నిజాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు…లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

March 8, 2019 at 10:39 am

సినీ ఇండ‌స్ట్రీతోపాటు రాజ‌కీయ‌వ‌ర్గాలు, ప్ర‌జ‌ల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా పోస్ట‌ర్ల నుంచి పాట‌లు, ట్రైల‌ర్ వ‌ర‌కు ప్ర‌తీది అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన ట్రైల‌ర్-1 కు అన్నివ‌ర్గాల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. తాజాగా.. శుక్ర‌వారం నాడు ఈ సినిమా ట్రైల‌ర్‌-2ను విడుద‌ల చేశారు. ఇందులోనూ మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌ను జోడించారు వ‌ర్మ‌. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య కీరోల్ పోషించిన ఎన్టీఆర్ బ‌యోపిక్ రెండు భాగాలు కూడా పెద్ద‌గా జ‌నాద‌ర‌ణ పొంద‌లేక‌పోయాయి. వీటికిపోటీగా వ‌స్తున్న సినిమా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌. తాజాగా.. విడుద‌ల అయిన ట్రైల‌ర్‌లో వ‌ర్మ మ‌రింత డోస్ పెంచాడు. తొలి ట్రైలర్‌లో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలను చూపించిన వర్మ తాజా ట్రైలర్‌లో లక్ష్మీ పార్వతికి సంబంధించిన అంశాల‌ను చూపించాడు. నేను నేను కాదు.. నా ప్ర‌జ‌లు..నా ప్ర‌జ‌లే న‌న్ను ఇంత‌టి వాడిని చేశారు. ఇప్పుడు వాళ్లే న‌న్ను వ‌ద్ద‌నుకుని ఆ ప‌వ‌ర్‌ను వెన‌క్కి తీసుకున్నారు.. అంటూ ట్రైల‌ర్ మొద‌లైంది.

ఆ త‌ర్వాత‌ లక్ష్మీ పార్వతికి ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను చూపించాడు వ‌ర్మ‌. అందులోనూ ఎన్టీఆర్‌ కుటుంబం సభ్యులు ల‌క్ష్మీపార్వ‌తిని ఎలాంటి కామెంట్లు చేశారు.. అన్న అంశాల‌ను ప్ర‌ధానంగా చూపించారు. ఎలా అవమానించారు, ఆమె మీద ఎలాంటి విష ప్రచారం చేశారు అన్న విషయాలను ఈ ట్రైలర్‌లో చూపించారు. అబ‌ద్ధానికి నోరు పెద్ద‌ది.. అన్యాయానికి చేతులు పెద్ద‌వి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌న‌ద‌గ్గ‌ర నిజ‌ముంది.. నిజాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు.. అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్‌తో ట్రైల‌ర్ ముగుస్తుంది. ఇక ఈ సినిమా మార్చి 22న విడుద‌ల కానుంది. పీ విజ‌య్‌కుమార్ ఎన్టీఆర్‌గా, ల‌క్ష్మీపార్వ‌తిగా య‌గ్నాశెట్టి న‌టిస్తున్నారు.

నిజాన్ని ఎవ్వ‌రూ ఆప‌లేరు…లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share