తేజా.. కొంచెం.. ఆలోచించు..

సినిమాలు చూసి ఆనందించేందుకే కాదు. ఆలోచించేందుకు, ప్ర‌స్తుత స‌మ‌కాలీన అంశాల‌పై అవ‌గాహ‌న పెంచుకునేందుకు కూడా ఎంతో ఉప‌క‌రిస్తాయి. సినిమా మాధ్య‌మం చూపినంత బ‌ల‌మైన శ‌క్తి మ‌రే మాధ్య‌మానికీ లేదు. అందుకే సినిమాల్లో చూపించేవి స‌మాజంపై వెంట‌నే రిఫ్ల‌క్ట్ అవుతాయ‌న‌డంలో సందేహం లేదు. అదేస‌మ‌యంలో స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌ను చూసి రియాక్ట్ అయిన ద‌ర్శ‌కులు తీసిన సినిమాలూ లేక‌పోలేదు. ఏదేమైనా.. స‌మాజంతో సినీ ఫీల్డ్‌కి ఎన‌లేని సంబంధం ఉంది. స‌మాజంలోని స‌మ‌స్య‌ల‌తోనూ విడ‌దీయ‌రాని బంధం ఉంది. ఇప్పుడు యువ ద‌ర్శ‌కుడు, సినియ‌ర్ అయిన తేజ కూడా రానాను హీరోగా పెట్టి తీసిన నేనే రాజు.. సినిమా పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీసింది.

రాజ‌కీయాల‌ను టార్గెట్ చేస్తూ తేజ సంధించిన బాణంగా ఈ మూవీని మ‌నం చెప్పుకోవాలి. ముఖ్యంగా రాజ‌కీయ వార‌స‌త్వంపై తేజ త‌న‌దైన స‌టైరిక‌ల్ కాన్సెప్ట్‌తో మూవీని తెర‌కెక్కించాడు. అదేస‌మ‌యంలో పార్టీ ఫిరాయింపుల‌ను కూడా భారీ ఎత్తున ఏకి పారేశాడు. ఏదేమైనా.. ఏపీ, తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం సాగుతున్న ట్రెండ్‌ను తేజ ముక్కు సూటిగా తెర‌మీదకి ఎక్కించేశాడు. దీనికి రానా కూడా స‌రిగ్గా స‌రిపోయాడు. త‌న డైలాగ్ డెలివ‌రీతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. అంతేకాదు, రాజ‌కీయాలంటే ఏమిటో కూడా ఆలోచించేలా చేశాడు. రాజ‌కీయాల్లో వార‌సులు ఎందుకు? అని రానా అడిగిన ప్ర‌శ్న నిజంగానే స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఆలోచింప‌జేసే ప్ర‌శ్న‌.

ఇంత వ‌రకు బాగానే ఉంది. అయితే, ఇంట్లో ఎల‌క‌ల మోత మోగిపోతున్న సినీ రంగాన్ని ఒదిలేసి.. తేజ ఏంటి.. ఇలా రాజ‌కీయాల‌పై ప‌డ్డాడు అనే టాక్ మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున సాగుతోంది. వార‌స‌త్వం రాజ‌కీయాల కంటే కూడా సినిమా ఫీల్డ్ లోనే ఎక్కువ‌ని, నిజానికి రాజ‌కీయాల్లో వార‌సులు ఉన్నా.. ప్ర‌జ‌లు త‌మ‌కు ఇష్ట‌మైతేనే ఓట్లు వేస్తున్నార‌ని, లేక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప‌క్క‌న కూర్చోబెడుతున్న సంద‌ర్భాలు అనేకం ఉన్నాయ‌ని, కానీ, రాజ‌కీయ వార‌సులు మాత్రం అలా కాకుండా మొత్తం ఇండ‌స్ట్రీనే త‌మ గుప్పిట్లో పెట్టుకుని వంద‌ల వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిజ‌మైన క‌ష్ట‌ప‌డి పైకి ఒచ్చేవారికి ఎంత మాత్ర‌మూ చేరువ కాకుండా చూస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

నంద‌మూరి, అక్కినేని, ద‌గ్గుబాటి, మంచు, ఘ‌ట్ట‌మ‌నేని, కొణిద‌ల‌, అల్లు కుటుంబాలు స‌హా అనేక మంది నిర్మాత‌లు, స‌హ‌నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు వంటి అనేక మంది సీనియ‌ర్లు.. త‌మ కుటుంబ వార‌సుల్ని ఇండ‌స్ట్రీకి అప్ప‌గించేస్తున్నార‌ని, ఫ‌లితంగా ఎలాంటి అండా దండా లేని వారి ప‌రిస్థితి ఏంట‌ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. ఏ ప్లాట్ ఫాం లేకుండా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న శ‌ర్వానంద్‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌ర న‌టుల ప‌రిస్థితి ప్ర‌స్తుతం ఎలా ఉంది. అంతేకాకుండా సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు నారాయ‌ణ‌మూర్తి ప‌రిస్థితి ఏమిటి? అన్ని సినిమాహాళ్ల‌ను, డిస్ట్రి బ్యూట‌ర్ల‌ను అర‌చేతిలో పెట్టుకుని మూవీ ఫీల్డ్‌ను శాసిస్తూ.. త‌మ‌దే రాజ్యంగా త‌రాల త‌ర‌బ‌డి ఏలుతున్న వైనం నీకు తెలియందా? తేజా??

త‌న స్వ‌యం కృషితో.. నీ శిష్యుడిగా ఎదిగి.. త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ ప‌రిస్థితి ఏమైందో తెలియందా తేజా? త‌మ ఆధిప‌త్య‌మే నెగ్గాల‌నే నేప‌థ్యంలో కిర‌ణ్ వంటి వారికి అవ‌కాశాలు లేకుండా చేసిన ఈ సినీ ప్ర‌పంచంలోనే నిజ‌మైన వార‌స‌త్వం దాగి ఉంది. అంతేకాదు, రాజ‌కీయాల్లో వార‌సుల‌ను జ‌నాలు తిప్పికొడితే.. ఐదేళ్లు మూసుకుని ప‌క్క‌న కూర్చోవాల్సిందే. కానీ.. సినిమాల్లో మాత్రం ఈ వార‌సుల‌ను జ‌నాలు తిప్పికొడుతున్నా.. సినిమాల‌ను ఫెయిల్ చేస్తున్నా.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఏదో పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి క‌థ‌ల‌తో ఇండ‌స్ట్రీకి ప‌ట్టిన బూజులా తమ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తున్నారా? లేదా? మ‌రి వాళ్ల‌ని వ‌దిలేసి.. రాజ‌కీయాల మీద ప‌డ‌డం అంటే.. ఇల్లు అల‌క‌లేన‌మ్మ.. రోడ్డంతా శుభ్రం చేస్తాన‌న్న‌ట్టుగా లేదూ.. తేజా.. కొంచెం.. ఆలోచించు.. ఇది సోష‌ల్ మీడియా యుగం!!