తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేక‌ర్ వేసే నాయ‌కులు ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీలుగా కాంగ్రెస్‌-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్ట‌ర్ షో వేస్తున్నాయి. ప్ర‌స్తుతం అక్క‌డ ట్రెండ్స్‌ను బ‌ట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మ‌రోసారి సీఎం అవుతార‌ని అంద‌రూ అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో సీనియ‌ర్ల‌కు, స‌మ‌ర్థులైన నాయ‌కుల‌కు కొర‌త లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడ‌ర్లు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ నుంచి రేవంత్ మాత్ర‌మే ఫైట్ చేస్తున్నాడు. ఇక వీరంద‌రి కంటే తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం మాత్రం కొద్ది రోజులుగా తెలంగాణ అంత‌టా ప‌ర్య‌టిస్తూ కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

టీ జేఏసీ చైర్మ‌న్‌గా కోదండ‌రాంకు టీ ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. త‌న‌తో క‌లిసి వ‌చ్చే వారంద‌రిని ఆయ‌న ఏకం చేసుకుంటూ టీఆర్ఎస్‌పై ఫైట్ చేస్తున్నాడు. కోదండ‌రాం త‌మ‌పై చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను జీర్ణించుకోలేక‌పోతోన్న గులాబి నాయ‌కులు కోదండ‌రాంపై ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అయితే తెలంగాణ ద్రోహుల‌తో కొదండ‌రామ్ జ‌ట్టుక‌ట్టాడంటూ ఘాటుగా విమ‌ర్శించారు.

ఇక తాజాగా కోదండ‌రాం ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న నోట కొత్త రాజ‌కీయ పార్టీ మాట రావ‌డం ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో ఆప్ త‌ర‌హాలో ఓ ప్రాంతీయ పార్టీ రావాల్సిన టైం వ‌చ్చింద‌ని కోదండ‌రాం తెలిపారు. ఇక ఈ పార్టీలో టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి, నాగం జ‌నార్ద‌న‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి లాంటి వాళ్లు జాయిన్ అవుతార‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ కొత్త పార్టీ ఏర్పాటు ఎంత వ‌ర‌కు స‌ఫ‌లీకృతం అవుతుందో చూడాలి.