హంస‌ల‌దీవి ఎపిసోడ్‌పై ట్విస్ట్ ఇచ్చిన బోయ‌పాటి

హంస‌ల దీవి.. కృష్ణా జిల్లాలోని ఈ అద్భుత ప‌ర్యాట‌క స్థ‌లం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇది బాగా పాపుల‌ర్ అయిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కూ కృష్ణా జిల్లా ప‌రిస‌ర ప్రాంతాల‌వారికే సుప‌రిచిత‌మైన ఈ దీవి.. ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లోనూ నానుతోంది. అయితే మ‌రి దీనిని అద్భుతంగా చూపించిన ఘ‌న‌త డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నివాస్‌కే ద‌క్కుతుంది. అయితే ఇక్కడో షాకింగ్ విష‌య‌మేంటంటే.. ఈ దీవి గురించి చాలా మందికి తెలియ‌న‌ట్టే.. మన బోయ‌పాటికి కూడా తెలియ‌ద‌ట‌. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉందిక‌దా! మ‌రి ఇదే ఇక్క‌డ ట్విస్ట్! కృష్ణా పుష్క‌రాల స‌మ‌యంలో అద్భుతంగా హార‌తి సెట్ వేసిన ఆయ‌న‌కు.. ఈ దీవి గురించి తెలియ‌దంటే కొంత షాక్ అవ్వ‌క త‌ప్ప‌దు!!

బోయపాటి సినిమాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు కొద‌వే ఉండ‌దు. ఎమోష‌న్‌ని అలా క్యారీ చేస్తూ.. ఫైట్ స‌న్నివేశాల‌ను పీక్స్‌లో చూపించ‌గ‌ల డైరెక్ట‌ర్‌! ప్ర‌స్తుతం ఆయ‌న తీసిన జ‌య జాన‌కి నాయ‌క సినిమాలో అంతా ఒకేఒక్క ఫైట్ గురించి చెబుతున్నారు. అదే సెకండ్ ఆఫ్లో వ‌చ్చే భారీ యాక్ష‌న్ స‌న్నివేశం! దీనిని హంస‌ల‌దీవిలో తెర‌కెక్కించారు. సముద్ర అలలు ఎగసిఎగసి పడుతుంటే.. పక్కనుండి కృష్ణమ్మ సందడితో హడావుడిగా సముద్రంలో కలుస్తుంటే.. ఆ సీన్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా స్లో మోషన్లో స్పీడ్ కట్టింగ్ లో బోయపాటి శ్రీను, సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ ఆ సీన్ ను తెరకెక్కించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

బోయపాటికి ఈ లొకేషన్ గురించి తెలియనే తెలియదట. బీచ్ ఒడ్డున ఒక ఫైట్ తీయాలి. లేదంటే గంగానది ఒడ్డున కాశీలో తీయాలి అనుకున్నార‌ట‌. బ్యాంకాక్ నుంచి గోవా వరకు.. కాశీ నుండి ఇతర ప్రదేశాల వరకు.. చాలాచోట్ల రెక్కీ చేశాడట. చివరకు కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కృష్ణమ్మ పరవళ్లను చూడ్డానికి వెళ్లి.. అరే ఇదేంటి అదిరిపోయింది అనుకున్నాడట. అలా చూసిన మరుక్షణం అక్కడే షూటింగ్ చేయాలని ఫిక్సయ్యాడట. ఏకంగా 13 రోజుల పాట 4 కోట్లు ఖర్చుపెట్టి ఆ ఎపిసోడ్ ను రూపొందించాడని చెప్పుకొచ్చాడు.

ఒకేసారి 50 హోమాలు జరుగుతున్నట్లు సెట్ వేసి.. వాటర్ లో తడిసినా కూడా షాక్కొట్టని కరెంట్ వైర్లను.. 8 జనరేట్లర్లను అమర్చి.. 40 మంది ఆర్టిస్టులు.. 100 మంది ఫైటర్లు.. 100 మంది బాడీ బిల్డర్లు.. 150 మంది జూనియర్ ఆర్టిస్టులూ.. మొత్తంగా 600+ మంది టీమ్ అక్కడ చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు కొత్త కిక్ ఇచ్చింది మాత్రం దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ అనే చెప్పాలి. అందుకే ధియేటర్లో ఆ ఎపిసోడ్ చూసినప్పుడు వెంట్రుకలు గగుర్పొడిచాయ్.