జై ల‌వ‌కుశ‌ TJ రివ్యూ

టైటిల్‌: జై ల‌వ‌కుశ‌

జాన‌ర్‌: యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ డ్రామా

బ్యాన‌ర్‌: న‌ంద‌మూరి తార‌క‌రామారావు ఆర్ట్స్‌

న‌టీన‌టులు: న‌ంద‌మూరి తార‌క‌రామారావు, రాశీఖ‌న్నా, నివేదా థామ‌స్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌దీప్ రావ‌త్‌, జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె.నాయుడు

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు

వీఎఫ్ఎక్స్‌: అనిల్ పాడూరి అండ్ ఆద్వితా క్రియేటివ్ స్టూడియోస్‌

ఆర్ట్‌: ఏఎస్‌.ప్ర‌కాష్‌

స‌హ నిర్మాత‌: కొస‌రాజు హ‌రికృష్ణ‌

నిర్మాత‌: న‌ంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌

ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌.ర‌వీంద్ర (బాబి)

ర‌న్ టైం: 155 నిమిషాలు

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ప్రి రిలీజ్ బిజినెస్‌: 112 కోట్లు

రిలీజ్ డేట్‌: 21 సెప్టెంబ‌ర్‌, 2107

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం మూడు పాత్ర‌లు పోషించ‌డం, అన్న క‌ళ్యాణ్‌రామ్ నిర్మాత‌గా, త‌న తాత ఎన్టీఆర్ పేరు మీదున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో న‌టించ‌డంతో జై ల‌వ‌కుశ‌పై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో కూడా సక్సెస్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతం భీక‌ర ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు రూ.112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి 2 త‌ర్వాత ఏ సినిమా రిలీజ్ కాన‌ట్టుగా ఏకంగా 2400 స్క్రీన్ల‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి లెక్క‌కు మిక్కిలిగా, స్కైను ట‌చ్ చేసే అంచ‌నాల‌తో వ‌చ్చిన జై ల‌వ‌కుశ ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

క‌వ‌ల అన్న‌ద‌మ్ములైన జై, ల‌వ‌, కుశ త‌ల్లిదండ్రులు చిన్న‌ప్పుడే చ‌నిపోవ‌డంతో వాళ్లు మేన‌మామ ద‌గ్గ‌ర పెరుగుతారు. జైకు న‌త్తిగా ఉండ‌డంతో అంద‌రూ అత‌డిని అవ‌హేళ‌న చేస్తుంటారు. ఇలా చిన్న‌ప్పుడే జై వివ‌క్ష‌కు గుర‌వుతుంటాడు. తెనాలి నాట‌క స‌మాజంలో నాట‌కాలు వేసేట‌ప్పుడు ల‌వ‌, కుశ బాగా హైలెట్ అవుతారు. ఈ టైంలో జ‌రిగిన ఓ బాంబ్ బ్లాస్ట్‌లో ముగ్గురు అన్న‌ద‌మ్మ‌లు విడిపోతారు. 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత క‌ట్ చేస్తే ఈ ముగ్గురిలో ల‌వ చాలా అమాయ‌కుడైన బ్యాంక్ మేనేజ‌ర్‌గా మార‌తాడు. ఇక కుశ పెద్ద క‌న్నింగ్ ఖ‌ర‌త్నాగ్ అయ్యి దొంగ‌త‌నాలు చేస్తుంటాడు. ఓ రోజు జ‌రిగిన ప్ర‌మాదంలో ల‌వ‌, కుశ క‌లుసుకుంటారు. కుశ బ్యాంక్ మేనేజ‌ర్ అయిన ల‌వ ప్లేస్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. అక్క‌డ కుశ చేసే ప‌నుల వ‌ల్ల ల‌వ ఇబ్బందుల్లో ప‌డ‌తాడు.

ఈ స్టోరీ ఇలా ఉంటే వివ‌క్ష‌త‌కు గురైన జై క్రూరుడిగా మారి రావ‌న్ అవ‌తారం ఎత్తుతాడు. రావ‌ణాసురుడంటే ప‌డిచ‌స్తాడు.

బైరాంపూర్‌లో ప్ర‌జ‌ల‌ను శాసించే కింగ్‌గా మార‌తాడు. త‌న సోద‌రులు బ‌తికే ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న రావ‌న్ వారిద్ద‌రితో పాటు లవ ప్రియురాలు ప్రియ (రాశీఖ‌న్నా)ను కూడా కిడ్నాప్ చేస్తాడు. ఓ వైపు స‌మ‌స‌మాజ్ పార్టీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేసే రావ‌న్ త‌న ప్లేస్‌లో త‌న సోద‌రుల‌ను ఎంట్రీ చేయిస్తాడు. మ‌రోవైపు జై త‌ప‌స్వి (నివేద‌)ను ప్రేమిస్తాడు.

