గోల్డ్‌స్డోన్ కుంభ‌కోణంలో ఇద్ద‌రు మాజీ మంత్రులు..?

ఓ వైపు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ దూకుడు ముందు విప‌క్షాల‌న్ని చెల్లా చెదురైపోతున్నాయి. అక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం చేతులెత్తేసింది. ఇక అధికార ప‌క్షంలో లోపాలు కాంగ్రెస్ వాళ్ల‌కు ఎలాగూ దొర‌క‌వు..కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై ఏదైనా నెగిటివ్ వార్త వ‌చ్చిన‌ప్పుడు కూడా దానిని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేలా ఫోక‌స్ చేసే విష‌యంలో కూడా వాళ్లు ఘోర‌మైన డిజాస్ట‌ర్ షో వేస్తూ ప్లాప్ మీద ప్లాప్ పాలిటిక్స్ చేస్తున్నారు.

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కె.కేశ‌వ‌రావు ఇరుక్కున్న గోల్డ్‌స్టోన్ భూకుంభ‌కోణం ఉదంత‌మే ఇందుకు పెద్ద ఉదాహ‌ర‌ణ‌. ఈ భూ కుంభ‌కోణంలో కెకె పేరు బ‌య‌ట‌కు రాగానే దాన్ని స‌రిగా ఫోక‌స్ చేయ‌డంలో ఫెయిల్ అయిన టీ కాంగ్రెస్ నేత‌లు త‌మ ప‌రువును తామే బ‌జారు కీడ్చుకుంటున్నారు. ఈ అంశంపై వీరు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ఫిర్యాదు చేసిన‌ప్పుడు కాంగ్రెస్ పార్టీకే చెందిన మేడ్చ‌ల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న‌గారి ల‌క్ష్మారెడ్డి త‌మ పార్టీ నేత‌లు కూడా ఇందులో ఉన్నార‌ని వ్యాఖ్యానించ‌డం పెద్ద క‌ల‌క‌లం రేపింది.

అధికార పార్టీకి చెందిన ఎంపీ కెకెతో పాటు ఆయ‌న కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మిపై బ‌ల‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తే వాటిని ఫోక‌స్ చేసుకునేది పోయి ఇంటిగుట్టు మొత్తం విప్పుకోవ‌డం టీ కాంగ్రెస్ నాయ‌కుల‌కే చెల్లింది. దీంతో మీడియా ఫోక‌స్ మొత్తం టీఆర్ఎస్ నాయ‌కుల నుంచి ఒక్క‌సారిగా కాంగ్రెస్ నాయ‌కుల వైపు మ‌ళ్లింది. దీంతో అస‌లు కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఈ భూ కుంభ‌కోణానికి లింక్ ఏంటా అని ఆరా తీసే ప‌నిలో ప‌డ్డారు. ఇక కేఎల్ఆర్ మాట‌లు సొంత పార్టీలోనే నేత‌ల మ‌ధ్య అభిప్రాయ బేధాల‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు సీనియ‌ర్లు మండిప‌డుతున్నారు.

ఈ భూ కుంభ‌కోణంలో కేఎల్ఆర్ ఎవ‌రి పేర్లు బ‌య‌ట పెట్ట‌క‌పోయినా ఆ కాంగ్రెస్ నేత‌లు ఎవ‌ర‌బ్బా అని చ‌ర్చ జ‌రుగుతోంది. మాజీ మంత్రులు దానం నాగేంద‌ర్‌తో పాటు ముఖేష్‌గౌడ్‌పై కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ఈ కుంభ‌కోణం ఒక్క‌సారిగా ఇలా బ‌య‌ట‌కు రావ‌డంతో టీఆర్ఎస్‌, కేసీఆర్‌పైనా కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. దీనిని సాకుగా చూపి కేసీఆర్ ఈ ఇద్ద‌రు మాజీ మంత్రుల‌ను లాగేసు కుంటుందా ? అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయి.