ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు వెంకయ్యా.

కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడుగారు పదే పదే కాంగ్రెసు పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రత్యేక హోదా విషయంలో. కాంగ్రెస్‌ పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన అధ్యాయం. దేశంలోనూ ఆ పార్టీకి ఉనికి చాలా తక్కువగానే ఉంది. కానీ ఉనికి కోల్పోయిన కాంగ్రెసు పార్టీని ప్రశ్నించి, తాను ఉనికిలోకి రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తాపత్రయ పడుతుండడం శోచనీయమే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వెంకయ్యనాయుడు స్పష్టతనివ్వాలి.

ఐదున్నర కోట్ల మంది సీమాంధ్రులు, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో నరేంద్రమోడీ సమక్షంలో, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఉన్న వేదికపైనే వెంకయ్యనాయుడు ఐదేళ్ళు కాదు, పదేళ్ళు ప్రత్యేక హోదా అవసరం అన్నారు. రాజ్యసభలో కూడా ప్రత్యేక హోదా అడిగింది ఆయన. అలా వెంకయ్యనాయుడు రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హీరో అయ్యారు. ఇది వాస్తవం.

కానీ వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి అయ్యాక మాట మార్చారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నారు. ఎందుకు? అనంటే, విభజన చట్టంలో దాన్ని పొందుపరచలేదని సమాధానమిస్తున్నారు. విభజన చట్టంలో లోటుపాట్లు ఉన్నాయని ఆయన చెబుతూనే, అందులో సవరణలు చేపడతామని మాత్రం చెప్పలేకపోవడం శోచనీయం. కాంగ్రెస్‌ ఎందుకు చెయ్యలేదు? అని ప్రశ్నించడం ద్వారా వెంకయ్య ప్రజలకు సమాధానం చెబుతున్నాననుకుంటే అది హాస్యాస్పదమే.