మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్

స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని ఎర్రకోట ప్రసంగంతో పాకిస్థాన్ ఉలిక్కిపడింది. మోడీ సంధించిన సరికొత్త అస్త్రంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఇప్పుడు దారులు వెతుక్కుంటోంది.మోదీ ప్రసంగం దాయాది దేశం విషయంలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పును ప్రతిబింబించింది. తూర్పు పాకిస్తాన్‌లో తిరుగుబాటు జరిగి 1971లో బంగ్లాదేశ్‌ అవతరించింది. పాకిస్తాన్ రెండు ముక్కలైంది. ఆ విషయంలో తమకు అన్యాయం జరిగిందని చెప్పేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా, భారత్ ను బద్ నాం చేయాలని ప్రయత్నించినా పాకిస్థాన్ విజయం సాధించలేకపోయింది. కశ్మీర్ విషయంలో మాత్రం దౌత్యపరంగా ఆధిక్యం మాత్రం పాకిస్తాన్‌దే అవుతూ వస్తోంది. భారత దౌత్యవేత్తలూ, దేశాధినేతలూ ఆత్మరక్షణ కోసం దారులు వెదక్కోవడంతప్ప పాక్ కు దీటుగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

మోడీ మాత్రం సరికొత్త పంథా అనుసరించారు. పాకిస్థాన్ గడ్డపై ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందో తెలిపారు. ఇలా బలూచిస్తాన్‌లో పాక్‌ పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు మోడీ. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్ గిత్ లో జరుగుతున్న ప్రజా ఉద్యమాలను ప్రస్తావించారు. వాటిని పాకిస్థాన్ ఎలా అణిచేస్తోందో వివరించారు. కొన్ని రోజుల క్రితం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ఏర్పాటుచేసిన అఖిలపక్ష భేటీలోనూ మోడీ ఇలాగే మాట్లాడారు. ఎర్రకోట ప్రసంగంలోనూ దాన్ని కొనసాగించడం అసాధారణమైన విషయంగా మారింది.ఏ దేశ ఆంతరంగిక విషయాల్లోనూ భారత్‌ జోక్యం చేసుకోదని, అలాగే వేరే దేశం మన ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని మన ప్రధానులు చెప్పేవారు. అందుకనుగుణంగానే బలూచిస్తాన్, గిల్ గిత్ పరిణామాలపై ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పాకిస్తాన్‌ మాత్రం సమయం, సందర్భం లేకుండా కశ్మీర్‌ సమస్యను ప్రస్తావిస్తూనే వస్తోంది. ఇక ఏటా ఆగస్టు 14న జరిగేఉ పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం అయితే కాశ్మీర్‌ ప్రస్తావన లేకుండా ఎప్పుడూ ముగియలేదు. బలూచిస్తాన్‌ ఊసెత్తినా అక్కడ భారత్‌ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోందంటూ ఆరోపణలతో ముగించేంది. భారత భద్రతా బలగాల నీడలో కాశ్మీర్ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ప్రపంచ దేశాలను నమ్మించడంలో పాక్ ప్రభుత్వాలు విజయం సాధిన్తూ వచ్చాయి.

అక్కడ స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేనే లేవనీ, మానవ హక్కులు మంటగలిశాయన్న పాక్ ఆరోపణలకు బలం చేకూరుతూ వచ్చింది.ఇప్పుడు మోడీ ప్రస్తావనతో పాకిస్థాన్ గడ్డపై ఏం జరుగుతోంతో అన్న ఆలోచనలను అంతర్జాతీయ సమాజంలో రేకెత్తించినట్లయింది. అందుకే పాకిస్థాన్ భయపడుతోంది. ఇక తన వ్యూహాలు సాధ్యం కావేమో అన్న ఆందోళనలో ఉంది. ఇంతవరకు నరేంద్రమోడీ సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు. భారత్, పాక్ విభజన సమయంలో జమ్మూకాశ్మీర్ మహారాజా హరిసింగ్ తన రాజ్యాన్ని భారత్ లో విలీనం చేశారు. దీన్ని సహించలేని పాక్ 1949లో కాశ్మీర్ లోకి చొచ్చుకు వచ్చింది. కొంతమేర ఆక్రమించింది. దీంతో భారత్ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించింది. దీంతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ ఆక్రమించుకున్న..పాకిస్థాన్ ఆక్రమించుకున్న మేర వాస్తవాధీన రేఖగా పరిగణించాలని ఐరాస సూచించింది. నాటి నుంచి వాస్తవాధీన రేఖ మినహా రెండు దేశాల మధ్య సరిహద్దు అనేది ఇంతవరకు లేకుండా పోయింది. నాటి నుంచి ఆ భూభాగాన్ని పాక్ తమతే అంటుండగా భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా పేర్కొంటోంది. అక్కడి ప్రజలు మాత్రం తమది పాకిస్థాన్ జాగీరు కాదంటారు. ఆజాద్ కాశ్మీర్ గా పరిగణిస్తారు. ఇక ఇక్కడ పాక్ సైన్యానిదే రాజ్యం. అక్కడి ప్రజలకు కనీస హక్కులు శూన్యం. నోరెత్తి మాట్లాడలేరు. ఎదిరించి నిలవలేరు. మీడియాకు కూడా నో ఎంట్రీ. మహిళలు, పురుషులు కలసికట్టుగా రోడ్డెక్కుతున్నారు. పాక్ కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. వీరిదల్లా ఒకటే లక్ష్యం. తమకు స్వేచ్ఛ కావాలన్నదే వారి ఆశయం.

