ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మూడు ముక్క‌లాట‌..!

ఏపీ బీజేపీలో ప్ర‌క్షాళ‌న‌కు రంగం సిద్ద‌మైంది. ప్ర‌స్తుతం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడును ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. ఆయ‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎంపిక‌వ్వ‌డం కూడా లాంఛ‌న‌మే. దీంతో ఏపీలో బీజేపీని భారీ ఎత్తున ప్ర‌క్షాళ‌న చేసేందుకు బీజేపీ జాతీయ అధిష్టానం రెడీ అవుతోంది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా విశాఖ‌ప‌ట్నం ఎంపీ కంభంపాటి హ‌రిబాబు కొన‌సాగుతున్నారు.

హ‌రిబాబు వెంక‌య్య వ‌ర్గం కావ‌డం, వీరంతా చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండ‌డంతో ఆయ‌న్ను మార్చాల‌న్న డిమాండ్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. తెలంగాణలో అధ్యక్షుడిని మార్చినప్పుడు ఏపీలో ఎందుకు మార్చరన్న ప్రశ్న కూడా తలెత్తింది. హ‌రిబాబును ఏపీ బీజేపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాల‌ని విజ‌య‌వాడ‌లో బీజేపీ కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాలు కూడా చేశారు.

ఇక ఏపీలో పార్టీ బూత్ లెవల్ కార్యకర్తల ఎంపిక కూడా ఇంతవరకూ పూర్తి చేయకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొంత అసంతృప్తితోనే ఉన్నారు. అయితే తాజాగా బీజేపీ అధ్యక్షుడిని మార్చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో పదవి కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇక హ‌రిబాబును త‌ప్పిస్తే ఏపీ బీజేపీ ప‌గ్గాల కోసం ఇప్పుడు పార్టీలో ట్ర‌యాంగిల్ ఫైట్ జ‌రుగుతోంది. న‌ర‌సాపురం ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు పేరు నిన్న‌టి వ‌ర‌కు వినిపిస్తోంది. ఆయ‌న ఆర్ఎస్ఎస్‌, వీహెచ్‌పీల‌కు అత్యంత స‌న్నిహితుడు. అమిత్ షాతో కూడా స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే కాపు సామాజిక‌వ‌ర్గం వారు మాత్రం తాము సూచించిన వారికే ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

కాపు సామాజిక వర్గానికి ఇస్తే సోము వీర్రాజుకు కాని, కన్నా లక్ష్మీనారాయణకు గాని ఇవ్వాల‌ని వారు పార్టీ జాతీయ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశముంది. మ‌రి ఈ మూడు ముక్క‌లాట‌లో ఎవ‌రు ఫైన‌ల్‌గా ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌డ‌తారో ? చూడాలి.