టీఆర్ ఎస్‌లో స‌ర్వే మంట‌లు.. ప్ర‌జాద‌ర‌ణ కోల్పోతున్న నేత‌లు

2014లో ఓ ప్ర‌భంజ‌నం మాదిరిగా తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడేళ్లు పూర్త‌య్యాయి. మ‌రో రెండేళ్ల‌లో 2019 ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు కేసీఆర్ ఇప్ప‌టి నుంచే త‌న సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో అధికార పార్టీకి, నేత‌ల‌కు ఉన్న బ‌లాబ‌లాల‌ను, అభిప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ నేప‌థ్యంలో నే ఇటీవ‌ల నేత‌ల ప‌నితీరు ఆధారంగా స‌ర్వే చేయించారు.

గ‌తంలోనూ ఒకసారి ఈ స‌ర్వే చేయించిన కేసీఆర్‌.. అప్ప‌ట్లో వ‌చ్చిన ఫ‌లితాల‌తో సంతృప్తి వ్య‌క్తం చేసినా.. ఇప్ప‌డు వ‌చ్చిన ఫ‌లితాలు మాత్రం ఆయ‌న‌కు దిమ్మ‌తిరిగేలా చేశాయి. ఇదే విష‌యాన్ని ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా నేత‌ల‌కు ఆయ‌న వివ‌రించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల ప‌నితీరు గ‌తంతో పోల్చుకుంటే తాజాగా భారీగా ప‌డిపోయింద‌ని స‌ర్వే చాటింది. గ్రేటర్‌ పరిధిలో 24 నియోజకవర్గాలకు గాను 11 చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి లో ఏడు గురు ప్రజాదరణ కోల్పోతున్నారని సర్వే తేల్చి చెప్పింది.

ప్రజాదరణ తగ్గిన వారు మాత్రం తమపనితీరు మెరుగు పర్చుకోవాలని హితవు పలికారు. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మొదటి స్థానంలో ఉన్నారు. మార్చిలో ఆయన 54.6 శాతం మార్కులు సాధించగా తాజా సర్వేలో 84 శాతం మార్కులతో ముందంజలో ఉన్నారు. మూడు నెలల వ్యవధిలో సాయన్న పనితీరు మెరుగు పర్చుకున్నట్టు సర్వే చెబుతోంది. సనత్‌నగర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా తన పనితీరు బాగా మెరుగుపర్చుకున్నారు. గతంలో బొటాబొటీగా 36.9 పాస్‌ మార్కులు సాధించారు.

కానీ ఇప్పుడు ఏకంగా 67 శాతం మార్కులతో గ్రేటర్‌లో టాప్‌ రెండులో స్థానం సంపాదించారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ గతంలో 40.5 ఉండగా తాజా సర్వేలో 47.7, మల్కాజిగిరి ఎమ్మెల్యే కనకారెడ్డి గతంలో 39.1 సాధించగా ఈ సారి 44.7 మార్కులు సాధించి తమ పనితీరును మెరుగుపర్చుకున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావుకు అతి తక్కువగా 33 మార్కులు వచ్చాయి. గతంలో ఆయనకు 41.5 ఉండగా ఈ సారి ఇంకా తగ్గింది. మ‌రి వీటిని బేరీజు వేసుకుని నేత‌లు త‌మ ప‌నితీరును మార్చుకుంటారో లేదో చూడాలి.