భూకుంభ‌కోణంలో ఆ ఎంపీ పేరు బ‌య‌ట‌కు రావడంతో ఇర‌కాటంలో టీఆర్ఎస్

మియాపూర్ భూకుంభ‌కోణం తెలంగాణ‌లోని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సెగ‌లు రేపుతోంది. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు కేకేకు చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. మియాపూర్ వేల కోట్ల భూకుంభ‌కోణం కేసులో రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు ప్రమేయం ఉన్న‌ట్టు విచార‌ణ‌లో తేలింది.

ఇప్పటికే హైదరాబాద్‌లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరుపెట్టిన ‘గోల్డ్‌స్టోన్‌’ సంస్థ తన దొంగ సొత్తులో ఆయన కుటుంబానికీ భాగం పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ భూముల్లో 38 ఎకరాలను కేకే కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ 38 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కేశ‌వ‌రావు కూతురు, బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి, కోడ‌లు జ్యోత్స్న పేరిట రిజిస్ట‌ర్ చేసిన‌ట్టు అధికారుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. గోల్డ్‌స్టోన్ భూకుంభ‌కోణంలో ముందునుంచి విప‌క్షాలు ఎంపీ కేకే ప్ర‌మేయంపై అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇక కేకే అండ‌తోనే గోల్డ్‌స్టోన్ ప్ర‌సాద్ ఇక్క‌డ పెద్ద ఎత్తున భూక‌బ్జాకు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌లు ముందు నుంచి ఉన్నాయి.

తాజాగా అధికారుల ద‌ర్యాప్తులో కేకే ఫ్యామిలీకి గోల్గ్‌స్టోన్ భూములు రిజిస్ట‌ర్ అయిన‌ట్టు తేల‌డంతో విప‌క్షాల ఆరోప‌ణ‌లు నిజమ‌య్యాయి. 2015లో గోల్డ్‌స్టోన్ కంపెనీ ప్ర‌భుత్వ భూముల‌ను కేకే కుటుంబ స‌భ్యుల‌కు విక్ర‌యించింది. ప్ర‌భుత్వానికి పెద్ద మైన‌స్‌గా మారిన ఈ భూకుంభ‌కోణంలో అధికార టీఆర్ఎస్ ఎంపీ పాత్ర‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీ స‌భ్యుల పేర్లు బ‌య‌ట‌కు రావడంతో టీఆర్ఎస్ ఇర‌కాటంలో ప‌డింది.

కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకుంటారా…!

తెలంగాణ‌లో ఎలాంటి కుంభ‌కోణాలు, అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వెంట‌నే స్పందిస్తూ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మిస్తోన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు గోల్డ్‌స్టోన్ భూకుంభ‌కోణం కేసులో ప్రముఖంగా పేరు వినిపిస్తోన్న త‌న పార్టీకే చెందిన ఎంపీ కేకేపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారా ? అని అటు టీఆర్ఎస్ ఇటు విప‌క్షాలు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. కేకే కుమార్తె విజ‌య‌ల‌క్ష్మి హైద‌రాబాద్‌లో కార్పొరేట‌ర్‌గా కూడా ఉన్నారు. ఏదేమైనా జెట్‌స్పీడ్‌తో దూసుకెళుతూ ప్ర‌తిప‌క్షాలు మాట్లాడేందుకు కూడా ఛాన్స్ ఇవ్వ‌ని కేసీఆర్‌కు ఇప్పుడు కేకే వ్య‌వ‌హారం పెద్ద చిక్కులే తెచ్చిపెట్టేలా ఉంది.