పాకిస్థాన్ స్వాతంత్ర్య దినమైన ఆగస్ట్ 14న ఈ ఆందోళనలు మరీ మిన్నంటాయి. ఆ దేశ పతాకాన్ని తీసేసి స్వతంత్ర బలూచిస్థాన్ జెండాను ఎగరేస్తున్నారంటే పాక్ అంటే వీరికి ఎంత ఆగ్రహమో అర్థమవుతుంది. వీరి ఈ కొట్లాట ఈనాటిది కాదు. భారత్, పాకిస్థాన్ విభజన నాటి నుంచి సాగుతోంది. పంపకాల సమయంలో బలూచిస్థాన్ భారత్ తో ఉండాలని కోరుకుంది. బ్రిటిష్ ప్రభుత్వమూ సరేనంది. భౌగోళికమైన సమస్య వల్ల బలూచిస్థాన్ భారత్ లో కలవడం అసాధ్యమైంది. ఓవైపు బలూచిస్థాన్, మరోవైపు భారత్, మధ్యలో పాకిస్థాన్ ఉన్నాయి. దీంతో భారత్-పాక్ విడిపోయిన 1947లోనే బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత అంటే 1948లో పాకిస్థాన్ ఆ ప్రాంతాన్ని ఆక్రమించింది. బలూచిస్థాన్ ను బలవంతంగా తనలో కలిపేసుకుంది. నాటి నుంచి అక్కడి ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. పాక్ మాత్రం వారి ఆకాంక్షను గౌరవించలేదు సరికదా ఎప్పటికప్పుడు అణచివేత ధోరణి అవలంబించింది. పౌరులపై దాష్టీకానికి దిగుతోంది. బలూచిస్థాన్ ప్రాంతమంతా అపార ఖనిజ వనరుల నిలయం. పెట్రోలియం, సహజ వాయువుతోపాటు బంగారు, మైకా, యురేనియం నిల్వలున్నాయి. పాకిస్థాన్ కు అవసరమైన 80 శాతం గ్యాస్ అవసరాలు బలూచిస్థాన్ తీరుస్తోంది. ఇక సాగరతీరప్రాంతం కూడా ఉండడంతో చైనా మద్దతుతో పాక్ పోర్టులు నిర్మిస్తోంది. ఇక మొత్తం పాక్ భూభాగంలో 45 శాతం బలూచిస్థాన్ ఉంటుంది.

పాక్ కు కావాల్సిన అన్ని వనరులు లభిస్తున్నా అభివృద్ధిలో బలూచిస్థాన్ చాలా అధమంగా ఉంది. అక్కడ సరైన రోడ్లు లేవు. గ్రామాల్లో కరెంటు ఉండదు. సరైన తాగునీరు కూడా దొరకదు. పిల్లలు చదువుకోవడానికి తగినన్ని పాఠశాలలు లేవు. ఇదే వారిలో మార్పుకు దోహదమైంది. తమకు స్వాతంత్ర్యం లభిస్తే తప్ప హక్కులు సంక్రమించవన్న భావన నెలకొంది. అందుకే వారు ఉద్యమిస్తున్నారు. పాక్ మాత్రం అక్కడి అవసరాలేవీ పట్టించుకోకుండా అణచివేతకు దిగుతోంది. ఇక మానవహక్కుల ఉల్లంఘనలకు లెక్క లేదనీ, ఇప్పటి వరకూ 25 వేలమంది పురుషులూ, మహిళలూ, చిన్నారులూ అదృశ్యమయ్యారని అక్కడి హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గుర్తు తెలియని వందలమందిని ఖననం చేసిన సామూహిక సమాధులు అనేకం ఉన్నాయంటున్నారు. పాకిస్తాన్ సైనికులు బలూచీలపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నా, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. సరిగ్గా ఈ అంశాన్నే ప్రధాని మోడీ ప్రస్తావించారు. అక్కడ జరుగుతున్న అత్యాచారాలను నేరుగా ప్రస్తావించారు. అక్కడి ప్రజల హృదయ స్పందనను ప్రపంచం వినేలా చేయగలిగారు. అణచివేతకు గురవుతున్న వారికి తమ గురించి ఎవరు మాట్లాడినా సంతోషమే కదా. మాట సాయం చేసినా ఆనందమే కదా. అందుకే నరేంద్ర మోడీ ప్రసంగాన్ని బలూచి పౌరులు స్వాగతిస్తున్నారు. అక్కడ జరుగుతున్న అంశాలను ప్రస్తావించడం వరకూ, పాక్‌ను ఇరకాటంలో పెట్టడం వరకూ ప్రధాని సక్సెస్ అయ్యారు. బలూచిస్థాన్, పీఓకే, గిల్ గిత్ ప్రజలు..