టాలీవుడ్ లీల‌లు.. కొండ‌నాలిక‌కు మందేయ‌బోయి..ఉన్ననాలిక‌ను ఊడ‌బెరుకుతారా?

April 25, 2018 at 3:43 pm
tollywood -Media

కొండ‌నాలిక‌కు మందేయాల్సిందిపోయి.. ఉన్న‌నాలిక‌ను ఊడ‌బెరుకుతున్న‌ట్టుగా ఉంది టాలీవుడ్ ప‌రిస్థితి. గ‌త కొన్నాళ్లుగా టాలీవుడ్ ప‌రిస్థితిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ వ‌స్తోంది. న‌టి శ్రీరెడ్డి ఏ ముహూర్తాన `క్యాస్టింగ్ కౌచ్‌`- అంటూ గంద‌ర‌గోళానికి తెర‌దీసిందో.. ఆ క్ష‌ణం నుంచి తెలుగు సినీ రంగంపై నీలి నీడ‌లు ముసురుకున్నాయి. సినీ రంగంలో నిల‌దొక్కుకునేందుకు శ‌రీరాల్ని వ‌ద‌లు కోవాల్సిందేనా అంటూ.. శ్రీరెడ్డి లేవ‌నెత్తిన దుమారం చినుకు చినుకు గాలివాన‌గా మారిన‌ట్టు.. వివాదం మొత్తం ప‌వ‌ర్ స్టార్‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ కేంద్రంగా మారిపోయింది. 

 

ఏదైనా స‌మ‌స్య‌లుంటే పోలీసుల‌కు, న్యాయ వ్య‌వ‌స్థ‌కు ఫిర్యాదు చేయొచ్చంటూ ప‌వ‌ర్ స్టార్ చేసిన సూచ‌న అనంత‌ర కాలంలో తీవ్ర తుఫానుగా మారి ఆయ‌న మెడ‌కే ఉచ్చు బిగించింది. ఈ క్ర‌మంలోనే శ్రీరెడ్డి నోరు పారేసుకుని ప‌వ‌న్ త‌ల్లి అంజ‌నాదేవిని దుర్భాషలాడింది.ఈ విష‌యాన్ని ప‌లు మీడియా సంస్థ‌లు విస్తృతంగా ప్ర‌సారం చేయ‌డం, వాటిపై ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలోవిరుచుకుప‌డ‌డం తెల‌సిందే. ఇక‌, ఈ క్ర‌మంలోనే ప‌లు టీవీ చానెళ్ల య‌జ‌మానులు ప‌వ‌న్‌కు నోటీసులు పంపారు. రాజ‌కీయంగా ఎదుర్కొనే ద‌మ్ములేక‌నే ప‌వ‌న్ ఇలా త‌మ‌పై దుష్ప్ర‌చారానికి దిగుతున్నాడ‌ని స‌ద‌రు య‌జ‌మానులు ఇప్ప‌టికే లీగ‌ల్ నోటీసులు కూడా పంపారు. 

 

అయితే, ప‌వ‌న్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా త‌న శైలిలో తాను ట్వీట్లు చేసుకుంటూ మీడియా అధిప‌తుల‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న మా అసోసియేష‌న్‌కు త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలంటూ.. గ‌డువు కూడా విధించాడు. ఇదిల‌వుంటే, ఈ స‌మ‌స్య‌పై బ‌హిరంగంగా ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌ని మెగాస్టార్ చిరంజీవి హ‌ఠాత్తుగా సినీ హీరోల‌తో ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించ‌డం టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. అయితే, ఆయ‌న అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకున్న ప‌లువురు ప్ర‌ముఖులు.. స‌మ‌స్య‌ను సామ‌ర‌స్యంగానో.. చ‌ర్చ‌ల‌ద్వారానో ప‌రిష్క‌రిస్తాడ‌ని, ఈ విష‌యంలో మెగాస్టార్ త‌న అనుభ‌వాన్ని చూపిస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. 

