టాలీవుడ్ నుంచి జ‌న‌సేన‌లోకి చేరిక‌లు?

ప్ర‌త్యేక‌హోదాపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఉద్య‌మాల‌కు టాలీవుడ్ హీరోలు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. కానీ హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బ‌హిరంగ స‌భ‌ల ద్వారా ప‌వ‌న్‌ విరుచు కుప‌డ్డారు. హోదాపై ప‌వ‌న్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జ‌న‌సేన వైపు చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం! సినీన‌టుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న‌ హీరో శివాజీ! ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారాయి. కేవ‌లం ప‌వన్ ఒక్క‌డివ‌ల్లే ప్ర‌త్యేక‌హోదా సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన నిర్మాణంపై అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌త్యేక శిబిరాలు, రాత‌ప‌రీక్ష‌లు వంటివి నిర్వ‌హించి జ‌న‌సేనలోకి సైనికుల‌ను ఆహ్వానిస్తున్నారు. ప్ర‌స్తుతం వివిధ రాజ‌కీయ పార్టీల్లోని నాయ‌కులు జ‌న‌సేన వైపు ఆస‌క్తి చూపుతున్నా.. ఇంకా వీటిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌డం లేదు ప‌వ‌న్‌! కాగా పవన్ ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఇప్పటివరకు డిమాండ్ చేస్తూ వచ్చిన సినీనటుడు శివాజీ జనసేన పార్టీ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా శివాజీ బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేశాడు. విశాఖ‌ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీచేసిన వైఎస్ విజ‌య‌మ్మకు వ్య‌తిరేకంగా ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించాడు. అలాగే ప్ర‌త్యేక‌హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్య‌మ‌ని న‌మ్మాడు! బీజేపీ తర‌ఫున శివాజీ ఎమ్మెల్యేగా పోటీచేస్తార‌నే మాట‌లు కూడా వినిపించాయి. కానీ అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కొంత‌కాలం శివాజీ బీజేపీలోనే కొనసాగారు. ప్రత్యేకహోదా హామీని తుంగలో తొక్కడంతో పార్టీ నుంచి ఆయ‌న బ‌య‌టికొచ్చి.. బీజేపీ, టీడీపీ తీరు ఎండ‌గ‌డుతున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి తరుపున ఆయన పోరాటం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో త‌న‌కు రాజకీయ పార్టీలన్నింటిపై నమ్మకం లేదని, ప్రతేకహోదా రావాలంటే అది పవన్ వలనే సాధ్యం అవుతుందని శివాజీ అన్నారు. పవన్ రోడ్లమీదికి వచ్చి పోరాడితే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని అన్నారు. ప్రస్తుతం శివాజీ ఏ రాజకీయ పార్టీ లోను లేరు. ఆయన జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ గురించి శివాజీ చేస్తున్న వ్యాఖ్యలే దీనికి ఇండికేషన్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మ‌రి జ‌న‌సేనలో శివాజీ చేరితే.. మ‌ళ్లీ హోదా అంశం తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. దీంతో పాటు శివాజీ తర్వాత మ‌రింత‌మంది పార్టీలో చేరే అవ‌కాశాలూ లేక‌పోలేదు!!