టీఆర్ఎస్ లో రాజ‌కీయంగా పెను మార్పు ..ఎంపీ ఔట్‌!

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో?  ఎలా జ‌రుగుతుందో ? ఊహించ‌డం కూడా క‌ష్టం. గంట కింద‌టి వ‌ర‌కు అంటి పెట్టుకున్న నేత‌లు.. మ‌రో గంట‌లో విడిపోయి వేరు కుంప‌ట్లు పెట్టుకున్న ప‌రిస్థితి రాజ‌కీయాల‌ది. కాబ‌ట్టి.. రాజ‌కీయాల‌న్నాక ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. అలాగ‌ని ఎవ‌రూ శాశ్వ‌త శ‌త్రువులూ ఉండ‌వు.  కాంగ్రెస్‌లో గ‌తంలో అనేక ప‌ద‌వులు అనుభ‌వించి, ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడి చ‌క్రం తిప్పిన  ద‌ళిత నేత ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ అంద‌రికీ సుప‌రిచితుడే.  మ‌రి అంత‌లా ఆద‌రించిన కాంగ్రెస్‌ను  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఎడం కాలితో త‌న్ని.. అధికార టీఆర్ ఎస్ చెంత‌కు చేరిపోయాడు.  ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నెల‌కు ల‌క్ష‌న్న‌ర వేత‌నంపై కేసీఆర్ ఈయ‌న‌కు ఉపాధి కూడా  చూపించేశారు. 

అయినా కూడా ధ‌ర్మ‌పురి సంతృప్తిగా లేర‌నే వార్త‌లు ఇటీవ‌ల కాలంలో వెల్లువెత్తాయి.  అధికార పార్టీలో  త‌న‌కు గుర్తింపు లేకుండా పోతోంద‌ని త‌న అనుచ‌ర‌ల వ‌ద్ద ధ‌ర్మ‌పురి  ఆవేద‌న చెందార‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి.  ఈ క్ర‌మంలోనే ఆయ‌న పార్టీ మార్పుపై అనేక  చ‌ర్చ‌లు ఊపందుకున్నాయి. త్వ‌ర‌లోనే తిరిగి మాతృ సంస్థ‌లోకి వ‌చ్చేస్తాడ‌ని ,  కేసీఆర్ కూడా అడ్డు చెప్ప‌డం లేద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి.  అయితే, అప్ప‌ట్లో వాటిని ధ‌ర్మ‌పురి తోసిపుచ్చాడు. మీడియాకు ప‌నీపాటా లేదా?  అని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు సైతం దిగాడు.  దీంతో ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌కుండా మౌనంగా ఉండిపోయారు.  అయాతే, తాజాగా జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్రం ధ‌ర్మ‌పురి గ్యారెంటీగా పార్టీ మార‌తాడ‌నే వార్త‌ల‌కు బ‌లం చేకూరుస్తున్నాయి. 

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. నిజామాబాద్ జిల్లా ఎడిష‌న్ల‌లో పంద్రాస్టు సంద‌ర్భంగా డీఎస్ కుమారుడు ధ‌ర్మ‌పురి అర‌వింద్ పేరుతో కొన్ని ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. ఇంత‌కీ ఆ ప్ర‌క‌ట‌న‌లు ఏంటంటే.. ‘జాతి మొత్తం మోడీ వెంటే నిలవాలి. భరతదేశం జగద్గురువుగ ఎదగాలి. మోడీని బలపరచడమంటే దేశభక్తిని నిరూపించుకోవడమే’ అంటూ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు మోడీ, అఖండ భార‌త అజేయ శ‌క్తి మోడీ అంటూ కీర్తిస్తూ ఈ ప్ర‌క‌ట‌న‌లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో డీఎస్ పార్టీ మార్పుపై మ‌ళ్లీ అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. నిజానికి, త‌న కుమారుడి ని రాజ‌కీయ వార‌సుడిగా తీసుకురావాల‌ని వైఎస్ హ‌యాంలోనే ధ‌ర్మ‌పురి ట్రై చేశారు. 

అయితే, అప్ప‌ట్లో స్వ‌యంగా వైఎస్ ఇప్పుడే వ‌ద్దు.. అంటూ అడ్డు ప‌డ్డారు. దీనిపై ఇద్ద‌రి మ‌ధ్య అప్ప‌ట్లో కొన్నాళ్లు మాట‌లు కూడా క‌ట్ అయ్యాయి. ఇక‌, ఆ త‌ర్వాత స్టేట్ విభ‌జ‌న‌, కాంగ్రెస్ నీర‌స‌ప‌డిపోవ‌డంతో డీఎస్ ఆశ‌లు నెర‌వేర‌లేదు. దీంతో ఆయ‌న టీఆర్ ఎస్‌లో చేరి… త‌ద్వారా కొడుక్కి.. పొలిటిక‌ల్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు.  ఈ నేప‌థ్యంలోనే  వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిజామాబాద్ అర్బ‌న్ స్థానం త‌న కొడుక్కి ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందుంచితే ఆయ‌న స్పందించ‌డం లేద‌నీ, ఇదే సాకుతో డీఎస్ పార్టీ మారే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి.

స‌రే, అవ‌న్నీ క‌ట్టుక‌థ‌ల‌ని డీఎస్ కొట్టి పారేశారు. అయితే, ప్ర‌స్తుతం వినిపిస్తున్నది ఏంటంటే… వ‌చ్చే ఎన్నిక‌ల్లో డీఎస్ కుమారుడికి నిజామాబాద్ ఎంపీ టిక్కెటు భాజ‌పా నుంచి ద‌క్కే అవ‌కాశం సుస్ప‌ష్టం అని! కుమారుడితోపాటు తండ్రి డీఎస్ కూడా క‌మ‌ల‌ద‌ళంలో చేరే అవ‌కాశం ఉంద‌నీ, ఆయ‌న‌కీ ఓ ఆఫ‌ర్ ఉన్న‌ట్టు తాజా క‌థ‌నం. డీఎస్ కు రాజ్య‌స‌భ సీటుతోపాటు, వీలైతే మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని కూడా హామీ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.  తెలంగాణ‌లో ఎలాగైనా బ‌లంగా ఎద‌గాల‌ని భావిస్తున్న బీజేపీ.. డీఎస్ వంటి పాప్యుల‌ర్ లీడ‌ర్‌ను చేర‌దీయాల‌ని నిర్ణ‌యించ‌డంతో త్వ‌ర‌లోనే రాజ‌కీయంగా పెను మార్పులు సంభ‌వించే అవ‌కాశం క‌నిపిస్తోంది.