చైనాలో బాహుబ‌లి-2 దుమ్మురేపే ఓపెనింగ్స్‌..!

May 5, 2018 at 4:00 pm

బాహుబ‌లి-2 రికార్డుల మోత మోగిస్తోంది. తెలుగు నుంచి మొద‌లై  బాలీవుడ్‌ను దాటుకుని హాలీవుడ్ రేంజ్‌కు చేరిన ఈ సినిమా క్రేజీ ఇంకా ఏమాత్ర‌మూ త‌గ్గ‌లేదు.  ప్ర‌పంచానికి తెలుగోడి స‌త్తా ఏమిటో చూపిన‌ బాహుబ‌లి-ది క‌న్‌క్లూజ‌న్ విడుద‌ల ఏడాది అయినా అనేక‌ రికార్డుల‌ను బ‌ద్ద‌లుకొడుతూనే ఉంది. తాజాగా.. డ్రాగ‌న్ దేశం కూడా బాహుబ‌లి-2 మానియాతో ఊగిపోతోంది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఈ చిత్రం 2017లో భారీ అంచనాలతో విడుదలైన బాక్సాఫీస్‌ వద్ద రూ.1,700కోట్లకు పైగా వసూలు చేసింది. 

 

ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ను తెచ్చుకోవడమే కాదు, జాతీయ అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల చైనాలో కూడా భారతీయ చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘బాహుబలి-2’ను దాదాపు 7000 స్క్రీన్స్ లలో సినిమాను  భారీస్థాయిలో విడుదల చేశారు. విడుదలైన తొలిరోజే ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను అమితంగా ఇష్టపడే చైనీయుల కోసం బాలీవుడ్ నిర్మాతలు బాహుబలి సెకండ్ పార్ట్ ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. మొదటి రోజు ఎవ‌రూ ఊహించని విధంగా కలెక్షన్స్ ని రాబ‌ట్టింది. 

 

ఓపెనింగ్ డే లో ఆల్ టైమ్ ఇండియన్ సినిమాల్లో టాప్ 3 లో నిలిచింది. దీంతో ముందుముందు ఇంకా భారీ వసూళ్లు రాబ‌డుతుంద‌నే టాక్ వినిపిస్తోంది. బ‌హుబ‌లి-2 తొలిరోజే 2.85 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.19కోట్లు) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన భారతీయ చిత్రాల జాబితాలో ‘బాహుబలి 2’ మూడోస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఆమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ను కూడా దాటేసింది. ఈ చిత్రం 2.49మిలియన్‌ డాలర్ల ఓపెనింగ్‌ను మాత్రమే సాధించగా, ఆమీర్‌ నటించిన మరో చిత్రం ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’కు 6.74 మిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉంది. 

 

ఆ తర్వాతి స్థానంలో ‘హిందీ మీడియం’(3.39మిలియన్‌ డాలర్లు) ఉంది. వారాంతానికి ‘బాహుబలి2’ మరిన్ని రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుందని సినీ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. కాగా, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ యాక్షన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకుంది.

చైనాలో బాహుబ‌లి-2 దుమ్మురేపే ఓపెనింగ్స్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share