ఏపీలో బీజేపీకి ఆ ఒక్క‌డు కూడా దొర‌క‌ట్లేదా..!

ఏపీలో ఎంత స్పీడ్‌గా విస్త‌రించాల‌ని భావిస్తున్నా.. బీజేపీకి ప‌రిస్థితులు అంత‌గా అనుకూలించ‌డం లేదు. ముఖ్యంగా పార్టీకి అంద‌రూ ఉన్న‌ట్టే ఉన్నా.. ప్ర‌జాక‌ర్ష‌ణ ఉన్న నేత ఒక్క‌రూ లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా ఉంది. ఇటీవ‌ల అంటే 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక మంది కాంగ్రెస్ నేత‌లు బీజేపీలోకి వ‌చ్చి చేరారు . వీరిలో కేంద్రంలో మంత్రి ప‌దువులు నిర్వ‌హించిన వారూ ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ కూడా 2019లో బీజేపీని అధికారంలోకి తీసుకురాగ‌లిగిన నేత ఏపీలో ఒక్క‌రూ క‌నిపించ‌డం లేదు. దీంతో క‌మ‌ల ద‌ళాధిప‌తి అమిత్ షా.. ఇప్పుడు సందేహంలో ప‌డిపోయార‌ట‌.

నిజానికి ఆయ‌న తెలంగాణ‌లో ఒంట‌రి గా అధికారంలోకి వ‌చ్చి కేసీఆర్‌కి త‌గిన పోటీ అనిపించాల‌ని భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏపీలోనూ బ‌లంగా దూసుకుపోవాల‌ని షా భావిస్తున్నా.. అది అంత వీజీ కాద‌ని ఆయ‌న అర్థం చేసుకున్నారు. దీంతో కిందిస్థాయి నేత‌లు ఎంత గ‌ల‌భా సృష్టిస్తున్నా.. బాబుతో క‌టీఫ్‌కి అంత స‌న్న‌ద్ధంగా లేరు. ముఖ్యంగా రాబోయే ఎన్నిక‌ల్లో ఇటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను, అటు జ‌గ‌న్‌ను ఎదుర్కొని నిలిచే స‌త్తా ఉన్న నేత ఉంటే . షా ఎప్పుడో బాబుకి గుడ్‌బై చెప్పేవార‌నేది విశ్లేష‌కుల మాట‌.

ఏపీలో బీజేపీకి ఉండ‌డానికి సంఖ్యా బ‌లం బాగానే ఉన్నా.. స‌రైనోడు ఒక్క‌డూ లేడ‌నేది పెద్ద మైన‌స్‌గా క‌నిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పురందేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, కావూరి సాంబ‌శివ‌రావు వంటి నేత‌లు ఏదో పార్టీ బ‌లాన్ని బ‌ట్టి గెలిచిన వారే త‌ప్ప ఒంట‌రిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన సందర్భాలు లేవు. దీంతో షా .. ఇప్పుడు మౌనంగా ఉండ‌డ‌మే మంచిద‌ని భావించిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే ఆయ‌న బాబుతో పొత్తు విష‌యంపై త‌న అభిప్రాయం చెప్పేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. కాబ‌ట్టి.. 2019లో ఏపీలో బీజేపీ ఒంట‌రి పోరుపై మాత్రం ఓ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. అది సాధ్యం కాదుకాబ‌ట్టి.. కుదిరితే బాబు.. లేక‌పోతే.. జ‌గ‌న్ వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రితో పొత్తు ఖాయం అని షా డిసైడ్ అయిన‌ట్టే తెలుస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.