2019లో సీఎం సీటు కోసం ప‌వ‌న్ ప్లాన్స్ ఇవే

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. 2019లో ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైపోయింది! ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్క‌డి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక‌, ఈ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయ‌డం, పార్టీని సంస్థాగ‌తంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవ‌డం వంటివి కొత్త‌గా ఏర్పాటైన పార్టీ అధినేత‌లు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు. కానీ, వీటికి విరుద్ధంగా ప‌వ‌న్ ఈ విష‌యాల‌ను ప‌క్క‌న పెట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే, పార్టీని ఏమ‌న్నా గాలికి వ‌ద‌లిసేడా? అంటే అదేమీ లేదు. అంతేకాదు, త‌న‌కంటూ పెద్ద ల‌క్ష్యం కూడా పెట్టుకున్నాడు.

అదే.. సీఎం సీటును అధిరోహించ‌డం! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మే అంటున్నారు విశ్లేష‌కులు! ఎట్టి ప‌రిస్థితిలోనూ త‌న అన్న మాదిరిగా కాకుండా త‌న‌కంటూ డిఫ‌రెంట్ స్టైల్ ఉండాల‌ని కోరుకునే ప‌వ‌న్‌.. ఆ దిశ‌గానే సీఎం సీటు టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌.. ఆ సీటుకు ద‌గ్గ‌ర కావ‌డం కోసం గ‌త కొన్నాళ్లుగా త‌న ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల‌కు తాను స్వ‌యంగా ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్రాధాన్యం ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అటు శ్రీకాకుళం కిడ్నీ బాధితుల నుంచి ఇటు అమ‌రావ‌తి రైతుల వ‌ర‌కు అంద‌రి స‌మ‌స్య‌ల‌నూ ఓపిక‌గా వింటూ అంద‌రికీ టైం కేటాయిస్తూ.. ఉండ‌డం ప‌వ‌న్ దూర దృష్టికి నిద‌ర్శ‌మ‌ని చెబుతున్నారు. అదేవిధంగా ప్ర‌జ‌ల ఆకాంక్ష అంటున్న ప్ర‌త్యేక హోదా విష‌యంలోనూ పవ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

దీనిపై ప్ర‌త్య‌క్ష పోరాటానికి దిగ‌కుండా.. ట్విట్ట‌ర్ ద్వారా మాత్ర‌మే మ‌ద్ద‌తిస్తూ.. ఉండ‌డాన్ని బ‌ట్టి.. రాబోయే ఎన్నిక‌ల్లో దీనిని పెద్ద ఎత్తున త‌న‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని భావించ‌వ‌చ్చు. అదేవిధంగా 2019 ఎన్నిక‌ల్లో చిన్నా చిత‌కా పార్టీల‌ను సైతం క‌లుపుకొని పోయేందుకు ప‌వ‌న్ సిద్ధ‌ప‌డ‌డాన్ని బ‌ట్టి.. సీఎం సీటు దిశ‌గా ప‌వ‌న్ తెర వెనుక బాగానే క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.