ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీల‌కు 2019లో సారి

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ సారి టిక్కెట్ల విష‌యంలో కాస్త క‌టువుగానే వ్య‌హ‌రిస్తారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి వ‌రుస‌గా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టేయ‌నున్నారా ? అంటే తాజా రాజ‌కీయ ప‌రిణామాలు అవున‌నే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్ల‌లో గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వ‌గా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీల‌లో చాలా మందిని ప‌క్క‌న పెట్టేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

రాజ‌ధానిలో కీల‌కంగా ఉన్న విజ‌య‌వాడ‌, గుంటూరు రెండు సీట్ల‌కు కొత్త అభ్య‌ర్థులే రానున్నారు. అధిష్టానాన్ని ధిక్క‌రించేలా మాట్లాడుతోన్న కేశినేని నానికి ఈ సారి టిక్కెట్ క‌ట్టేన‌ట‌. నానికి మ‌రోసారి టిక్కెట్ ఇవ్వ‌డం చంద్ర‌బాబు కంటే లోకేశ్‌కే అస్స‌లు ఇష్టం లేద‌ట‌. ఈ విష‌యం సూచాయ‌గా నానికి తెలియ‌డంతో లోకేశ్‌, బాబుపై ధిక్కార స్వ‌రం పెంచేశార‌ని విజ‌య‌వాడ టాక్‌. ఈ సీటు బీజేపీకి ఇవ్వ‌డం లేదా త‌మ‌కు బాగా కావాల్సిన వాళ్ల‌కు ఇచ్చే ప్ర‌య‌త్నాలు లోకేశ్ చేస్తున్నారు. ఇక గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్‌కు చంద్ర‌గిరి అసెంబ్లీ సీటు ఇవ్వ‌డం లేదా రాజ్య‌స‌భ‌కు పంపి అక్క‌డ బ్రాహ్మ‌ణిని పోటీ చేయించేందుకు బాబు గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసేశాడు.

ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రిలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మూడు ఎంపీ సీట్ల‌కు కొత్త అభ్య‌ర్థులు రానున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కీల‌క‌మైన రాజ‌మండ్రి ఎంపీగా ఉన్న మాగంటి ముర‌ళీమోహ‌న్ రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఇక్క‌డ కూడా కొత్త వ్య‌క్తుల పేర్లు బాబు ప‌రిశీలిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహంకు బ‌దులుగా టీడీపీ సీనియ‌ర్ నేత జ్యోతుల నెహ్రూను పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన నెహ్రూకు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న త‌న‌యుడికి జ‌గ్గంపేట ఎమ్మెల్యే సీటు, నెహ్రూకు కాకినాడ ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది. ఇక కాంట్ర‌వ‌ర్సీల‌కు కింగ్‌గా మారిన అమ‌లాపురం ఎంపీ పండు ర‌వీంద్ర‌బాబును త‌ప్పించి ఆ సీటు గొల్ల‌పల్లి సూర్యారావు లేదా మ‌రో వ్య‌క్తికి ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

న‌ర‌సారావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఈ సారి పోటీ చేసే ఛాన్సులు లేవు. ఈ సీటును రెడ్డి వ‌ర్గానికి కేటాయిస్తార‌ని స‌మాచారం. చంద్ర‌బాబుకు సొంత జిల్లాలో త‌ల‌నొప్పిగా మారిన శివ‌ప్ర‌సాద్‌, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్ట‌ప్ప‌ల‌ను మార్చి వేరే వారికి ఛాన్స్ ఇచ్చే అంశంపై కూడా బాబు ఆలోచ‌న చేస్తున్నారు. ఇక జేసీ త‌ప్పుకుని ఆయ‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నా చంద్రబాబు ఇందుకు ఒప్పుకోక‌పోవ‌చ్చు.

ఏదేమైనా చంద్ర‌బాబు ఏకంగా 8-10 సిట్టింగ్ ఎంపీల‌ను మార్చేసి కొత్త‌వాళ్ల‌ను దింపేందుకు పెద్ద సాహ‌స‌మే చేస్తున్నారు. మ‌రి ఈ రాజ‌కీయ సాహ‌సం 2019 ఎన్నిక‌ల్లో ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీస్తుందో చూడాలి.