ఆ ముగ్గురు చూపు టీడీపీ వైపు…

ఒక‌ప్పుడు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు – కొణతాల రామకృష్ణ – సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు ఈ ముగ్గురు సీనియ‌ర్లు ఓ రేంజ్‌లో రాజ‌కీయాల్లో రాణించారు. ఇప్పుడు వీరి వాయ‌స్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. టీడీపీలో సీనియ‌ర్ నాయకుడు అయిన దాడి వీర‌భ‌ద్ర‌రావు త‌ర్వాత వైసీపీలో చేరారు. 

దాడి తన‌యుడు ర‌త్నాక‌ర్ వైసీపీ నుంచి విశాఖ న‌గ‌రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత జ‌గ‌న్‌తో విబేధించిన ఆయ‌న ప్ర‌స్తుతం స్త‌బ్దుగా ఉన్నారు. ఆయ‌న త‌న‌యుడు ర‌త్నాక‌ర్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం ఆయ‌న టీడీపీలో చేరాల‌నుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ర‌త్నాక‌ర్‌కు అన‌కాప‌ల్లి అసెంబ్లీ సీటు విష‌యంలో టీడీపీ నుంచి హామీ కోసం ఆయ‌న వెయిట్ చేస్తున్నారు.

ఇక అన‌కాప‌ల్లికే చెందిన మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు కొణతాల రామకృష్ణ వైకాపా నుంచి బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలోకి వెళతారన్న అంశంపై చర్చోప చర్చలు జరిగాయి. కొణ‌తాల పేరు కొద్ది రోజుల క్రితం ఆయ‌న టీడీపీలోకి వెళ‌తార‌ని, ఆ త‌ర్వాత బీజేపీలోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఏదైనా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం సీటు ఇస్తామ‌న్న హామీ లేదా అన‌కాప‌ల్లి ఎంపీ సీటుపై హామీ వ‌స్తే ఆయ‌న కూడా టీడీపీలో చేరేందుకు సుముఖంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇక రాజ‌కీయ చ‌తురుడిగా పేరున్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి చాలా రోజులుగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగా ఆయ‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీకి ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. స‌బ్బంకు కూడా టీడీపీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయ‌ట‌.

ఇక సబ్బం హరి మాట ఎలా ఉన్నా దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణ మరి కొద్ది కాలంలోనే టీడీపీలో చేర‌డం ఖాయ‌మ‌న్న టాక్ ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.