నిశ్శబ్ద ఉద్యమం – పెను సంచలనం

మౌనం అత్యంత భయంకరమైనది. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. మహాత్మాగాంధీ భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమయంలో, హింసాత్మక మార్గాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. మహాత్మాగాంధీ అహింసాయుత పద్ధతుల్లో చేసిన పోరాటానికి కరడుగట్టిన తెల్లదొరలు బెంబేలెత్తిపోయారు. అదీ అహింస అనే ఆయుధానికి ఉన్న గొప్పతనం. అహింసా మార్గంలోకే వెళుతుంది మౌన పోరాటం కూడా. మరాఠీలు రిజర్వేషన్ల కోసం మౌన పోరాటాన్ని ఆశ్రయించి దేశం దృష్టిని ఆకర్షించారు. పుణెలో వేలాదిమంది నిర్వహించిన మౌన ప్రదర్శనతో మహారాష్ట్రలో రాజకీయాలు షాక్‌కి గురయ్యాయి.

అన్ని రాజకీయ పార్టీలూ మరాఠాల పోరాటం పట్ల కంగారు పడ్డారు. రిజర్వేషన్ల కోసం తాము చేపడుతున్న ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందనీ, గమ్యస్థానం చేరుతుందని ఉద్యమానికి పిలుపునిచ్చిన నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్వంసాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఓ రైలుని తగలబెట్టేసింది. గుజరాత్‌లోనూ పటేల్‌ రిజర్వేషన్‌ హింసాత్మక మార్గం పట్టింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమాలు విధ్వంసాల్ని సృష్టిస్తున్నాయి. కానీ మరాఠాలు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. వీరి పోరాటానికి దేశమంతా హ్యాట్సాఫ్‌ అంటోంది.