టాలీవుడ్‌లో ఈ వీకెండ్ సినిమాలు చూస్తే షాకే… భ‌రించలేమా..

టాలీవుడ్‌లో శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు థియేట‌ర్ల‌లో సినిమా సంద‌డి మొద‌ల‌వుతుంది. ప్ర‌తి శుక్ర‌వారం ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే గ‌త రెండు వారాలుగా చూస్తే ఇక్క‌డ త‌మిళ సినిమాల ఆధిప‌త్యం స్పష్టంగా క‌న‌ప‌డింది. గ‌త ముందు వారం విజ‌య్ అదిరింది, విశాల్ డిటెక్టివ్ సినిమాలు మంచి టాక్ తెచ్చుకుంటే డైరెక్ట్ తెలుగు సినిమాల‌ను జ‌నాలు ప‌ట్టించుకోలేదు. 

ఇక గ‌త శుక్ర‌వారం ఏకంగా 10 సినిమాలు థియేట‌ర్లోకి దిగితే త‌మిళ్ డ‌బ్బింగ్ సినిమాలు కార్తీ ఖాకి, సిద్ధార్థ్ గృహం సినిమాలు హిట్ అయ్యాయి. మిగిలిన తెలుగు సినిమాలపై రివ్యూలు రాసేవాళ్లు కూడా క‌రువ‌య్యారంటే ఆ సినిమాల ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఖాకి అయితే ఓ తెలుగు సినిమా రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఫ‌స్ట్ వీకెండ్‌కే ఈ సినిమా రూ.4 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

ఇక గ‌త రెండు వారాలుగా తెలుగు సినిమాల‌ను భ‌రించ‌లేక‌పోతున్నామంటే ఇక వ‌చ్చే వారం కూడా ఆస‌క్తిలేని సినిమాలు కోకొల్ల‌లుగా థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. ఈ వీకెండ్‌లో ఏకంగా 11 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏది ప్రేక్షకుల మెప్పు పొందుతుందో తెలియదు కానీ కొన్ని సినిమాల‌పై మాత్రం కాస్త ఆస‌క్తి ఉంది. బాలకృష్ణుడు, మెంటల్ మదిలో, హే పిల్లగాడా, దేవిశ్రీ ప్రసాద్, నెపోలియన్, జూలి 2, జంధ్యాల రాసిన ప్రేమకథ, జూన్ 143, ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరున్నారండీ బాబు, బేబి, కోకో సినిమాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

వీటిల్లో నారా రోహిత్ – రెజీనా జంట‌గా న‌టించిన బాల‌కృష్ణుడు, ఫిదా తర్వాత సాయి పల్లవి చేసిన‌ హే పిల్లగాడా, నారా రోహిత్ ఫ్రెండ్ శ్రీ విష్ణు హీరోగా రాజ్ కందుకూరి నిర్మించిన మెంటల్ మదిలో కూడా విడుదలవుతోంది.  ప్రతినిధి సినిమా రచయిత ఆనంద్ రవి హీరోగా తెరకెక్కిన నెపోలియన్ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.