టీడీపీకి ఆ హీరోయిన్ గుడ్ బై..!

ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. జంపింగ్ జ‌పాంగ్‌లు ఎక్కువ‌వ్వ‌డంతో ఇప్ప‌టికే చంద్ర‌బాబుకు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌ల‌నొప్పులు ఎక్కువ‌య్యాయి. వీటికి తోడు పార్టీని న‌మ్ముకుని ఎప్ప‌టి నుంచో ఉన్న వాళ్లు సైతం పార్టీని వీడి వెళ్లిపోయేందుకు రెడీ అవుతున్నారు. నిన్న‌టి త‌రం హీరోయిన్‌, ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అయిన క‌విత ఏపీలో అధికార టీడీపీకి త్వ‌ర‌లోనే గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. టీడీపీలో కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఆమె టీడీపీ గెలుపుకోసం చాలా ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో కూడా చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు ఆమె చాలాసార్లు ప్ర‌చారంలో పాల్గొన్నారు.

ఇక 2004, 2009 ఎన్నిక‌ల‌తో పాటు 2014 ఎన్నిక‌ల్లో కూడా క‌విత టీడీపీ కోసం విస్తృతంగా ప్ర‌చారం చేశారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ధీమాతో ఉన్నారు. అయితే పార్టీలో ఉన్న వాళ్ల‌లోనే చాలా మందికి ప‌ద‌వులు లేవు. దీంతో క‌విత గురించి ప‌ట్టించుకునే టైం చంద్ర‌బాబుకు లేకుండా పోయింది. ఇక త‌న‌కు ఏదో ఒక ప‌ద‌వి ఇవ్వాల‌ని ఆమె కొద్ది రోజులుగా చంద్ర‌బాబును వేడుకుంటున్నా ఆమె గాధ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆమె పార్టీని వీడాల‌ని డిసైడ్ అయిన‌ట్టు టాక్‌.

టీడీపీలో ఆర్యవైశ్యులకు అన్యాయం జరుగుతోందని ఆమె తన అనుయాయుల వద్ద మంగళవారం ప్రస్తావించినట్టు సమాచారం. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ఆమె ఆగ్రహంతో ఉన్నట్టు స‌మాచారం. చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తాన‌న్నార‌ని, ఆ త‌ర్వాత ఎమ్మెల్సీ ఇస్తాన‌ని కూడా బాబు మోసం చేశారని క‌విత ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. ఎన్టీఆర్‌ నాటి టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి పోలికే లేదని ఆమె భావిస్తున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఫిరాయింపు దారుల‌ను పార్టీలో చేర్చుకుని పార్టీ ప‌రువు తీశార‌ని ఫైర్ అయిన క‌విత‌, వైజాగ్‌లో కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మ‌హానాడులో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై ఆమె ఓ రేంజ్‌లో ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక టీడీపీకి గుడ్ బై చెప్పే ఆమె తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌లోకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.