జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్‌..!

ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్‌ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజ‌క‌వ‌ర్గాల ఏర్పాటుపైనే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సీఎం చంద్ర‌బాబు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాల పెంపు కోసం తెగ త‌హ‌త‌హ‌లాడిపోతోన్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో లాభ‌ప‌డాల‌న్న‌దే ఆయ‌న ప్ర‌ధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నిక‌ల్లో అప్ప‌టి సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని విజ‌యం సాధించారు. రాజ‌కీయంగా టీడీపీకి ప‌ట్టుగొమ్మ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఆయ‌న రిజ‌ర్వ్ చేయ‌డ‌మో ?  లేదా ?  ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌లాలు విడ‌గొట్ట‌డ‌మో చేశారు. టీడీపీకి ఆదినుంచి మంచి ప‌ట్టుగొమ్మ‌లుగా ఉంటోన్న చింత‌ల‌పూడి, స‌త్తుప‌ల్లి, నందిగామ వేమూరు, ప్ర‌త్తిపాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు రిజ‌ర్వ్ కేటగిరిలోకి వెళ్లిపోయాయి.

నాడు వైఎస్ వేసిన ప్లాన్‌తో టీడీపీకి కొమ్ము కాస్తోన్న కొన్ని సామాజికవ‌ర్గాల్లో సీనియ‌ర్ల‌కు సైతం నియోజ‌క‌వ‌ర్గం లేకుండా చేయ‌డంలో వైఎస్ స‌క్సెస్ అయ్యారు. నాడు వైఎస్ త‌న‌ను దెబ్బ‌కొట్టిన అస్త్రాన్నే ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌పై ఉప‌యోగించాల‌ని బాబు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న కోసం ఇప్ప‌టికే ప్ర‌భుత్వం త‌ర‌పున ఓ టీం వ‌ర్క్ చేస్తోంది.

ఇక ఇదే అస్త్రాన్ని జ‌గ‌న్ మీద సైతం ఉప‌యోగించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. జ‌గ‌న్ ఫ్యామిలీకి న‌ల‌భై సంవత్సరాలుగా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ జ‌గ‌న్‌ను వీక్ చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గంలోని కొన్ని మండలాల‌ను ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌లిపే ప్ర‌క్రియ స్టార్ట్ అయిన‌ట్టు తెలుస్తోంది. 

నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ బ‌లంగా ఉన్న సింహాద్రిపురం మండ‌లాన్ని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో క‌లిపేసి, లింగాల‌ను చెరి స‌గం విడ‌దీయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇక ఈ రెండు మండ‌లాల క‌కావిక‌ల‌మైతే టీడీపీకి బలమైన మద్దతు ఉన్న చక్రాయపేట, తొండూరు, వేముల బలంతో పులివెందుల‌లో జ‌గ‌న్‌ను ఓడించ‌డం లేదా బలం త‌గ్గించ‌డం చేయ‌వ‌చ్చ‌న్న‌ది టీడీపీ ప్లాన్‌గా తెలుస్తోంది. మ‌రి ఈ ప్లాన్‌తో టీడీపీ ఇక్క‌డ జ‌గ‌న్‌ను ఎంత వ‌ర‌కు నిలువ‌రిస్తుందో ?  చూడాలి.