
రాంచరణ్‌కు ఇప్పుడు ఓ పరీక్ష ఎదురవుతోంది. అది మామూలు పరీక్ష కాదు అగ్ని పరీక్షగానే చెప్పుకోవచ్చు. తన సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంతకీ ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.. నిజానికి.. టాలీవుడ్లో రాంచరణ్ అగ్రహీరోల్లో ఒకరు. ఆయన మార్కెట్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఇప్పటికే పలు మార్లు రుజువు కూడా అయింది. మగధీర, రంగస్థలంలాంటి చిత్రాలతో తానంటే ఏమిటో.. తన సినిమాకి బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే ఏ రేంజ్‌కి తీసుకెళ్లగలడో చూపించాడు.
అయితే.. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆయనకు చిక్కంతా ఓవర్సీస్లోనే కావడం గమనార్హం. అయితే.. ధృవతో తొలి మిలియన్ డాలర్ల సినిమాని సొంతం చేసుకున్న చరణ్ ‘రంగస్థలం’తో ఏకంగా నాన్ బాహుబలి రికార్డునే నెలకొల్పిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ రంగస్థలం సినిమా క్రెడిట్ దర్శకుడు సుకుమార్‌కే ఎక్కువగా వెళ్తుంది. సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్లో మాంచి బిజినెస్ ఉంటుంది. నిజానికి ఆయన సినిమాలు సమీక్షలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి.
ఇలాంటి సమయంలో బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చాక రంగస్థలం అంత భారీ స్థాయిలో వసూళ్లు చేయడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే.. ఇప్పుడు రాంచరణ్ తన సొంతంగా ఓవర్సీస్లో సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న వినయ విధేయ రామ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే… తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయాలు సాధించిన బోయపాటి సినిమాలు ఓవర్సీస్ మాత్రం ఆదరణకు నోచుకోవడం లేదు. ఓవర్సీస్లో మాస్ యాంగిల్ సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. ఈ నేపథ్యంలో రాంచరణ్ ఓవర్సీస్లో ఎలా నెట్టుకొస్తాడో చూడాలి మరి.