త‌ప‌స్వి మాత్రం కుశ‌ను ప్రేమిస్తుంది. అయితే జైను అటు ప్ర‌జ‌లు, ఇటు త‌ప‌స్వి చీత్క‌రించుకుంటుంటారు. మ‌రోవైపు ల‌వ‌, కుశ అన్న జై ను మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటే రావ‌న్ మాత్రం త‌న సోద‌రుల‌ను చంపేయాల‌నుకుంటుంటాడు. మ‌రోవైపు రాజ‌కీయంగా త‌న‌పై పోటీ చేస్తోన్న స‌ర్కార్ కూడా రావ‌న్‌ను చంపాల‌ని చూస్తుంటాడు. చివ‌ర‌కు ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ? ఎలా ముగిసింది ? అన్న‌ద‌మ్ములు ఏమ‌య్యారు ? అన్న‌దే జై ల‌వ‌కుశ క‌థ‌.

TJ విశ్లేష‌ణ‌:

ఈ సినిమా ఫ‌స్టాఫ్ గురించి మాట్లాడుకుంటే ముగ్గురి చిన్న‌ప్ప‌టి క్యారెక్ట‌ర్ల ప‌రిచ‌యం, ల‌వ‌కుమార్ -రాశీఖ‌న్నాతో ప్రేమాయ‌ణం, ల‌వ‌కుమార్‌కు రాశీఖ‌న్నా పెళ్లి సంబంధాలు చూడ‌డం, ల‌వ‌కుమార్ పాత్ర‌లోకి కుశ ఎంట్రీ ఇచ్చి బ్యాంక్‌లో డ‌బ్బు కొట్టేయాల‌ని చూడ‌డం అంతా కామెడీగా సాగిపోతుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌లో ల‌వ‌, కుశ కిడ్నాప్ అవ్వ‌డంతో అస‌లు క‌థ ప్రారంభ‌మ‌వుతుంది.

ఇక సెకండాఫ్‌లో రావ‌న్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట‌నా విశ్వ‌రూపం చూపించాడు. రావ‌న్ అంటేనే ప్ర‌జ‌లు అస‌హ్యించుకుంటోన్న టైంలో త‌న పాలిటిక్స్ కోసం ల‌వ‌ను, నివేద ప్రేమ‌ను పొందేందుకు కుశ‌ను త‌న క్యారెక్ట‌ర్‌లోకి ఎంట్రీ చేయించ‌డం బాగున్నాయి. సెకండాఫ్‌లో నివేద – రావ‌న్‌, కుశ మ‌ధ్య క‌న్‌ఫ్యూజింగ్‌గా సాగే ప్రేమ‌సీన్లు బాగున్నాయి. ఇక క్లైమాక్స్‌లో అన్న‌ద‌మ్ముల మ‌ధ్య అనుబంధం తెలిపే సీన్లు, సెంటిమెంట్ బాగుంది.

మూడు క్యారెక్ట‌ర్ల మ‌ధ్య అనుబంధం చెప్పేందుకు రామాయ‌ణంలోని ఘ‌ట్టాల‌ను చ‌క్క‌గా వాడుకున్నారు. ఇక ఎన్టీఆర్ డైలాగులు సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను గుర్తుకు తెచ్చాయి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

ఈ సినిమాలో న‌టులు గురించి చెప్పాలంటే ఎన్టీఆర్ గురించి మాత్ర‌మే చెప్పుకోవాలి. జై, ల‌వ‌, కుశ క్యారెక్ట‌ర్ల‌లో ఇంకా చెప్పాలంటే రావ‌న్ మారే జై క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ ఆధునిక రావ‌ణుడిగా త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు. క్రూర‌మైన లుక్స్‌, మేనరిజ‌మ్స్‌, డైలాగ్స్‌, యాక్ష‌న్ ఇలా డిఫ‌రెంట్ వేరియేష‌న్ల‌లో ఎన్టీఆర్ తాండ‌వం ఆడేశాడు. ఇక బ్యాంక్ మేనేజ‌ర్‌గా, అమాయ‌కుడైన రోల్‌లో, ఇక క‌న్నింగ్ దొంగ‌గా కుశ క్యారెక్ట‌ర్ కూడా వేటిక‌వే డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. ఓవ‌రాల్‌గా జై రావ‌న్ క్యారెక్ట‌ర్ సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచింది. ఈ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట‌న సీనియ‌ర్ ఎన్టీఆర్‌ను గుర్తు చేసింది.

ఇక పెళ్లిళ్ల మ్యారేజ్ బ్రోక‌ర్‌గా ప్రియా రోల్‌లో రాశీఖ‌న్నా, సెకండాఫ్‌లో క్రూర‌మైన రావ‌న్‌, కుశ‌లు ఇద్ద‌రూ ఇష్ట‌ప‌డే అమ్మాయిగా నివేద న‌టించారు. ఫ‌స్టాఫ్‌లో రాశీకి, సెకండాఫ్‌లో నివేద‌కు స్కోప్ ఉంది. ఓవ‌రాల్‌గా రాశీ క‌న్నా నివేద‌కు మంచి క్యారెక్ట‌ర్ ద‌క్కింది. ఇక స్వింగ్ జ‌రా ఐటెం సాంగ్‌లో త‌మ‌న్నా హాట్ హాట్ అందాల‌తో ఓ ఊపు ఊపేసింది. రావ‌న్ స‌హాయ‌కుడిగా సాయికుమార్‌, హీరోల మేన‌మామ‌గా పోసాని, విల‌న్‌గా రోనిత్‌రాయ్ పాత్ర‌ల వ‌ర‌కు న్యాయం చేశారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి మార్కులు వేయించుకున్నాయి. చోటాకె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీలో ఎక్కువుగా క్లోజ‌ప్ షాట్‌లే సినిమాకు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఉన్నాయి. దేవిశ్రీ సాంగ్స్ ఇప్ప‌టికే క్లిక్ అవ్వ‌గా ఆర్ఆర్ అక్క‌డ‌క్క‌డా పాత వాస‌న‌లు ఉన్నా చాలా సీన్ల‌లో సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. ఆర్ట్ వ‌ర్క్ సినిమా మూడ్‌ను బాగా క్యాప్చ‌ర్ చేసింది. ఎడిటింగ్‌లో కొన్ని చోట్ల క‌త్తెర‌కు ప‌ని చెప్పాల్సి ఉంది. ఇద్ద‌రు సీనియ‌ర్ ఎడిట‌ర్లు కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు ఉన్నా ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు కాస్త లెన్దీ అయ్యాయి. ఇక మాట‌ల విష‌యానికి వ‌స్తే విఏ ర‌జ‌ని అంటే వ‌ర్జిని, మంచిత‌నం పుస్త‌కాల్లో ఉంటే పాఠం, మ‌నం పాటిస్తే గుణ‌పాఠం లాంటి డైలాగులు బాగున్నాయి. నిర్మాత నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విల‌వ‌ల గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఐదుగురు ఫైట్‌మాస్ట‌ర్లు కంపోజ్ చేసిన యాక్ష‌న్ ఎలిమెంట్స్ గుడ్‌. తొలిసారి త‌మ్ముడితో చేస్తోన్న సినిమాకు రాజీలేకుండా ఖ‌ర్చు చేశాడు.

బాబి డైరెక్ష‌న్ క‌ట్స్‌:

ఇక ఇద్ద‌రు ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఉండ‌డం వాళ్ల‌లో ఒక‌రి ప్లేస్‌లోకి మ‌రొక‌రు ఎంట్రీ ఇవ్వ‌డం లాంటి సినిమాలు మ‌నం గ‌తంలోనే చాలా చూశాం. రొటీన్ ఫార్మాట్ క‌థ‌నే తీసుకున్న బాబి ఈ క‌థ‌ను తెర‌మీద చెప్పే విష‌యంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎక్క‌డా ప్రేక్ష‌కుడు క‌న్‌ఫ్యూజ్‌కు గురికాకుండా తెర‌మీద ప్ర‌జెంట్ చేశాడు. కోన వెంక‌ట్‌-చ‌క్ర‌వ‌ర్తి స్క్రీన్ ప్లే కూడా బాగుంది. సాధార‌ణ క‌థ‌ను తెర‌మీద‌కు తీసుకురావ‌డంలో బాబికి మంచి మార్కులే ప‌డ్డాయి. హీరోయిజం ఎలివేట్ చేసే స‌న్నివేశాల్లో అత‌డి ప్ర‌తిభ క‌న‌ప‌డుతుంది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– జై క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం

– ల‌వ పాత్ర‌లో కుశ ఎంట్రీ

– ఇంట‌ర్వెల్ ట్విస్ట్‌

– క‌ళ్యాణ్‌రామ్ నిర్మాణ విలువ‌లు

– సాంకేతికంగా ఉన్న‌త విలువ‌లు పాటించ‌డం

– సెకండాఫ్‌

– స్క్రీన్ ప్లే

– డైరెక్ష‌న్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– కొన్ని సీన్ల‌లో సాగ‌దీత‌

– ర‌న్ టైం

– ఫార్మాట్ స్టోరీ

TJ ఫైన‌ల్ పంచ్‌: జై రావ‌న్ న‌ట విశ్వ‌రూప‌మే

జై ల‌వ‌కుశ మూవీ TJ రేటింగ్‌: 3.25 / 5