ఎన్టీఆర్ హిట్‌… చిరు ప్లాన్ వెన‌క ఏం జ‌రిగింది..?

కొత్త సీసాలో పాత‌సారా పోసినా.. అది చూడ‌టానికి బాగుంటుంది త‌ప్ప‌.. దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నం మాత్రం శూన్యం! ముఖ్యంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోరుకునే బుల్లితెర‌ ప్రేక్ష‌కులను క‌ట్టిప‌డేసేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కాన్సెప్ట్‌ల‌తో వివిధ టీవీ చాన‌ళ్లు ప్రత్యేక కార్య‌క్ర‌మాలు ప్రారంభిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని హిట్‌.. కొన్ని ఫ‌ట్ అవుతున్నాయి. వీటిలో `స్టార్ మా` తీసుకొచ్చిన రెండు ప్రోగ్రాంల‌లో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్‌` హిట్ అవ‌గా.. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెర‌పై సంద‌డి చేసిన `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` ప్లాప్‌గా నిలిచింది. మ‌రి దీని వెనుక అస‌లు కారణం ఏంట‌నేది ఇప్పుడిప్పుడే అంచ‌నా వేయ‌గ‌లుగుతున్నారు అన‌లిస్టులు!!

సౌత్‌లో సూప‌ర్ హిట్ అయిన `బిగ్‌బాస్‌` షోను తెలుగు ప్రేక్ష‌కుల‌ను కూడా చూపించేందుకు `స్టార్ మా` యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. హిందీలో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. తెలుగులో జూనియ‌ర్ ఎన్టీఆ ర్‌ను తీసుకుంది. ఇప్ప‌టికీ ఈ షో కాన్సెప్ట్ ఎవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా.. ప్రేక్ష‌కులు మాత్రం చూడటం మానట్లేదు. ఇక వీకెండ్‌లో ఎన్టీఆర్ వ‌చ్చే ఎపిసోడ్‌ను మాత్రం టీవీల‌కు అతుక్కుపోయి చూసేస్తున్నారు. దీంతో రేటిం గ్స్ కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. ఇంట్రెస్ట్‌ ఏమాత్రం జనరేట్‌ లేని ఈ షో ఎందుకు క్లిక్‌ అయినట్టు? అట్ట హాసం గా చిరంజీవి బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఎందుకు ఫ్లాపయినట్టు? అనేదే ఇప్పుడు చ‌ర్చ‌!!

అయితే దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అదే ‘క్యూరియాసిటీ’ ఫ్యాక్టర్‌. బిగ్‌బాస్ షో ఎలా ఉంటుందో ఎవ‌రికీ తెలీదు. ఇది పూర్తిగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కొత్త‌గా ఉంది. కావాల్సినంత మ‌సాలా అద్దుతున్నారు అందులో ఉంటున్న వారు!! ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్‌బాస్ షోకి అండగా ఉంటోంది. ఇక `మీలో ఎవరు కోటీశ్వరుడు` షో ఎలాగుంటుంది, ఏం చేస్తారనేది ఏళ్ల తరబడి చూస్తూనే వున్నారు. గ‌తంలో నాగార్జున రెండు సార్లు.. దీనికి హోస్ట్‌గా చేశారు. తొలిసారి వ‌చ్చినంత రేటింగ్స్ రెండోసారి రాలేదు. దీనికి కార‌ణం అందులో కొత్త‌ద‌నం లేకపోవ‌డ‌మే!! ఇక మెగాస్టార్ చిరంజీవి వ‌చ్చినా.. షోకి హోస్ట్ మారారు త‌ప్ప‌.. కాన్సెప్ట్ మాత్రం పాత‌దే!!

పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకునే ఆడియన్స్‌కి ఇలాంటి క్విజ్‌ షోలు కూడా అంత‌గా రుచించవు. ఎన్టీఆర్‌ చేస్తోన్న షో ఏమిటనేది తెలుగు ప్రేక్షకులకి క్లూ లేదు. మిగిలిన షోస్‌ మధ్య ఇది డిఫరెంట్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ షో చూడడంపై ఆటోమేటిగ్గా ఆస‌క్తి మొదలైంది. అదే రేటింగ్స్‌లో కనిపిస్తోంది. ఒక పాత షోని ఎంచుకుని చిరంజీవి ఫెయిల్ అయితే, నార్త్‌లో కాంట్రవర్షియల్‌ షోగా పేరు పడినా కానీ తెలుగులో హోస్ట్‌ చేయడానికి రిస్క్ చేసి ఎన్టీఆర్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు.