టీడీపీలో మ‌రో వికెట్ డౌన్‌… టీఆర్ఎస్‌లో టెన్ష‌న్‌

తెలంగాణ‌లో ఉనికిని చాటుకునేందుకు ముప్పుతిప్ప‌లు ప‌డుతోన్న టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. తెలంగాణ‌లోని పాత ఆదిలాబాద్ జిల్లాలో టీడీపీలో బ‌ల‌మైన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ ఈ నెల 29న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగా ప‌నిచేయ‌గా, ఆయ‌న భార్య సుమ‌న్ రాథోడ్ ఖ‌నాపూర్ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గ‌త ఎన్నిక‌ల్లో ర‌మేష్ రాథోడ్ ఆదిలాబాద్ ఎంపీగాను, ఆయ‌న త‌న‌యుడు రితీష్ రాథోడ్ ఖ‌నాపూర్ ఎమ్మెల్యేగాను పోటీ చేసి ఓడిపోయారు. ర‌మేష్‌కు ప్ర‌స్తుత ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రుం భీం జిల్లాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ర‌మేష్ రాథోడ్ వ్య‌క్తిత్వంపై కేసీఆర్‌కు సైతం గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది. ర‌మేష్ టీఆర్ఎస్‌లో చేర‌డం వెన‌క రోడ్లు, భ‌వ‌నాల శాఖా మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఆయ‌న టీఆర్ఎస్‌లో చేర‌తార‌న్న వార్త‌ల‌తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. ర‌మేష్ రాథోడ్‌కు టీఆర్ఎస్ నాయ‌క‌త్వం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటుపై గ‌ట్టి హామీ వ‌చ్చింద‌ట‌. ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఖ‌నాపూర్ సీటు కోరితే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్‌కు షాక్ త‌ప్ప‌దు. ఒక వేళ ర‌మేష్ ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేస్తే ప్ర‌స్తుత ఎంపీ న‌గేశ్ బోథ్ ఎమ్మెల్యేగా వెళ్లాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాపూరావు సీటుకు ఎర్త్ త‌ప్ప‌దు.

ఒక వేళ కేసీఆర్ ర‌మేష్ రాథోడ్‌ను ఆసిఫాబాద్ నుంచి బ‌రిలో దింపితే అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే కోవ ల‌క్ష్మిని త‌ప్పించాలి. ఏదేమైనా ర‌మేష్ రాథోడ్ టీఆర్ఎస్ ఎంట్రీ రేఖా నాయ‌క్ – న‌గేశ్ – బాపూరావు – కోవ ల‌క్ష్మిల‌లో ఎవ‌రికి ఎర్త్ పెడుతుందో చూడాలి. వీళ్ల టెన్ష‌న్ పోవాలంటే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగి ఉట్నూరు కేంద్రంగా మ‌రో ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డాల‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.