టీడీపీకి కాకినాడ టెన్ష‌న్ స్టార్ట్‌

నంద్యాల ఉప ఎన్నిక‌లతోనే ఒకప‌క్క టెన్ష‌న్ ప‌డుతున్న టీడీపీకి.. మ‌రో ప‌క్క కాకినాడ కార్పొరేష‌న్ టెన్ష‌న్ ప‌ట్టుకుంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైంది. తూర్పు గోదావ‌రి జిల్లాలో కాపు ఓట్లు కీల‌కం. ముఖ్యంగా కాకినాడ‌లో మ‌రింత అధికం! కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రితో ఆవ‌ర్గ‌పు ప్ర‌జ‌లు ప్ర‌భుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే స‌మ‌యంలో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు రావ‌డంతో.. టీడీపీ సందిగ్ధంలో ప‌డిపోయింది. ఈ ఎన్నిక‌ల‌పై ముద్ర‌గ‌డ ప్ర‌భావం చాలా ఉంటుంద‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు. 

ప్ర‌స్తుతం టీడీపీకి ముందు గొయ్యి.. వెనుక నుయ్యి పరిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కాపు ఉద్య‌మ ప్ర‌భావం అధికంగా ఉంది. కాపుల హ‌క్కుల కోసం ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పోరాడుతూ ఉన్నారు. ఆయ‌న ఎప్పుడు పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని ప్ర‌క‌టించినా.. ప్ర‌భుత్వం పోలీస్ బ‌ల‌గాల‌తో దానిని అణిచివేస్తోంది. పాద‌యాత్ర‌కు అనుమ‌తించేది లేద‌ని తెగేసి చెబుతోంది. పోలీసుల‌ను మోహ‌రించి.. క‌ల్లోల ప్రాంతంలా చూస్తోంది. దీంతో ప్ర‌భుత్వంపై కాపు సామాజిక‌వ‌ర్గీయులు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇదే స‌మ‌యంలో కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వ‌చ్చిప‌డ్డాయి. దీంతో ప్ర‌భుత్వం ఇబ్బందిక ప‌రిస్థితి ఎదుర్కొంటోంది.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీకి అండ‌గా ఉన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్ల‌.. గోదావ‌రి జిల్లాల్లో కాపు సామాజిక‌వ‌ర్గ మంతా టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంద‌ని భావించిన టీడీపీ నేత‌ల ఆశ‌లు ఆవిర‌య్యాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల్లో త‌ట‌స్థంగా ఉంటామ‌ని ప‌వన్ ప్ర‌క‌టించ‌డం.. ఇప్పుడు టీడీపీని ఇర‌కాటంలో ప‌డేసింది. ముద్ర‌గ‌డపై ప్ర‌భుత్వ వైఖ‌రి, ప‌వ‌న్ మ‌ద్ద‌తు నిరాక‌రించ‌డం వంటి అంశాలు ఇప్పుడు కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌బోతున్నాయి.

ప్ర‌స్తుతం కాకినాడ కార్పొరేష‌న్లో 48 వార్డులు ఉన్నాయి. ఇక్క‌డ కాపు సామాజిక‌వ‌ర్గ ఓట‌ర్లే అధికం. ఇప్పుడు వీరి వైఖ‌రి ఎలా ఉంటుందోన‌ని టీడీపీ నేతలు ఆందోళ‌న ప‌డుతున్నారు. ఇక్క‌డ కూడా ముద్ర‌గ‌డ ప్ర‌భావం అధికంగా ఉంటే టీడీపీ విజ‌యావ‌కాశాలు స‌న్న‌గిల్లిన‌ట్టే లెక్క‌! ఇక ఎన్నిక‌లకు రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్న‌త‌రుణంలో.. ప్ర‌తి ఎన్నిక కీల‌క‌మే! దీంతో ఇప్పుడు కాకినాడ‌లో ముద్ర‌గ‌డ ఎఫెక్ట్ ఉంటే.. అది మ‌రింత ఎక్కువ‌య్యే ప్రమాదం లేక‌పోలేదు. ముద్ర‌గ‌డ ప్ర‌భావం నుంచి టీడీపీ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో వేచిచూడాల్సిందే!!