చంద్ర‌బాబు వ‌ద్ద మూడు పంచాయితీలు

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్క‌డ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువ‌వ్వ‌డంతో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది ఇంకా పెద్ద స‌స్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే క‌ర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్ర‌బాబు వ‌ద్ద చ‌ర్చ‌కు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా ఎవ‌రిని బ‌రిలోకి దింపాల‌నేది ఇంకా తేల‌లేదు.

ఇక్క‌డ రాజ‌కీయాల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌రిగా డీల్ చేయ‌లేక‌పోతోంద‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు ఇక్క‌డ ఆమె సోద‌రుడు అయిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని లేదా నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి అల్లుడు శ్రీథ‌ర్‌రెడ్డిల‌లో ఎవ‌రో ఒక‌రిని నంద్యాల అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ముందుగా భూమా ఫ్యామిలీకి చెందిన బ్ర‌హ్మానంద‌రెడ్డి వైపే మొగ్గు చూపుతార‌ని టాక్‌. రెండో ఆప్ష‌న్‌గా శ్రీథ‌ర్‌రెడ్డి పేరు వినిపిస్తోంది. ఈ రోజు విజ‌య‌వాడలో జ‌రిగే చంద్ర‌బాబు మీటింగ్‌కు ఎస్పీవై.రెడ్డి ఫ్యామిలీ కూడా హాజ‌ర‌వుతుండ‌డంతో బ్ర‌హ్మానంద‌రెడ్డికి టిక్కెట్టు వ‌చ్చే విష‌యం కాస్త స‌స్పెన్స్‌లోనే ప‌డింది.

ఇక జిల్లా టీడీపీ అధ్య‌క్షుడి ఎంపిక రెండో పంచాయితి. ఇక్క‌డ ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ , జిల్లా పార్టీ అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి సోద‌రుడు శిల్పా మోహ‌న్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో చ‌క్ర‌పాణిరెడ్డికి మ‌రోసారి జిల్లా పార్టీ ప‌గ్గాలు ఇవ్వాలా ? లేదా ? గ‌తంలో ప‌నిచేసిన సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లును తీసుకోవాలా ? అన్న‌ది కూడా పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి చ‌క్ర‌పాణిరెడ్డిని మండ‌లి చైర్మ‌న్ చేయాల‌ని బాబు అనుకున్నారు. ఇప్పుడు ఆయ‌న సోద‌రుడు పార్టీ మారినా ఆయ‌న నిలువ‌రించ‌లేక‌పోవ‌డంతో ఆయ‌న‌కు షాక్ త‌ప్పేలా లేదు.

ఇక జిల్లాలో పార్టీ నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంపై మూడో పంచాయితీ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ నేత‌ల‌ను మంత్రి అఖిల‌ప్రియ స‌మ‌న్వయం చేయ‌లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ భూమా మృతి త‌ర్వాత ఆయ‌న అనుచ‌రుల‌ను అఖిల‌ప్రియ ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌న్న టాక్ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇదే అంశంపై మూడో పంచాయితీ నిర్వ‌హించ‌నున్నారు. మ‌రి ఈ పంచాయితీల్లో చంద్ర‌బాబు క‌ర్నూలు టీడీపీ గొడ‌వ‌ల‌కు ఎలాంటి ప‌రిష్కారం చూపుతారో చూడాలి.