తీవ్ర అసంతృప్తితో వ‌రంగ‌ల్ తూర్పు రాజ‌కీయం

వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. టీఆర్ఎస్‌లో స‌రైన ప్రాధాన్యం లేద‌ని బావిస్తోన్న ఎమ్మెల్యే కొండా సురేఖ దంప‌తులు కాంగ్రెస్‌లోకి వెళ‌తార‌ని వార్త‌లు వ‌స్తుండగా నియోజ‌క‌వ‌ర్గంలోను సురేఖ దంప‌తుల‌పై అధికార పార్టీలోనే అసంతృప్తి భ‌గ్గుమంటోంది. నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మంది కార్పొరేట‌ర్లు సురేఖ భ‌ర్త ముర‌ళీ తీరుపై లోలోన ర‌గిలిపోతున్నారు. ముర‌ళీకి తెలియకుండా ఎవ‌ర‌ది అయినా కార్పొరేట‌ర్ పేరు పేప‌ర్లో వ‌చ్చినా అంతే సంగ‌తుల‌ట‌.

కొండా ముర‌ళికి తెలియ‌కుండా మీటింగ్‌లు పెట్ట‌డానికి కూడా వీల్లేద‌ని ఆదేశాలు జారీ అయ్యాయ‌ట‌. ఇవి ఇలా ఉంటే ముర‌ళీ మాత్రం కార్పొరేట‌ర్ల డివిజ‌న్ల‌తో వాళ్ల‌కు తెలియ‌కుండానే ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను టీఆర్ఎస్‌లో చేర్చేసుకుంటున్నారు. దీంతో స‌ద‌రు కార్పొరేట‌ర్లు కొండా దంప‌తుల తీరుపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు.

తాజాగా గత ఏడాది జరిగిన మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలలో 22వ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ రెబల్‌గా పోటీ చేసిన గడ్డం యుగంధర్‌ గౌడ్‌ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఎమ్మెల్యే కొండా సురేఖ తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. ఇది అక్క‌డ కార్పొరేట‌ర్ భాగలక్ష్మి భర్త మరుపల్ల రవిలో తీవ్ర అసంతృప్తికి కార‌ణ‌మైంది.

స్థానిక డివిజ‌న్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లంతా కొండా దంప‌తుల‌కు వ్య‌తిరేకంగా మీట్ అయ్యారు. పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారిని, త‌మ‌కు చెప్ప‌కుండా పార్టీలో చేర్చుకోవ‌డం ఏంట‌ని వారు ప్ర‌శ్నించారు. కొండా దంప‌తులు త‌మ తీరు మార్చుకోవాల‌ని స్థానిక నాయ‌కులు ఫైర్ అవుతున్నారు. ఇదే అసంతృప్తి నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా మంది కార్పొరేట‌ర్ల‌లో ఉంది.

ఇక కొన్ని డివిజ‌న్లలో కొండా దంప‌తులు చేప‌ట్టే కార్య‌క్ర‌మాలు కూడా కార్పొరేట‌ర్ల‌కే తెలియ‌డం లేదు. డివిజ‌న్ క‌మిటీలు సైతం కార్పొరేట‌ర్ల‌కు తెలియ‌కుండా వారే వేసేస్తుండ‌డంతో కార్పొరేట‌ర్లు డ‌మ్మీలుగా మారిపోతున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఏదేమైనా అటు కొండా దంప‌తులు పార్టీ మారుతున్నార‌న్న వార్త‌ల‌తో పాటు నియోజ‌క‌వ‌ర్గంలో వారిపై ఉన్న తీవ్ర అసంతృప్తితో వ‌రంగ‌ల్ తూర్పు రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారింది.