అభిమ‌న్యుడు TJ రివ్యూ

June 1, 2018 at 9:11 am

టైటిల్‌: అభిమ‌న్యుడు

జాన‌ర్‌:  యాక్ష‌న్ & థ్రిల్ల‌ర్‌

న‌టీన‌టులు:  విశాల్‌, స‌మంత‌, అర్జున్‌

మ్యూజిక్‌:  యువ‌న్ శంక‌ర్‌రాజా

నిర్మాత‌:  జి.హ‌రి

ద‌ర్శ‌క‌త్వం:  పీఎస్‌.మిత్ర‌న్‌

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 161 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 1 జూన్‌, 2018

 

తెలుగువాడు అయినా విశాల్‌కు త‌మిళ్‌లో మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలంటే తమిళ్‌లో సినిమాల ప‌రంగానే కాకుండా నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగాను, న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించడం, ఇటు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుండ‌డం, థియేట‌ర్ల విష‌యంలో డిజిట‌ల్ ప్రొవైడ‌ర్ల మొడ‌లు వంచండం ఇలాంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్పుడు విశాల్ సౌత్ ఇండియాలో టాప్ హీరో అయిపోయాడు. ఇటీవ‌ల మంచి క‌థ‌ల‌తో స‌క్సెస్‌లు చూస్తోన్న విశాల్ గ‌త చిత్రం డిటెక్టివ్‌తో ఆక‌ట్టుకున్నాడు. తాజాగా తమిళంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఇరుంబు తిరై’ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ :

క‌రుణాక‌ర‌న్ అలియాస్ క‌ర్ణ (విశాల్‌) తండ్రి చేస్తోన్న ప‌నుల‌తో 12 ఏళ్ల‌కే ఇంటి నుంచి వెళ్లిపోతాడు. మిల‌ట్రీ ట్రైనింగ్ ఆఫీస‌ర్‌గా ఉండే క‌ర్ణ ఎప్పుడూ విప‌రీత‌మైన కోపంతో ఉంటాడు. అక్క‌డ మిల‌ట్రీ అధికారులు క‌ర్ణ‌ను ఏంగర్ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ తీసుకురావాలని ఆర్డ‌ర్ వేయ‌డంతో అత‌డు లతాదేవి (సమంతా) అనే సైకియాట్రిస్ట్‌ను కలుస్తాడు. ఆమె సలహాల మేరకు నెల రోజుల పాటు సొంతూరు వెళ్లి గడపాలని నిర్ణయించుకుంటాడు. అక్క‌డ చెల్లి పెళ్లి బాధ్య‌త తీసుకుని డ‌బ్బుల కోసం బ్యాంక్ లోన్ తీసుకోవాల‌నుకుంటాడు. ఓ ఏజెంట్ హెల్ఫింగ్‌తో ఫేక్ స‌ర్టిఫికెట్లు పెట్టి త‌న తండ్రి పేరు మీద రూ.6 ల‌క్ష‌ల లోన్ తీసుకుంటాడు. డ‌బ్బు అక్కౌంట్‌లోకి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే మాయం అవుతాయి. ఇలా చాలా మంది అమాయ‌కులు మోస‌పోతుంటారు. దీనికి కార‌ణం ఎవ‌రు అని వెతుకుతున్న క‌ర్ణ‌కు చాలా షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. ఈ వ‌రుస సంఘ‌ట‌న‌ల‌కు వైట్ డెవిల్ (అర్జున్)కు ఉన్న లింక్ ఏంటి ?  ఈ వైట్ డెవిల్ ఎవ‌రు ? అత‌డు ఎవ‌రి సాయంతో ఇలా చేస్తున్నాడు ?  మ‌రి క‌ర్ణ ఫైన‌ల్‌గా ఏం చేశాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

 

TJ విశ్లేష‌ణ :

టెక్నాల‌జీతో హ్యాకింగ్ చేయ‌డం అనేది ఇటీవ‌ల కామ‌న్ అయ్యింది. దీని వ‌ల్ల ఎంతో మంది బాధితులు చాలా లాస్ అవుతున్నారు. ఈ కాన్సెఫ్ట్‌తోనే అభిమ‌న్యుడు తెర‌కెక్కింది. కొన్ని వెబ్‌సైట్లు ఓపెన్ చేసిన వెంట‌నే  ‘Allow’ అని ఆప్షన్ వచ్చే ప్రతిసారి ఓకే చేయడం చేస్తుంటాం. దీనిని క్యాష్ చేసుకుని మ‌న స‌మాచారం మొత్తం సేక‌రించేసి మ‌న అక్కౌంట్లో డ‌బ్బులు మాయం చేసేస్తున్నారు. మ‌న‌కు రెగ్యుల‌ర్‌గా ఎవ‌రో ఫోన్ చేస్తారు ?  గిఫ్ట్ వ‌చ్చిందంటారు ?  ఆ బ్యాంక్ నుంచి, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి చేస్తున్నాం.. మీ డేటా ఎవ్వండి మీకు ఆ గిఫ్ట్ వ‌చ్చింది… మా ల‌క్కీడీప్‌లో మీ నెంబ‌ర్ త‌గిలింద‌ని చెపుతుంటారు. మ‌నం ఏమీ ఆలోచించ‌కుండా మ‌న డేటా మొత్తం వాళ్ల‌కు ఇచ్చేస్తుంటాం… ఈ స‌మాచార‌మే హ్యాకింగ్ చేసే వాడికి ఓ ఆయుధం. ఈ ఇతివృత్తంతోనే మిత్ర‌న్ అభిమ‌న్యుడు సినిమా ఆద్యంతం ఉత్కంఠ‌గా తెర‌కెక్కించాడు.

