ఏపీలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాలపై టీఆర్ఎస్ క‌న్ను..!

ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ఆవిర్భ‌వించి ప‌దిహేనేళ్ల‌పాటు పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లోను విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ బ్రేకుల్లేని జెట్‌స్పీడ్‌లా దూసుకుపోతోంది. అక్క‌డ టీఆర్ఎస్ దూకుడుకు బ్రేకులేసేందుకు కూడా ప్ర‌తిప‌క్షాలు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ సాధ‌నే ధ్యేయంగా ఏర్ప‌డిన టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో కూడా పోటీ చేస్తుందా ? అంటే ఆ పార్టీ మంత్రులు అవున‌నే అంటున్నారు. తాజాగా సూర్య‌పేట ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ‌లో జ‌రిగిన పార్టీ స‌భ్య‌త్వ న‌మోదులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా ఉన్న టీఆర్ఎస్ వ‌చ్చే ఎన్నికల్లో ఆంధ్రాలోను పోటీ చేస్తుంద‌ని…కృష్ణా జిల్లాలోని జ‌గ్గ‌య్య‌పేట‌, నందిగామ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ గెలుస్తుంద‌ని కూడా చెప్పారు. జ‌గ‌దీశ్ వ్యాఖ్య‌లు ఇలా ఉంటే కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కూడా గ‌తంలో ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో కోడిపందాల‌కు ప‌ర్మిష‌న్ ఇస్తామంటే చాలు త‌మ‌కు ఓట్లేసి గెలిపిస్తార‌ని అన్న సంగ‌తి తెలిసిందే. ఏదేమైనా టీఆర్ఎస్ నాయ‌కుల‌కు స‌డెన్‌గా ఆంధ్రాపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకు వ‌స్తోందో అర్థం కావ‌డం లేదు.