లోకేశ్ కోసం టీవీ-9 రిపోర్టర్‌

సొంత టీమ్‌ను రూపొందించే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి లోకేశ్‌! ముఖ్యంగా ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ‌య్యేందుకు, వారితో స‌త్సంబంధాలు మెరుగుప‌రుచుకునేందుకు అవ‌స‌ర‌మైన స‌భ్యుల‌ను ఏరికోరి మ‌రీ ఎంపిక‌చేసుకుంటున్నారు. ఇత‌ర రంగాల్లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న వారిని త‌న టీంలో చేర్చుకుంటున్నారు. మీడియాలో సంచ‌ల‌నంగా మారిన టీవీ-9 చానెల్‌కు చెందిన‌ రిపోర్టర్‌ను త‌న పీఆర్వోగా లోకేశ్ నియ‌మించుకున్నారు. అలాగే మ‌రో జాయింట్ క‌లెక్ట‌ర్‌ను కూడా త‌న వ‌ద్ద చేర్చుకున్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకేశ్‌ పేషీకి వచ్చే సందర్శకుల సంఖ్య భారీగా ఉంటోంది. ఆయ‌న‌ కేవలం మంత్రే కాకుండా పార్టీలో కీలక నేతగా ఉండటంతో ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూసే వారి సంఖ్య ఎక్కువైంది. పార్టీలో పదవుల దగ్గర నుంచి ప్రభుత్వంలో పోస్టింగ్ ల వరకూ ఆయ‌న రిక‌మెండేష‌న్ కోసం ఎద‌రుచూస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది. ఎవరి పేషీ దగ్గర ఉండనంత మంది లోకేష్ పేషీ దగ్గర బారులు తీరుతున్నారు. ఇటీవల కొంత మంది మంత్రులు కూడా లోకేష్ ను కలవటం కోసం బయట వేచిచూడాల్సి వచ్చింది.

అంతేగాక ఇటీవ‌ల ఆయ‌న బ‌హిరంగ స‌మావేశాల్లో త‌డ‌బ‌డ‌టం కూడా పార్టీ ప‌రంగా కొంత వివాదాస్ప‌ద‌మైంది. విష‌యాల‌పై మ‌రింత అవ‌గాహన పెంచుకోవాల‌ని అంతా సూచిస్తున్నారు. దీనికి సరైన టీమ్ లేకపోవటం…ఆయన ఎవరి మాట వినకపోవటం వంటి అంశాలే కారణం అని ప్రచారం ఉంది. దీంతో ఈ వ్య‌వ‌హారాల‌న్నీ చూసుకునేందుకు సొంతంగా టీమ్‌ను రూపొందించుకుంటున్నారు. అందుకే తన టీమ్ లోకి టీవీ9 రిపోర్టర్ చైత‌న్య‌ను పీఆర్ వోగా తీసుకున్నారు. తొమ్మిదేళ్లుగా టీవీ9లో పనిచేస్తున్న ఆయ‌న్నునియమించుకున్నారు.

దీంతో చైతన్య టీవీ9కి గుడ్ బై చెప్పి మంగళవారం నాడు లోకేష్ టీమ్ లోకి వెళ్లిపోయారు. ఇక నుంచి చైతన్య లోకేష్ ప్రజా సంబంధ వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. లోకేష్ తన పేషీలో ఓఎస్డీగా జాయింట్ కలెక్టర్ గా ఉన్న రంజిత్ బాషాను కూడా నియమించుకున్నారు. మ‌రి కొత్త టీమ్ వచ్చిన తర్వాత అయినా పరిస్థితుల్లో మార్పు వస్తుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.