ఈ మూడు శ‌క్తుల క‌ల‌యిక ఫ్రంట్ కెసిఆర్ ని ఆపగలవా ?

తెలుగు రాష్ట్రాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లు ఉండ‌గానే.. ఇప్ప‌టి నుంచే పొత్తుల‌పై రాజ‌కీయ పార్టీలు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. ఏపీలో కంటే తెలంగాణ‌లో.. టీఆర్ఎస్ వ్య‌తిరేక శ‌క్తుల‌న్నీ ఒక చోట‌కు చేరేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి. ఇత‌ర పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా క‌మ్యూనిస్టులు ఈ విష‌యంలో స్ప‌ష్టంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా జ‌న‌సేన రంగ ప్ర‌వేశంతో.. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను ఉప‌యోగించుకుని ఎలాగైనా పూర్వ వైభ‌వాన్ని సంపాదించాల‌ని క‌మ్యూనిస్టులు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ పార్టీల భావ‌జాలం అంతో ఇంతో ప‌వ‌న్‌పైనా ఉందనేది తెలిసిన విష‌య‌మే! దీంతో ఇప్పుడు కొత్త కూట‌మి తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

భావ‌సారూప్య పార్టీల పున‌రేకీక‌ర‌ణకు తెలంగాణ వేదిక కాబోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ సాధించుక‌న్న త‌ర్వాత‌.. సాధించ‌క ముందు ప్ర‌జ‌ల్లో ఏవిధ‌మైన మార్పు రాలేద‌ని విప‌క్షాలన్నీ గ‌ళ‌మెత్తుతున్నాయి. ప్ర‌జాక‌వి గ‌ద్ద‌ర్ మ‌ళ్లీ.. ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మారుతున్నారు. క‌మ్యూనిస్టులు పూర్వ వైభ‌వం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా.. రంగంలోకి దిగుతాన‌ని ప్ర‌క‌టించాడు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, గాయకుడు గద్దర్, చంద్రకుమార్, కోదండరాంలు కూడా ప్రత్యామ్నయ శక్తులుగా బయటకు వస్తున్నారని, వీరందరితో చర్చించి ఒక వేదిక ఏర్పాటు చేస్తామని తమ్మినేని వీరభద్రం ప్ర‌క‌టించ‌డం కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీస్తోంది.

తెలంగాణ‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు యువ‌త‌లో భారీ క్రేజ్ ఉంది. అలాగే క‌మ్యూనిస్టుల‌కు ఖ‌మ్మం, న‌ల్గొండ జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉంది. గ‌ద్ద‌ర్‌కు కూడా తెలంగాణ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఈ మూడు శ‌క్తుల క‌ల‌యికతో కొంతైనా ప్రభావం ఉండ‌వ‌చ్చనేది విశ్లేష‌కుల అభిప్రాయం! తాను కూడా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని గ‌ద్ద‌ర్ ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌డం.

ఇప్పుడు త‌మ్మినేని కూడా ఇదే త‌ర‌హా అభిప్రాయాన్ని వ్య‌క్తంచేయ‌డంతో భ‌విష్య‌త్తులో ఏదైనా జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని స్పష్టంచేస్తున్నారు. ప‌వ‌న్ కూడా క‌మ్యూనిస్టుల ప‌ట్ల సానుకూల వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డాన్ని ప్ర‌త్యేకంగా గుర్తుచేస్తున్నారు.