కాపులంతా ఒక్కటైతే, చంద్రబాబు పరిస్థితేంటి?

కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారట. ఇందులో సినీ, రాజకీయ రంగాలకు చెందినవారున్నారని సమాచారమ్‌. ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు తెలియవస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కాపు ఉద్యమం – రాజకీయాలపై ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారట. ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని ఖండిస్తోన్న నేతలంతా ఈ కాపు సమావేశానికి హాజరు కానున్నట్లు సమాచారమ్‌. సినీ రంగం నుంచి దాసరి నారాయణరావు, చిరంజీవి హాజరు కానుండగా, కాంగ్రెస్‌తోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులకూ ఆహ్వానం అందిందట. అలాగే, టిడిపిలోని కాపు ముఖ్యులకు సమాచారం అందినప్పటికీ వారెవరూ ఈ సమావేశానికి హాజరు కాబోరని తెలియవస్తోంది.

ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌లో రగిలిన కాపు కుంపటికి ఆద్యుడు చంద్రబాబే. 2014 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తానని ప్రచారం చేసి, కాపు ఓట్లను కొల్లగొట్టిన చంద్రబాబు అధికార పీఠం ఎక్కినాక, కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని గాలికొదిలేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కోర్టుల్లో నిలవదనీ ఇంకోటనీ కుంటి సాకులు చెబుతూ కాలం వెల్లదీస్తుండడం వల్ల చంద్రబాబే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందిపడాల్సి రావొచ్చు. బిజెపి నాయకులు కూడా కాపు ఉద్యమానికి మద్దతు పలకనున్నారని వినికిడి.