మోసం గురూ.. మోడీ ఎంత ప‌నిచేశాడు!

పాలిటిక్స్‌లో ఆరితేరిన వారు ఎలా ఉంటారో చూపించాలంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటో చూపిస్తే స‌రిపోతుంది! అని మొన్నామ‌ధ్య బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ చెప్పుకొచ్చారు. ఆయ‌న అలా అన్నప్పుడు స‌హ‌జంగానే ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి.. త‌మ పార్టీని గ‌ద్దె నెక్కించిన నేప‌థ్యంలో లాలూ అలా కామెంట్ చేసి ఉంటాడ‌ని అంద‌రూ అనుకున్నారు. సాధార‌ణంగా తెలుగు వాళ్ల‌కు జాలి ఎక్కువ‌. చాలా విష‌యాల్లో క్ష‌మించేసుకుంటూ పోతుంటారు. అలాంటి తెలుగు వారికి సైతం ఇప్పుడు మోడీ పేరెత్తితే మండి పోతోంది.

2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో తిరుప‌తి బ‌హిరంగ స‌భ‌లో మోడీ చేసిన ప్ర‌క‌ట‌న‌లు.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక ఆయ‌న చేస్తున్న ప‌నుల‌కు ఎలాంటి సంబంధం ఉండ‌డం లేదు. రాజ‌ధాని అమ‌రావ‌తి, విభ‌జ‌న చ‌ట్టంలోని నిధుల విడుద‌ల‌, పోల‌వ‌రం, దుర్గ‌మ్మ గుడి ఎదురుగా సాగుతున్న ఫ్లైవోవ‌ర్ నిర్మాణం. ఇలా ఏది చూసుకున్నా.. మోడీ ఒక్క విష‌యంలోనూ స‌హ‌కారం అందించడంలేదు. నిజానికి విభ‌జ‌న‌తో వేరైన ఏపీలో రాజ‌ధాని లేక‌పోవ‌డం ఒక్క‌టే స‌మ‌స్య‌కాదు, ఈ రాష్ట్రానికి లోటు బ‌డ్జెట్ ఏర్ప‌డ‌డం దానిని పూరిస్తామ‌ని చెప్పిన కేంద్రం ఇప్పుడు మౌనం వ‌హించ‌డం కూడా దారుణం.

అదేవిధంగా పోల‌వ‌రం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించినా.. కేంద్రం నుంచి నిధులు బొట్టు బొట్టుగా కారుతున్న మునిసిప‌ల్ పంపును త‌ల‌పిస్తున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబే ఇదివ‌ర‌కు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్ర జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమా భార‌తిని మంచి చేసుకుని కొంత వ‌ర‌కు నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆమె లేరు. దీంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్త‌వుతుందో చెప్ప‌డం క‌ష్టంగా మారింది. ఇక‌, దుర్గ‌గుడి ఫ్లైవోవ‌ర్ అంటే విజ‌య‌వాడకు ముఖ ద్వారం వంటిది. హైద‌రాబాద్ నుంచి వ‌చ్చే వారికి కానీ, వన్‌టౌన్‌ను-టూటౌన్‌ను క‌ల‌ప‌డంలో కానీ ఈ వంతెన అత్యంత ప్ర‌ధానం.

దీనిని జాతీయ ర‌హ‌దారిపై నిర్మిస్తుండ‌డంతో దీని బాధ్య‌త కేంద్ర‌మో చూసుకోవాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా 25% నిధులు ఇచ్చేందుకు రెడీ అయింది. మిగిలిన 75% నిధులు ఇచ్చేందుకు కేంద్ర ముహూర్తాలు చూసుకుంటోంది. దీనిని మొదలు పెట్టి గ‌ట్టిగా మూడేళ్ల‌లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ, ఇప్ప‌టికి మూడేళ్లు గ‌డిచిపోయినా.. ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. 50% ప‌నులు మాత్ర‌మే పూర్త‌య్యాయి. ఈ క్ర‌మంలోనే బాబు ప్ర‌భుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా ద‌స‌రా హ‌డావుడి మొద‌లైంది. దీంతో న‌గ‌ర వాసుల‌కు మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పేలా లేవు. ఇలా ఏ విష‌యంలో చూసుకున్నా మోడీ ఏపీకి చేసింది ఏమీలేదు! దీంతో ఆయ‌న‌పై ఏపీ జ‌నాలు మండి ప‌డుతున్నారు.