జ‌య జాన‌కీ – రాజు మంత్రి – లై… మూడు ముక్కలాట!

టాలీవుడ్‌లో సంక్రాంతికి మాత్ర‌మే ఒకేసారి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అప్పుడు కూడా ఒక రోజు తేడాలో మూడు నాలుగు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ కొట్టాయి. ఆ త‌ర్వాత ఒకేసారి పెద్ద సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే ఈ శుక్ర‌వారం మాత్రం ఒకేసారి మంచి అంచ‌నాలు ఉన్న మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జ‌య జాన‌కి నాయ‌క – లై – నేనే రాజు నేనే మంత్రి.. మూడింటిపైనా భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఈ మూడు సినిమాల‌పై ఇండ‌స్ట్రీలో వినిపిస్తోన్న ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ఏ సినిమా రిపోర్ట్ ఎలా ఉందో టీజే ప్రి రిలీజ్ విశ్లేష‌ణ‌లో చూద్దాం.

లై :

మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నా ముగ్గురు హీరోల్లో నితిన్‌కే అభిమానులు ఎక్కువ‌. వ‌రుస హిట్ల‌తో జోరుమీదుండ‌డం, అ…ఆ సినిమాతో రూ. 50 కోట్ల క్ల‌బ్‌లోకి చేర‌డం, ప‌వ‌న్ భ‌జ‌న నితిన్‌కు ప్ల‌స్‌గా మారాయి. నితిన్‌కు మిగిలిన ఇద్ద‌రు హీరోల‌తో పోల్చుకుంటే ఫ్యాన్స్ ఎక్కువ కావ‌డంతో ఓపెనింగ్స్ భారీగా లైకే రానున్నాయి. 14 రీల్స్ నిర్మాణ విలువ‌లు, హ‌ను రాఘ‌వ‌పూడి టేకింగ్‌, స్టైలీష్ మూవీ కావ‌డం, కొత్త స్టోరీ కావ‌డం, విల‌న్‌గా అర్జున్ న‌టించ‌డం ఈ సినిమాకు క‌లిసి రానున్నాయి.

అయితే సినిమాకు కీల‌క‌మైన సెకండాఫ్ వీక్ అయ్యింద‌ని, ర‌న్ టైం ఏకంగా 160 నిమిషాలు ఉండ‌డం, స్లో నెరేష‌న్ మైన‌స్ కానున్నాయంటున్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న ద‌మ్ము సినిమాలో లేదంటున్నారు. సినిమా మాస్ పీపుల్‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో కూడా చెప్ప‌లేం.

జ‌య జాన‌కీ నాయ‌క‌:

ఇక మూడు సినిమాల్లోను రిలీజ్‌కు ముందు భారీ అంచ‌నాల‌తో వ‌స్తోన్న సినిమా ఖ‌చ్చితంగా జ‌య జాన‌కీ నాయ‌కే. ఈ సినిమాపై ఇంత‌లా అంచ‌నాలు ఉండ‌డానికి కార‌ణం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌మ్ము అన్న‌ది వేరే చెప్ప‌క్క‌ర్లేదు. బెల్లంకొండ కంటే ర‌కుల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్‌కుమార్‌, నందు, వాణి విశ్వ‌నాథ్‌, దేవిశ్రీ సంగీతం, రిషి పంజాబీ కెమెరా ఇలా సినిమాకు భారీ త‌నం వ‌చ్చేసింది. వీటిల్లో ఏది క్లిక్ అయినా సినిమా బాక్సాఫీస్‌ను దున్నేయ‌డం ఖాయం.

అయితే సినిమాలో బోయ‌పాటి యాక్ష‌న్ డోస్ ఎక్కువ‌వ్వ‌డం, సెకండాఫ్‌లో సెంటిమెంట్ సీన్లు ఎక్కువయ్యాయ‌ని అంటున్నారు. మ‌రి ఇవి క్లాస్ ఆడియెన్స్‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తాయో ? చూడాలి. బీ, సీ సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమాపై మంచి హైప్ ఉంది.

నేనే రాజు – నేనే మంత్రి:

బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవుడి క్యారెక్ట‌ర్‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు రానా. బాహుబలి త‌ర్వాత రానా చేస్తోన్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ప్ర‌తీ క‌థ‌నీ ఆచి తూచి ఎంచుకొనే నిర్మాత డి. సురేష్ బాబు త‌న‌యుడితో చేస్తున్న తొలి ప్రాజెక్ట్‌. ట్రైల‌ర్ ఆస‌క్తిగా ఉంది. తెలుగులో ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ జాన‌ర్‌లో సినిమాలేవి రాక‌పోవ‌డం, ఫంక్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావ‌డంతో ఈ సినిమా కొత్త‌గానే క‌నిపిస్తుంది.

రానా న‌ట‌న‌, కాజ‌ల్ అందాలు, కేథ‌రిన్ గ్లామ‌ర్ కూడా క‌లిసి రానున్నాయి. ఇక ఇటీవ‌ల కాలంలో హిట్ లేని తేజ ఈ సినిమాను ఎలా తీశాడ‌న్న సందేహంతో పాటు సెకండాఫ్ భారంగా గ‌డిచింద‌ని, యాంటీ క్లైమాక్స్ కూడా కాస్త దెబ్బ‌కొట్టే ప్ర‌మాదం ఉంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.