ఏపీ ఓటు క‌న్నా తెలంగాణ ఓటు వాల్యూ త‌గ్గిందే

తెలంగాణ అధికార ప‌క్షాన్ని ఓ స‌మ‌స్య ఇర‌కాటంలోకి నెట్టింది! ఇది ఏపీతో వ‌చ్చిన స‌మ‌స్య‌కాక‌పోయినా.. ఏపీ వ‌ల్లే వ‌చ్చింద‌ని నేత‌లు దిగులు ప‌డుతున్నారు!! రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా తాము న‌ష్ట‌పోయామ‌ని ఇప్పుడు అనుకుంటున్నార‌ట‌. అయితే, అదేదో.. ఆస్తుల పంప‌కాలు, ఆర్థిక విష‌యాల్లో కాదులెండి. ప్ర‌స్తుతం దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం త‌మ‌కు అనుకూలమైన వ్య‌క్తిని పోటీ లేకుండా నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది.

ఈ క్ర‌మంలో ఇప్పుడు అన్ని పార్టీలూ రాష్ట్ర ప‌తి ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు ఎల‌క్టోర‌ల్ కాలేజీ ఓట్లవిలువ‌పై దృష్టి పెట్టాయి. అంటే.. ఎంత ఎక్క‌వు ఓటు విలువ ఉంటే అంత‌గా కేంద్రం.. త‌మ‌తో స‌ఖ్య‌త‌గా ఉంటుంద‌ని భావిస్తున్నాయి. నిజానికి ఎన్‌డీఏలో భాగ‌స్వామ్య ప‌క్షాల ఓటు విలువ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు స‌రిపోవ‌డంలేదు. దీంతో ఏదో ఒక పార్టీని బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

ఇక‌, ఇప్పుడు ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల ఎల‌క్టోర‌ల్ కాలేజీ స‌భ్యులైన ఎమ్మెల్యేల ఓటు విలువ‌పై చ‌ర్చ ప్రారంభ‌మైంది. రాష్ట్రపతిఎన్నిక సందర్భంగా ఓట్ల లెక్కింపును 1971 జనాభా ప్రాతిపదికన లెక్క కడుతున్నారు. ఈ నేపథ్యంలో 1971 సమైక్య రాష్ట్ర జనాభా 43502708. ఈ జనాభాను 294×1000తో భాగించి.. ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువను 148 గా డిసైడ్ చేశారు. ఈ లెక్క ప్రకారం 294 ఎమ్మెల్యేలు ఉన్న ఉమ్మడి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 148గా లెక్క కట్టారు.

2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువను విడివిడిగా ఖరారు చేశారు. దీనికి 1971 నాటి సమైక్య రాష్ట్ర జనాభాను లెక్కలోకి తీసుకున్నారు. దీని ప్రకారం నాడు ఏపీలో 2.78 కోట్ల మంది ఉంటే.. తెలంగాణ జనాభా 1971 నాటి లెక్కల ప్రకారం 1.57 కోట్లుగా లెక్కించారు. ఈ లెక్కన ఏపీ ఓటు విలువను 159గా నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ఓటు విలువను132గా తేల్చారు. దీంతో ఏపీ క‌న్నా తాము ఓట్ల విలువ‌లో వెన‌క‌బ‌డిపోయామేన‌ని తెలంగాణ అధికార‌ప‌క్షం బావురుమంటోంద‌ట‌!! రాబోయే 2026 వ‌ర‌కు 1971 జ‌నాభా లెక్క‌ల‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు కాబ‌ట్టి.. ఎవ‌రు ఎలా ఫీలైనా చేసేందేం లేదు!!