చిన్నమ్మ దెబ్బకు గోల్డెన్ రిసార్ట్ ఢాం

February 16, 2017 at 10:54 am

గోల్డెన్ బే రిసార్ట్‌.. త‌మిళ‌నాడు ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాదాన్ని అందించే చ‌క్క‌ని ప్రాంతం! నిత్యం ప‌ర్యాట‌కుల‌తో కిల‌కిల‌లాడుతూ ఉండే ఈ రిసార్ట్‌.. కొద్ది రోజులుగా సంచ‌ల‌నాల‌కు వేదిక‌గా మారింది. కొన్ని రోజులుగా త‌మిళ నాట రాజ‌కీయ ప‌రిణామాలు దీని చుట్టూనే తిరిగాయి. నేష‌న‌ల్ మీడియాలో ఈ రిసార్ట్ పేరు మారుమోగిపోయింది. అయితే ఇప్పుడు ఈ రిసార్ట్ క‌ళ త‌ప్పింది. ప‌ర్యాట‌కుల‌కు స్వ‌ర్గ‌ధామంగా ఉండే ఈ రిసార్ట్ ఇప్పుడు ఒక చెడ్డ పేరు మూట‌క‌ట్టుకుంది. గూగుల్ రేటింగ్‌లో ఈ రిసార్ట్‌పై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

కొన్ని రోజులుగా గోల్డెన్ బే రిసార్ట్ వేదిక‌గా హైడ్రామా న‌డిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని ఎత్తులకు పై ఎత్తులు వేసిన శశికళ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందర్ని ఇక్కడ దాచిపెట్టారు. కనీసం వారికి మొబైల్ ట్రాకింగ్, వైఫై, ఇంటర్నెట్ లేకుండా చేశారు. రిసార్ట్ చుట్టూ శశికళ వర్గం మన్నార్ గుడి మాఫియాను దించారు. ఎమ్మెల్యేలను దాచడానికి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రాంతంగా శశికళ భావించడంతో గోల్డెన్ బే రిసార్ట్ ఒక్కసారిగా పొలికల్ మాఫియాగా మారిపోయింది. అయితే ప్ర‌స్తుతం శ‌శిక‌ళ‌కు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించ‌డంతో.. ఎమ్మెల్యేలంతా ఇప్పుడు రిసార్ట్ వ‌దిలి బ‌య‌టికి వ‌స్తున్నారు. ఉన్న‌న్ని రోజులు రాజ‌భోగాలు అనుభ‌వించిన వారంతా.. చాలా భారంగా వెనుతిరుతున్నారు. అయితే శశికళ  ఎఫెక్ట్ గోల్డెన్ బే రిసార్ట్ కు భారీగా తగులుతోంది.

ఒక్కసారిగా ఈ రిసార్ట్ త‌న‌ పేరు ప్రతిష్టలన్నీ భారీగా కోల్పోతుంది. గూగుల్ రేటింగ్స్ అన్నీ తలకిందులుగా వస్తున్నాయి. శశికళ లాంటి రాజకీయ నాయకులకు సురక్షిత ప్రాంతంగా ఈ రిసార్ట్ మారడంతో దీనికి ఈ పరిస్థితి ఏర్పడింది. కనీసం ఈ రిసార్ట్ లో భద్రత ఉండదని, అక్కడ పొలికల్ మాఫీయా గ్రూప్ ఉందంటూ గూగుల్ రివ్యూలో నెటిజన్లు పేర్కొంటున్నారు. క్రిమిన‌ల్స్ సుల‌భంగా లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి వీలుందంటూ నెటిజన్ మండిప‌డుతున్నాడు . హోటల్ మేనేజ్ మెంట్ కూడా అక్కడ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

మొత్తం అక్కడ థర్డ్ క్లాస్ రౌడీలే ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్లొదంటూ సూచిస్తున్నారు. మాఫియా గ్రూప్ ఉంటున్న ఈ ప్రాంతం పర్యాటకులకు ఎలా సురక్షితమో చెప్పడని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు కూడా ఈ రిసార్ట్ పై మండిపడుతున్నారు. దీని ఫలితంగా గూగుల్ లో రిసార్ట్ కు వస్తున్న రేటింగ్స్ చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఓడ‌లు బ‌ళ్లు అవ‌డం.. బ‌ళ్లు ఓడ‌లు అవ‌డం అంటే ఇదేనేమో అనిపించేంత‌గా.. ఒక‌వెలుగు వెలిగిన రిసార్ట్ ఇప్ప‌డు చెత్త రిసార్ట్ గా విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటోంది.

చిన్నమ్మ దెబ్బకు గోల్డెన్ రిసార్ట్ ఢాం
0 votes, 0.00 avg. rating (0% score)

comments