నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం మూడు ముక్క‌లాట‌

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ టిక్కెట్టు కోసం అదిరిపోయే ఫైటింగ్ జ‌ర‌గ‌నుంది. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో ఇక్క‌డ త్వ‌ర‌లోనే ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీంతో ఇప్పుడు అధికార టీడీపీలో ఈ సీటు కోసం ఇటు భూమా ఫ్యామిలీతో పాటు మ‌రో రెండు వ‌ర్గాలు చాప‌కింద నీరులా అప్పుడే ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశాయి. ఈ మూడు గ్రూపులు అప్పుడే కార్య‌క‌ర్త‌ల స‌మావేశాలు స్టార్ట్ చేసుకుంటూ తాము రేసులో ఉన్నామంటూ అధిష్టానానికి గ్రీన్‌సిగ్న‌ల్స్ పంపుతున్నారు.

ముందుగా మాజీ మంత్రి ఎండీ.ఫ‌రూఖ్ ఆదివారం కార్య‌క‌ర్త‌ల స‌మావేశం ఏర్పాటు చేశారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో క‌నీసం త‌న పేరును కూడా ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోక‌పోవ‌డంతో సీరియ‌స్‌గా ఉన్న ఫ‌రూఖ్ ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లోను ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి 2019లో కూడా తానే పోటీ చేయాల‌ని ఆయ‌న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని తెలుస్తోంది. ఫ‌రూఖ్‌కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో పాటు, ముస్లింల‌కు మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌నందున త‌న‌కు సీటు ఇస్తే ఆ లోటు కొంత వ‌ర‌కు భ‌ర్తీ అవుతుంద‌ని ఆయ‌న అధిష్టానం వ‌ద్ద కొత్త ప్ర‌తిపాద‌న చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక ప్ర‌ధానంగా నంద్యాల అసెంబ్లీ సీటు ఆశిస్తోన్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తనకు సీటు ఇవ్వాలని ఆయన కోరారు. భూమా కుటుంబానికి సీటు ఇస్తే శిల్ప సోద‌రులు ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది కూడా సందేహంగానే ఉంది. ఇక్క‌డ శిల్ప – భూమా సోద‌రుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద చిక్కులాంటిదే.

ఇక భూమా కుటుంబం నుంచి సీటు ఆశిస్తోన్న భూమా అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇప్పటికే నంద్యాలలో పర్యటిస్తున్నారు. అధిష్టానం నుంచి తనకే సీటు కన్‌ఫర్మ్‌ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయ‌న కూడా కార్య‌క‌ర్త‌ల స‌మావేశానికి రెడీ అవుతున్నారు. ఇక భూమా కుటుంబానికి మ‌ద్ద‌తుగా ఎంపీ ఎస్పీవై.రెడ్డి వ‌ర్గం స‌హ‌క‌రిస్తుంద‌న్న చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ మూడు వ‌ర్గాలను స‌మ‌న్వ‌యం చేస్తూ చంద్రబాబు ఎవ‌రికి ఫైన‌ల్‌గా టిక్కెట్టు ఖ‌రారు చేస్తారో చూడాలి.