టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేత‌ర సంబంధం ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు గ‌త నాలుగైదు రోజులుగా వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు గోల్డ్‌స్టోన్ భూముల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయ‌న కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి సైతం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌యంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్‌కు చెందిన మ‌రో ఎమ్మెల్యేపై ఏకంగా వివాహేతర సంబంధం ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్య తాటి వెంక‌టేశ్వ‌ర్లుపై ర‌జ‌నీ అనే మ‌హిళ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ద‌మ్మ‌పేట మండ‌లం పార్క‌ల‌గండికి చెందిన ర‌జ‌నీ, ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర్లుకు వివాహేత‌ర సంబంధం ఉంద‌న్న వార్త‌లు గ‌త ఆరేడు నెల‌లుగా బ‌య‌ట ప్ర‌చారంలో ఉన్నాయి.

ఈ ప్ర‌చారం ఇలా ఉంటే ఈ ప్ర‌చారంతో తాము ఇబ్బంది ప‌డుతున్నామ‌ని ర‌జ‌నీ, ర‌జ‌నీ తండ్రి వెంక‌ప్ప చెపుతున్నారు. ఈ విష‌యాన్ని ఎమ్మెల్యేకు చెప్పుకుందామ‌ని తాము ఆయ‌న ఇంటికి వెళితే ఎమ్మెల్యే తనను బహిరంగంగా కొట్టి పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా నిర్బంధించి కొట్టి రాత్రి విడిచి పెట్టారని వాపోయారు. బాధితులను చర్చలకు పొరుగునే ఉన్న ఏపీలోని చింత‌ల‌పూడి మండ‌లం అల్లిపల్లికి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది.

ర‌జ‌నీ, ర‌జ‌నీ తండ్రి వెంక‌ప్ప‌కు మిగిలిన పార్టీల నేత‌లు అండ‌గా నిల‌వ‌గా వారు కొత్త‌గూడెం డీఎస్పీ సురేంద‌ర్‌రావుకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర్లు వెర్ష‌న్ మ‌రోలా ఉంది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఆరు నెల‌లుగా ర‌జ‌నీకి, త‌న‌కు వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు వ‌స్తోన్న వార్త‌ల్లో ఎలాంటి నిజానిజాలు లేవ‌ని ఆయ‌న కొట్టిప‌డేశారు. ఏదేమైనా ఈ వార్త ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.