 

అయితే, మెగా స్టార్ నిర్వ‌హించిన స‌మావేశంలో ఆయ‌న చేసిన తీర్మానం.. హీరోల‌తో ఆయ‌న చేయించిన నిర్ణ‌యం విస్మ‌యానికి దారితీసింది. చిరు నిర్వ‌హించిన ఈ స‌మావేశానికి తార‌క్‌, నాగార్జున‌, మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు, అల్లు అర్జున్‌, చ‌ర‌ణ్, నితిన్ రెడ్డి, సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ఇలా దాదాపు 20 మంది హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు శ్రీరెడ్డి లేవ‌నెత్తిన స‌మ‌స్య‌కంటే కూడా ప‌వ‌న్‌కు ఎదురైన అనుభ‌వం, ఆ త‌ర్వాత ఆయ‌న‌కు అందిన లీగ‌ల్ నోటీసుల‌పైనే చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. అయితే, ప‌వ‌న్ ను న్యాయ‌ప‌రంగా ఇరికించేందుకు, ఆయ‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బంది పెట్టేందుకు మీడియానే కార‌ణ‌మ‌ని ఈ స‌మావేశంలో చిరు ప్ర‌తిపాదించార‌ని తెలిసింది. 

 

దీంతో మొత్తంగా టాలీవుడ్‌లోని హీరోలంద‌రూ..మీడియాను బ‌హిష్క‌రించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. టీవీలు కేవ‌లం సినీ ఇండ‌స్ట్రీపైనే ఆధార‌ప‌డి బ‌తుకుతున్నాయ‌ని, వాటిని ప్రోత్స‌హించ‌రాద‌ని కూడా చిరుచేసిన తీర్మానానికి అంద‌రూ ఔను అని అన్న‌ట్టు తెలిసింది. ఇక‌, చివ‌రిగా ఇక‌పై హీరోలు ఎవ‌రూ మీడియాతో మాట్లాడ‌రాద‌ని, ఇంట‌ర్వూలు ఇవ్వ‌రాద‌ని, మీడియా గొట్టాలు క‌నిపిస్తే.. గ‌ల్లీల్లోకి వెళ్లి త‌ప్పించుకోవాలని కూడా చిరు సూచించిన‌ట్టు టాలీవుడ్‌లో లీకైన వార్త‌ల ద్వారా తెలుస్తోంది. మ‌రి ఈప‌రిణామం ఎంత మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చిరునే ఆలోచించుకోవాలి. వీడియో ఫంక్ష‌న్ల‌కు, ఆడియో ఫంక్ష‌న్ల‌కు, ప్రీరిలీజ్‌ల‌కు, హ‌న్రెడ్ డేస్ ఫంక్ష‌న్ల‌కు మీడియాను ప‌నిగ‌ట్టుకుని ఆహ్వానించే వీరే.. ఇప్పుడు ఏదో స‌మ‌స్య వ‌చ్చింద‌ని మొత్తంగా మీడియానే బ‌హిష్క‌రించాల‌నే నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎంత‌మేర‌కు సమంజ‌స‌మో ఆలోచించుకోవాలి. 

 

నిజానికి మీడియా లేకుండా హీరోల‌కైనా ఎవ‌రికైనా.. మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌నేది అంద‌రికీ తెలిసిందే. అంద‌రూ అంగీక‌రించేదే. అలాంట‌ప్పుడు వ‌చ్చిన స‌మ‌స్య‌ను బూత‌ద్దంలో చూడ‌డం మానేసి ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు వెత‌క్కుండా.. కొండ‌నాలిక‌కు జ‌బ్బుచేస్తే.. దానివ‌ర‌కు మందేయ‌డం మానేసి ఉన్న‌నాలిక‌ను తీసేసుకుంటామంటే.. ఎవ‌రు మాత్రం ఏం చేస్తారు. చెరువుమీద అలుగుతాం.. అంటే ఎవ‌రి గొంతు ఎండిపోతుంది?  చిరుకు ఈ మాత్రం తెలియ‌దా? ర‌గ‌డ‌ను ఇంకా పెంచాల‌ని ఆయ‌న అనుకుంటున్నారా? ఇప్పుడు ఇవే అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. మ‌రి టాలీవుడ్ తుది నిర్ణ‌యం ఎలా ఉంటుందో చూడాలి. 

టాలీవుడ్ లీల‌లు.. కొండ‌నాలిక‌కు మందేయ‌బోయి..ఉన్ననాలిక‌ను ఊడ‌బెరుకుతారా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share