టి-కాంగ్రెస్ `బాహుబ‌లి` వ‌స్తున్నాడా?

అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, విభేదాల‌తో నిండిపోయిన టి-కాంగ్రెస్‌కు కొత్త ర‌క్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు క‌దుపుతోంది. టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కోవ‌డంతో పాటు సీఎం కేసీఆర్‌కు పోటీగా నిలిచే స‌రైన నాయ‌కుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించ‌డం మాని.. సీఎం అభ్య‌ర్థిగా నిల‌బ‌డేందుకు టి-కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు వ్యూహాలు ర‌చిస్తున్నారు. దీంతో ఇక పగ్గాల‌ను సీనియ‌ర్ నాయ‌కుడికి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింద‌ని తెలుస్తోంది. తెలంగాణ ఉద్య‌మంలో కాంగ్రెస్ త‌ర‌ఫున కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నేత‌, ఢిల్లీలోనూ మంచి నాయ‌కుడిగా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డికి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించే ప‌నిలో ఉంద‌ని సమాచారం.

పార్టీ బ‌లోపేతం కంటే.. సొంతంగా ఇమేజ్ పెంచుకునేందుకు టి-కాంగ్రెస్ నేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఇంకా రెండేళ్ల‌లో ఎన్నిక‌లు ఉండ‌గానే సీఎం కుర్చీ కోసం త‌న్నుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయ మంతా పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది . ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ ను ప్ర‌క‌టించాలంటూ ఈ మ‌ధ్య కొంత‌మంది నాయ‌కులు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా కాంగ్రెస్ పోటీకి వెళ్ల‌డం శ్రేయ‌స్క‌రం కాదు అనే ఉద్దేశంతో అధిష్టానం ఉంది. అన్ని రాజ‌కీయ పార్టీల‌ను స‌మ‌న్వయం చేసుకోవాలి. ఇవ‌న్నీ ఉత్త‌మ్ వ‌ల్ల సాధ్య‌మేనా అనేది అధిష్టానం అనుమానం.

అందుకే జైపాల్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. సీనియ‌ర్ నాయ‌కుడైన ఆయ‌న్ను తెర‌పైకి తీసుకొస్తే… వీట‌న్నింటినీ ప‌క్కాగా డీల్ చేయ‌గ‌ల‌రేమో అనే ప్ర‌తిపాద‌న ఢిల్లీ పెద్ద‌ల్లో ఉంద‌ని అంటున్నారు. తెలంగాణ ఏర్పాటు స‌మ‌యంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. అప్ప‌ట్లో ఆంధ్రా పొలిటిక‌ల్ లాబీ బ‌లంగా ఉన్నా… జైపాల్ ఢిల్లీ స్థాయిలో చ‌క్రం తిప్పి తెలంగాణ ఇచ్చేలా సోనియాపై ఒత్తిడి పెంచార‌ని చెబుతున్నారు. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటూ జైపాల్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద‌దిక్కుగా మార్చితే బాగుంటుంద‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మౌతున్న‌ట్టు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ను కంటెంట్ తో ఎదుర్కోవాల‌న్నా, ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాస్త యాక్టివ్ అవుతున్న తెరాస వ్య‌తిరేక ప్ర‌జాసంఘాలు, కాంగ్రెస్ లో కాస్త అసంతృప్తిగా ఉన్న కొంత‌మంది నాయ‌కుల్ని క‌లుపుకుని ముందుకు సాగాల‌న్నా జైపాల్ అనుభ‌వ‌మే పార్టీకి అవ‌స‌రం అనేది ఢిల్లీ పెద్ద‌ల ఆలోచ‌న‌గా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌ట్నుంచే ప‌క‌డ్బందీ ప్ర‌ణాళిక‌లు వేసే ప‌నిలో టి. కాంగ్రెస్ మునిగితేలుతోంద‌న్న‌ది వాస్త‌వం. మ‌రి ఎప్ప‌టినుంచో కాంగ్రెస్ నేత‌లు ఎదురుచూస్తున్న `బాహుబ‌లి` జైపాల్ అవుతారో లేదో!!