ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో ఆరు సినిమాలు… ప్రేక్ష‌కుల ఆర్త‌నాదాలు

శుక్రవారం సినీ ప్రియులు మెచ్చిన రోజు. వారమంతా కష్టపడ్డ వారు శుక్రవారం మంచి సినిమా చూసి రిలాక్స్ అవుతుంటారు. అందుకే శుక్ర‌వారం, శ‌నివారం, ఆదివారం కొత్త సినిమాలు ఆడే థియేట‌ర్లు అన్ని క‌ళ‌క‌ళ‌లాడుతుంటాయి. ఏ సినిమాల‌కు అయినా ఫస్ట్ వీకెండ్ వ‌సూళ్ల ప‌రంగా చాలా కీల‌కం. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే వారం నుంచి టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉండడ‌తో ఈ శుక్ర‌వారం ఏకంగా ఆరు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. వీటిల్లో రెండు సినిమాలు మంచి అంచ‌నాల‌తోనే వ‌చ్చాయి.

వ‌రుస హిట్ల కోసం ఎప్ప‌టి నుంచో కుస్తీ ప‌డుతోన్న క‌మెడియ‌న్ సునీల్ ఉంగ‌రాల రాంబాబు, నారా హీరో నారా రోహిత్ క‌థ‌లో రాజ‌కుమారి మొదటి ఆప్ష‌న్‌గా ఉన్నాయి. ఇక స‌చిన్ జోషీ వీడెవడు పై కొద్దో గొప్పో అంచనాలు ఉన్నాయి. ఇక శ్రీవల్లి, సరసుడు, పోజెక్ట్ జెడ్ సినిమాలపై ఎలాంటి అంచనాలు లేవు. ఆ చిత్రాలు విడుదలవుతున్నట్లు చాలా మందికి తెలియదు కూడా.

షాక్ ఏంటంటే ఈ ఆరు సినిమాల్లో ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా యావ‌రేజ్ టాక్ తెచ్చుకోలేదు. మూడు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బాల్చీ త‌న్నేశాయి. సునీల్ ఉంగ‌రాల రాంబాబు చూసిన వారికి గింగ‌రాలు తిర‌గ‌డం ఖాయ‌మంటున్నారు. ఇక క‌థ‌లో రాజ‌కుమారిలో రాజ‌కుమారి త‌ప్ప క‌థ లేదంటున్నారు. సచిన్ జోషి నటించిన ‘వీడెవడు’ ట్రైలర్ చూసి ఇదేదో థ్రిల్లర్ కథలాగుందే అని భావించారు. ఈ సినిమా చూడ‌డానికి వెళ్లిన వారికి థియేట‌ర్ల‌లోనే చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయ‌ట‌.

శింబు, నాయన తార, ఆండ్రియా వంటి కలర్ ఫుల్ కాస్టింగ్ ఉందికదా అని ‘సరసుడు’ సినిమా వైపు వెళితే అది షార్ట్ ఫిల్మ్ రేంజ్‌లో కూడా లేదంటున్నారు. ఇక మిగిలిన రెండు సినిమాల గురించి మాట్లాడుకోక‌పోవ‌డ‌మే మంచిదంటున్నారు. ఇలా ఈ శుక్ర‌వారం రిలీజ్ అయిన ఆరు సినిమాలు ప్రేక్ష‌కుల‌కు చుక్క‌లు చూపించేశాయి. ఇక వ‌చ్చేవారం జై ల‌వ‌కుశ మీదే అంద‌రి చూపులు ఉన్నాయి.