స్పైడ‌ర్‌ TJ రివ్యూ

September 27, 2017 at 3:45 am
Spyder, mahesh babu, AR Murugadas, Review, Rating

టైటిల్‌: స్పైడ‌ర్‌

బ్యాన‌ర్‌: ఎన్వీఆర్ సినిమా

జాన‌ర్‌: స్టైలీష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

నటీనటులు : మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య, ప్రియదర్శి తదితరులు

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్

మ్యూజిక్‌: హరీష్‌ జయరాజ్

నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు

దర్శకత్వం: ఏఆర్.మురుగదాస్

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ర‌న్ టైం: 145 నిమిషాలు

ప్రి రిలీజ్ బిజినెస్‌: 157 కోట్లు

రిలీజ్ డేట్‌: 27 సెప్టెంబ‌ర్‌, 2017

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ ఈ కాంబినేష‌న్‌లో సినిమా కోసం మ‌హేష్‌బాబే ప‌ది సంవ‌త్స‌రాలుగా వెయిట్ చేశాడంటే మురుగదాస్‌తో సినిమా చేయాల‌ని మ‌నోడు ఎన్నిక‌ల‌లు క‌ని ఉంటాడో అర్థ‌మ‌వుతోంది. సోష‌ల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసుకుని సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోను బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టిన మురుగ‌దాస్ – మ‌హేష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం స్పైడ‌ర్‌. దాదాపు యేడాదికి పైగా షూటింగ్ జ‌రుపుకుని కోట్ల మంది నోళ్ల‌లో నానిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. మురుగ‌దాస్ సినిమా అంటేనే సౌత్ ఇండియాలో అన్ని భాష‌ల్లోను హీరోల‌కు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఆరేడు నెల‌లుగా ఊరించి ఊరించి లెక్క‌కు మిక్కిలిగా ఉన్న అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన స్పైడ‌ర్ సినిమా ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాలు అందుకుందో ? లేదో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీస‌ర్ (శివ‌) ప‌బ్లిక్ ఫోన్ కాల్స్ వింటూ వాళ్లు ఎవ‌రైనా స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటే ప‌రిష్క‌రిస్తుంటాడు. త‌ప్పు జ‌రిగేముందు ఆ త‌ప్పును ఆపేందుకు తాను ఈ ఉద్యోగంలో చేరాన‌నే శివ చెపుతుంటాడు. ఈ టైంలో ఓ ఫోన్ కాల్‌తో శివ జీవితంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక సిటీలో రెండు వ‌రుస హ‌త్య‌లు జ‌ర‌గ‌డంతో క‌థ మ‌రో మలుపు తిరుగుతుంది. ఈ రెండు హ‌త్య‌ల‌పై ఇన్వెస్ట్‌గేష‌న్ ప్రారంభించిన శివ‌కు దిమ్మ‌తిరిగిపోయే నిజాలు తెలుస్తాయి ? అస‌లు ఈ హ‌త్య‌లు చేసింది ఎవ‌రు ? ఈ హ‌త్య‌ల వెన‌క కార‌ణం ఏంటి ? ఈ హ‌త్య‌ల‌కు భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌)కు ఉన్న సంబంధం ఏంటి ? స‌మాజాన్ని పూర్తిగా నాశ‌నం చేయాల‌ని భైర‌వుడు వేసిన స్కెచ్‌ల‌ను శివ ఎలా అడ్డుకున్నాడు ? మ‌ధ్య‌లో సిసిలీయా(ర‌కుల్‌)తో శివ‌కు ఉన్న లింక్ ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ‌:

సినిమా స్టార్టింగ్‌లోనే మ‌హేష్ క్యారెక్ట‌ర్ ఏంటో చెప్పాస్తాడు. ప‌బ్లిక్ స‌మ‌స్య‌ల‌ను సీక్రెట్‌గా వినే క్ర‌మంలో ర‌కుల్‌ప్రీత్‌తో ప‌రిచ‌యం, ఆ త‌ర్వాత సిటీలో వ‌రుస హ‌త్య‌ల‌పై మ‌హేష్ ఇన్వెస్ట్‌గేష‌న్ స్టార్ట్ అవ్వ‌డం ఈ హ‌త్య‌ల‌కు కార‌కుడైన భైర‌వుడి గురించి మ‌హేష్ క‌నుక్కోవ‌డం, భైర‌వుడు త‌మ్ముడు అయిన భ‌ర‌త్‌ను చంప‌డంతో ఫ‌స్టాఫ్ ముగుస్తుంది. ఫ‌స్టాఫ్‌లో క‌థ‌నం అంతా స్పీడ్‌గానే మూవ్ అవుతుంది. హీరో-హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ కూడా మామూలుగానే ఉంటుంది.

