సోమిరెడ్డిపై ఆ ఇద్ద‌రు క‌క్ష క‌ట్టారా..!

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌, మంత్రిపై అదే పార్టీకి చెందిన ఓ ఇద్ద‌రు నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోతున్నార‌ట‌. త‌మ‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకు తెర‌వెన‌క స‌ద‌రు మంత్రి చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌తో వాళ్లు స‌ద‌రు మంత్రిని ఎలా టార్గెట్ చేయాలా ? ఎప్పుడు అద‌ను చూసి దెబ్బ‌కొట్టాలా ? అని వెయిట్ చేస్తున్నార‌ట‌. అసలు మ్యాట‌ర్‌లోకి వెళితే..

టీడీపీలో సీనియ‌ర్ లీడ‌ర్‌గా ఉన్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో గ‌త 20 ఏళ్ల‌లో ఎప్పుడూ గెల‌వ‌లేదు. ఆయ‌న గ‌త నాలుగుసార్లు వ‌రుస‌గా ఓడిపోతున్నారు. అయితే సోమిరెడ్డి సీనియారిటీని గుర్తించిన చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక ఆరు నెలల క్రితం జ‌రిగిన ప్ర‌క్షాళ‌న‌లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు సోమిరెడ్డికి ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌కు పైకి ఎలా ఉన్నా లోప‌ల మాత్రం పొస‌గ‌డం లేదు.

కాంగ్రెస్ పాల‌న‌లో జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి, ఆనం రామనారాయ‌ణ‌రెడ్డి త‌ర్వాత టీడీపీలో చేరారు. చంద్ర‌బాబు వీరిలో ఎన్నిక‌ల‌కు ముందే టీడీపీలో చేరిన ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డికి నెల్లూరు రూర‌ల్ అసెంబ్లీ, నెల్లూరు లోక్‌స‌భ సీటు టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్య‌తలు అప్ప‌గించారు. ఇక ఆనంకు ఆత్మకూరు బాధ్య‌త‌లు ఇచ్చారు. అయితే వీరిద్ద‌రితో అంతగా స‌ఖ్య‌త‌లేని సోమిరెడ్డి ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీలోనే ఉన్న వేరే వ్య‌క్తుల‌కు స‌పోర్ట్ చేస్తుండ‌డం తో ఈ ఇద్ద‌రు నాయ‌కులు సోమిరెడ్డిపై ఓ రేంజ్‌లో మండిప‌డుతున్నార‌ట‌.

నెల్లూరు రూర‌ల్‌లో జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ కిలారు వెంక‌ట‌స్వామినాయుడుకు స‌పోర్ట్ చేస్తోన్న సోమిరెడ్డి ఆత్మ‌కూరులో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన గూటూరు క‌న్న‌బాబుకు సోమిరెడ్డి అండ‌దండ‌లు ఉన్నాయి. వీరిద్ద‌రు సోమిరెడ్డి అండ చూసుకుని ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో దూకుడుగా ముందుకు వెళుతుండ‌డం ఆదాల‌కు, ఆనంకు అస్స‌లు న‌చ్చ‌డం లేదు. వీరిని అడ్డుపెట్టుకుని సోమిరెడ్డి త‌మ‌పై డ‌బుల్ గేమ్ ఆడ‌డాన్ని వీరు స‌హించ‌లేక‌పోతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు గెలిస్తే సీనియారిటీ రేసులో సోమిరెడ్డికి పోటీగా మంత్రి ప‌ద‌వి అడగుతార‌న్న ఆలోచ‌న‌తోనే సోమిరెడ్డి వీరికి ముందుగా చెక్ పెట్టేందుకు ఇలా చేస్తున్నార‌న్న టాక్ కూడా జిల్లాలో వినిపిస్తోంది. దీంతో వీరిద్ద‌రు కూడా అద‌ను చూసుకుని సోమిరెడ్డికి ఎక్క‌డ దెబ్బ కొట్టాలా ? అన్న ప్లాన్‌తో ఉన్న‌ట్టు నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి. సోమిరెడ్డికి మంత్రి ప‌ద‌వి రావ‌డానికి ముందు జిల్లాలో చ‌క్రం తిప్పిన నారాయ‌ణ హ‌వా ఇప్పుడు పూర్తిగా త‌గ్గిపోయింది.