 

డిజిట‌ల్ క్రైంలో మ‌న‌కు తెలియ‌కుండానే ఎలా చిక్కుకుని మోస‌పోతున్నామో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశాడు. మ‌న స్మార్ట్‌ఫోన్ మ‌న జీవితాన్ని ఎదుట‌వాడి చేతుల్లో ఎలా పెడుతుందో ?  మ‌నం ఈ టెక్నాల‌జీ మాయ‌లో ప‌డి ఎంత డేంజ‌ర్‌లో ప‌డిపోతున్నామో చూపిస్తూ అదిరిపోయే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. ప్ర‌స్తుతం ఎక్కువుగా సైబ‌ర్ నేరాలు జ‌రుగుతున్నాయి. ఈ బాధితులు ఎక్కువ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో వీటి భారీన ప‌డ‌కుండా ఎలా ఉండాల‌నేందుకు ఈ సినిమా మంచి సందేశం ఇచ్చింది. 

 

సినిమా ఫ‌స్టాఫ్ కామెడీగా, స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో మూవ్ అవుతుంది. ఇక అస‌లు క‌థ సెకండాఫ్‌లోనే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌కు ఇంట్ర‌స్టింగ్ కంటెంట్ ఉండాలి. మెయిన్ లైన్ బాగున్నా చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వ‌డం, సాగ‌దీసిన భావ‌న క‌లుగుతుంది. మైండ్ గేమ్ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే హీరోయిన్ స‌మంత పాత్ర ప‌రిమితం. అయితే తెర‌పై మాత్రం అందంగా క‌నిపించింది. 

 

ఇక హీరో విశాల్ పాత్ర కంటే విల‌న్ అర్జున్ రోల్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌డంతో పాటు మిగిలిన పాత్ర‌ల‌ను డామినేట్ చేస్తుంది. క్లైమాక్స్‌లో హీరో, విల‌న్ ఎదురుప‌డిన‌ప్పుడు అర్జున్ విశాల్‌ను కంప్లీట్‌గా డామినేట్ చేశాడు. త‌న‌కు ఇచ్చిన పాత్ర‌కు కంప్లీట్‌గా న్యాయం చేశాడు. విశాల్ మిల‌ట్రీ ఆఫీస‌ర్‌గా స‌రైన బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. 

 

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

టెక్నిక‌ల్‌గా యువన్ శంకర్ రాజా అందించిన నేపధ్య సంగీతం చక్కగా కుదిరింది. ముఖ్యంగా విలన్ పాత్ర తెరపై కనిపించే ప్రతిసారి వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. విశాల్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ ఎంచుకున్న క‌థ‌, క‌థ‌నాలు సూప‌ర్బ్‌గా ఉన్నాయి. పైన చెప్పుకున్న‌ట్టు ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ సైబ‌ర్ ఉచ్చులో ఎలా చిక్కుకుని, ఎలా మోస‌పోతున్నారు అన్న కాన్సెఫ్ట్‌ను చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేశాడు.

 

హీరో చెల్లెలు, నాన్న క్యారెక్టర్‌తో ఎమోషన్ పండించాడు. లాజిక్కులు మిస్ అవ్వ‌డం, సాగ‌దీసిన స‌న్నివేశాలు, ఇరికించిన కామెడీ లాంటి మైన‌స్‌లు ఉన్నా ఓ మంచి చిత్రంగా నిలుస్తుంది. ఇప్ప‌టికే కోలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో యువ‌త‌, స్టూడెంట్స్‌కు ఏ సెంట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్ ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఓ మంచి పాయింట్ టచ్ చేసిన ఈ సినిమాను ఖ‌చ్చితంగా ఓ సారి చూడాల్సిందే.

 

TJ సూచ‌న‌:  వాచ్‌బుల్ థ్రిల్ల‌ర్‌

 

అభిమ‌న్యుడు TJ రేటింగ్‌: 3.0 / 5

అభిమ‌న్యుడు TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share