మ‌హేష్‌, ప్ర‌భాస్‌ల ఫ్యూచ‌ర్‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ఇంట గెలిచి ర‌చ్చ‌గెల‌వమ‌న్న‌ట్టు.. టాలీవుడ్‌ను ఊపేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, బాహుబ‌లితో మూవీ ఫీవ‌ర్ క్రియేట్ చేసిన ప్ర‌భాస్‌ల గురించే ఇప్పుడు ఫిలింన‌గ‌ర్‌లో ఎక్క‌డ చూసినా చ‌ర్చ న‌డుస్తోంది. సొంత భాష‌లో హిట్ట‌యిన హీరోలు ప‌క్క భాష‌ల్లోనూ న‌టించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. దీనికి త‌మిళ‌నాడు హీరోలే పెద్ద ఎగ్జాంపుల్‌. అయితే, తెలుగులో మాత్రం ఆ ఒర‌వ‌డి పెద్ద‌గా క‌నిపించ‌దు. ఆ మ‌ధ్య బ‌న్నీ కేర‌ళ‌లో కొంత స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నా.. త‌మిళ‌నాట మాత్రం పెద్ద‌గా క్లిక్ అయిన నేటి త‌రం హీరోలు లేర‌నే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరోలు నెమ్మదిగా.. తమ మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. తమ పరిధి పెంచుకుంటున్నారు. ద్విభాషా.. త్రిభాషా చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. వేరే భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ప్ర‌ముఖంగా ప్ర‌భాస్‌, మ‌హేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు.. ప్రభాస్ ఇప్పుడు పొరుగు మార్కెట్లపై కన్నేశారు. టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి పోటీలో ఉన్న ఈ ఇద్దరూ వేరే రాష్ట్రాల్లో సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఆల్రెడీ ‘బాహుబలి’తో వేరే రాష్ట్రంలో మంచి గుర్తింపే సంపాదించాడు.

ఈ లైన్‌లోనే ప్ర‌భాస్ సాహో అనే త్రిభాషా మూవీని ప్లాన్ చేశాడు. ఈ సినిమాకు ‘సాహో’ అనే టైటిల్ పెట్టడం కూడా ‘బాహుబలి’ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడమే. దీనిని తమిళం, తెలుగు స‌హా హిందీలోనూ విడుద‌ల చేసి ఇమేజ్‌ను సొంతం చేసుకోవాల‌ని చూస్తున్నాడు. ఇక‌, మ‌హేష్ కూడా తమిళనాట ఫాలోయింగ్ పెంచుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నాడు. మహేష్ చివరి రెండు సినిమాలు ‘శ్రీమంతుడు’ ‘బ్రహ్మోత్సవం’లను తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనమేమీ కనిపించలేదు. ఐతే ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను మాత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నారు.

మురుగదాస్ సినిమా కాబట్టి తమిళంలోనూ ఈ చిత్రాన్ని పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి అవకాశం దక్కింది. తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఇది మంచి అవకాశమని మహేష్ భావిస్తున్నాడు. మ‌రి వీళ్ల ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతాయో చూడాలి.