించుకున్నాయి. ఈ క్ర‌మంలోనే టీడీపీ నైజం బీజేపీకి తెలిసొచ్చింద‌ట‌. టీడీపీ తమకు పట్టులేని డివిజన్లను బీజేపీకి కేటాయించింది. ఆ తర్వాత ప్లేటు తిప్పేసింది. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన 9 డివిజన్లలో మూడింట తమ నాయకులనే రెబల్స్‌గా బరిలోకి దించింది. టీడీపీ తీరుతో ఖిన్నులైన బీజేపీ నాయకులు అగ్గి మీద గుగ్గిలంగా మండిప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీ మొత్తం 39 స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను బరిలోకి దిగింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. అయితే మిత్రపక్షాల ఒప్పందం ప్రకారం బీజేపీకి కేటాయించిన 9, 35, 47 డివిజన్లలో నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులు మాత్రం తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. టీడీపీ అధినాయకులు నామినేషన్లు వేసిన తమ అభ్యర్థులందరితో ముందుగానే నామినేషన్ల ఉపసంహరణ పత్రాల మీద సంతకాలు చేయించుకొని తమ వద్ద ఉంచుకున్నారు. అయితే ఈ డివిజన్లలోని టీడీపీ అభ్యర్థుల నుంచి మాత్రం నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకోలేదు.

ఇక‌, 9వ డివిజన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పోటీ చేశారు. ఆయన డివిజన్లో కూడా టీడీపీ అభ్యర్థి రంగంలో ఉండటంంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. అభ్యర్థులను బరిలో నుంచి తప్పించకుంటే తాము కూడా ఇతర డివిజన్లో సహాయ నిరాకరణ చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

ఇలా.. బీజేపీకి మొత్తం వార్డుల కేటాయింపులో అన్యాయం చేసిన టీడీపీ.. అనంత‌రం బీజేపీ అభ్య‌ర్థులు బ‌రిలోకి దిగిన చోట రెబ‌ల్స్‌తో మిలాఖ‌త్ అయి వారిని కూడా పోటీకి నిల‌ప‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు బీజేపీ నేత‌లు. మిత్ర ధ‌ర్మం అంటే ఇదేనా అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు? మ‌రి దీనికి టీడీపీ సైడ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల గొడవ తారా స్థాయికి చేరిందనే చెప్పొచ్చు.