డబుల్ మీనింగ్ హెడ్డింగులే వెబ్ సైట్ల టార్గెట్

February 7, 2017 at 11:13 am
55

వార్తా ప్ర‌పంచంలో వినూత్న ఆలోచ‌న‌ల‌కు తెర‌దీస్తూ.. దాదాపు దశాబ్దం కింద‌ట ఆవిర్భ‌వించిన సోష‌ల్ మీడియా సైట్లు.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తున్నాయా?  చెడు చేస్తున్నాయా? అంటే చెప్ప‌డం ఒక‌ప్పుడు క‌ష్టంగా ఉండేది. కానీ, ఇటీవ‌ల కాలంలో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోయిన సైట్లు.. సంచ‌ల‌నాల‌కు మాత్ర‌మే వేదిక‌గా మారాల‌ని తెగ ఉబ‌లాట ప‌డిపోతున్నాయి. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల మ‌రింత‌గా పెరిగిపోయిన సైట్ల పైత్యం అటు సామాన్యుల‌ను ఇటు స‌మాజంలో పేరున్న వారిని సైతం ఇబ్బంది పెడుతున్నాయ‌న‌డంలో వెనుకాడ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

నిజానికి వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అందించ‌డం స‌హా.. కీల‌క‌మైన స‌మాచారాన్ని ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చేరువ చేయ‌డం  సైట్ల ప్రాధ‌మిక ధ‌ర్మం. ఈ నేప‌థ్యంలోనే వాటికి ఆద‌ర‌ణ పెరిగింది. అయితే, రాను రాను విప‌తీర ధోర‌ణుల‌కు ఈ సైట్లు వేదిక‌లుగా మారాయి. అసంబద్ధ, అస‌మంజ‌స శీర్షిక‌ల‌తో రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా డ‌బుల్ మీనింగ్ శీర్షిక‌ల‌తో వ‌స్తున్న వార్త‌ల‌కు అంతులేకుండా పోతోంది. కేవ‌లం సంచ‌ల‌నం సృష్టించ‌డే ధ్యేయంగా ఉన్న ఈ సైట్ల ప‌రంప‌ర ఇటీవ‌ల కాలంలో మ‌రింత‌గా పెరిగిపోయింది.

భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ కింద‌కు వ‌చ్చే సైట్ల ను నియంత్రించేందుకు ప్ర‌భుత్వ యంత్రాంగం వ‌ద్ద ఎలాంటి యంత్రాంగం లేదు. ఒక‌వేళ ఉన్నా.. స్వేచ్ఛ‌కు సంకెళ్లు అనే శీర్షిక‌ల‌తో యుద్ధం మొద‌ల‌వ‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో సైట్ల ప‌రంప‌ర చేస్తున్న అఘాయిత్యాల‌కు అంతులేకుండా పోతోంది ముఖ్యంగా హీరో హీరోయిన్లు, రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య ఏదో ఒక సంచ‌ల‌న శీర్షిక‌తో రాస్తే.. త‌ప్ప‌కుండా త‌మ వార్త‌లు చ‌దువుతార‌నే ధోర‌ణి పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో సైట్లను వినియోగించేవారు దీనిని త‌ల‌నొప్పిగా ప‌రిణ‌మించే పరిస్థితి దాపురించింది. మ‌రి ఇప్ప‌టికైనా సైట్లను ర‌న్ చేసేవాళ్లు.. ఈ పోక‌డ‌ల‌ను క‌ట్టిపెట్టి.. స‌మాజానికి అవ‌స‌ర‌మైన విధంగా త‌న పంథాను మార్చుకుంటాయ‌ని కోరుకుందాం.

డబుల్ మీనింగ్ హెడ్డింగులే వెబ్ సైట్ల టార్గెట్
0 votes, 0.00 avg. rating (0% score)


Share
Share