సెకండాఫ్ మొత్తం థ్రిల్లింగ్‌గా సాగుతుంది. హీరో-విలన్ మధ్య నడిచే గేమ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్లైతే కళ్లుచెదిరేలా వున్నాయి. క్లైమాక్స్‌, క్లైమాక్స్‌కు ముందు వ‌చ్చే సీన్లు అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయి. రోలర్ కోస్టర్ ఫైట్ సీన్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. సెకండాఫ్‌లో విల‌న్ హీరో అమ్మ‌ను, త‌మ్ముడిని చంపేందుకు చేసే ప్ర‌య‌త్నాన్ని హీరో అడ్డుకున్న సీన్‌కు సూప‌ర్బ్‌.

సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఎక్కువుగా ప్లాట్ న‌రేష‌న్‌తో న‌డిచింది. సెకండాఫ్‌లో వ‌చ్చే కొన్ని సీన్లు మాత్రం బాగా రైజ్ అవ్వ‌డంతో పాటు ప్రేక్ష‌కుల‌ను థ్రిల్‌కు గురి చేశాయి. ఎమోష‌న్ కూడా ఓకే. అయితే కామెడీకి, రొమాంటిక్ ట్రాక్‌కు మాత్రం అస్స‌లు స్కోప్ లేదు. స్పైడ‌ర్ మురుగ‌దాస్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న రొటీన్‌ మూవీ మాత్ర‌మే.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

న‌టీన‌టుల్లో మ‌హేష్ త‌న‌దైన స్టైలీష్ యాక్టింగ్‌తో మెప్పిస్తాడు. సీబీఐ ఆఫీస‌ర్‌గా లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌, ఇన్వెస్ట్‌గేష‌న్ సీన్లు చేసేట‌ప్పుడు అద్భుత‌మైన పెర్పామెన్స్ ఇచ్చాడు. హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ క్యారెక్ట‌ర్ మాట్లాడుకోక‌పోవ‌డ‌మే మంచిది. ప‌రిమిత‌మైన సీన్లు, సాంగ్స్ తప్పా ఆమె వ‌ల్ల సినిమాకు యూజ్ లేదు. సినిమాలో 25 నిమిషాలు ఆమె తెర‌మీద ఎక్క‌డా క‌న‌ప‌డ‌దు. సెకండాఫ్‌లో ర‌కుల్ క‌న‌ప‌డిన సీన్లు వేళ్ల మీద సులువుగా లెక్కెట్టేయొచ్చు. సూర్య త‌మ్ముడిగా న‌టించిన భ‌ర‌త్ ఐదు నిమిషాలే తెర‌మీద క‌న‌ప‌డ్డాడు. ఇక ఈ సినిమాతో విల‌న్‌గా మారిన ద‌ర్శ‌కుడు సూర్య త‌న‌లోని విల‌నిజాన్ని కొత్త‌గా ఆవిష్క‌రించాడు. సూర్య చూడ‌డానికి బ‌ల‌మైన విల‌న్‌గా లేక‌పోయినా మాన‌సికంగా స్పై ( మ‌నుష్యుల‌ను చంపడంలో ఆనందం పొందే క్యారెక్ట‌ర్‌) డిజార్డర్ ఉన్న వ్య‌క్తిగా మెప్పించాడు. సూర్య‌లో ఇది కొత్త యాంగిల్‌. మ‌హేష్‌ ఫ్రెండ్ ప్రియ‌ద‌ర్శి, మ‌హేష్ త‌ల్లిగా చేసిన దీపా రామానుజ‌మ్ ఇతర క్యారెక్ట‌ర్లు పాత్ర‌ల వ‌ర‌కు ఓకే. వీళ్ల‌కు పెద్ద స్కోప్ లేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :

సాంకేతికంగా ఈ సినిమాకు అన్ని విభాగాలు బాగానే ఎఫ‌ర్ట్ పెట్టాయి. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎస్సెట్‌. పాట‌ల విష‌యంలో ఆక‌ట్టుకోని హ‌రీష్‌జైరాజ్ ఆర్ ఆర్ మాత్రం చంపేశాడు. చాలా సీన్ల‌లో ఆర్ఆర్ ఎలివేట్ అయ్యింది. స్పై థీమ్ మ్యూజిక్‌తో పాటు త‌న‌కు అల‌వాటైన కోర‌స్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిటింగ్ ప‌ర్‌ఫెక్ట్ లెన్త్‌తో ఉంది. 145 నిమిషాల షార్ట్ ర‌న్ టైం సినిమా వేగంతో ముందుకు క‌దిలేలా చేసింది. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌కు యాక్ష‌న్ ప్రియుల‌కు మంజి విజువ‌ల్ ఫీస్ట్‌. నిర్మాణ విలువ‌లు చూస్తే సినిమాకు రూ.120 కోట్లు పెట్టిన‌ట్టు లెక్క‌లు చెపుతున్నా తెర‌మీద ఆ రేంజ్ ఖ‌ర్చు అయితే క‌న‌ప‌డ‌లేదు.

మురుగ‌దాస్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

మురుగ‌దాస్ పేరు చెపితే చాలామంది సినిమా చూడ‌కుండానే సూప‌ర్‌గా ఉంటుంద‌న్న అంచ‌నాకు వ‌చ్చేస్తారు. అలాంటి బ్రాండ్ ఉన్న మురుగ‌దాస్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌న్నింటి క‌న్నా వీక్ క‌థ స్పైడ‌ర్‌కు ఎంచుకున్నాడా ? అన్న డౌట్ వ‌స్తుంది. ఎంచుకున్న లైన్ వీక్ అయినా త‌న‌దైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్ష‌కుడిని మెప్పించేందుకు ప్ర‌య‌త్నించాడు. సినిమా మొత్తం మీద సెకండాఫ్‌లో చివ‌రి 30 నిమిషాల పాటు వ‌చ్చే గ్రిప్పింగ్ సీన్లు మిన‌హా మిగిలిన చాలా సీన్లు సాదాసీదాగా అనిపిస్తాయి. సినిమాలో రొమాంటిక్ ట్రాక్‌కు, కామెడీకి పెద్ద‌గా స్కోప్ లేకుండా కేవ‌లం క‌థ‌నాన్ని బేస్ చేసుకునే ముందుకు న‌డిపించాడు. ఫైన‌ల్‌గా స్పైడ‌ర్‌లో మురుగ‌దాస్ మార్క్ మిస్ అయ్యింది. అయితే చాలా సీన్లు ఎంత వీక్ అయినా ద‌ర్శ‌కుడిగా మాత్రం మురుగ‌దాస్ వీక్ అవ్వ‌లేదు. ఇలాంటి క‌థ‌నం ఏ సెంట‌ర్స్‌, ఇంటిలిజెన్స్ ప్రేక్ష‌కులు, స్టూడెంట్స్‌కు బాగా క‌నెక్ట్ అవుతుంది. అయితే ఇది మ‌హిళ‌లు, బీసీ, సెంటర్ల ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుందో ? చూడాలి.

ప్ల‌స్ పాయింట్స్ (+)

– మ‌హేష్ స్టైలీష్ యాక్టింగ్‌

– సెకండాఫ్‌

– మురుగ‌దాస్ మార్క్ థ్రిల్ సీన్లు

– హ‌రీష్ జైరాజ్ ఆర్ఆర్‌

– ర‌న్ టైం

మైన‌స్ పాయింట్స్ (-) :

– ఫ‌స్టాఫ్‌లో కొంత పార్ట్‌

– సాంగ్స్‌

– ఫ్లాట్ న‌రేష‌న్‌

– మురుగ‌దాస్ కెరీర్‌లోనే వీక్ స్టోరీ

– హీరోయిన్‌కు స్కోప్ లేక‌పోవ‌డం

– లెస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

– వీఎఫ్ఎక్స్ వీక్‌

TJ ఫైన‌ల్ పంచ్ :

మిస్ అయిన మురుగ‌దాస్ మార్క్

TJ స్పైడ‌ర్ రేటింగ్‌: 2.75 / 5

 

స్పైడ‌ర్‌ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share